Tuesday, 27 October 2015

‘సీమ’ నుంచి రాజధానికి 6 లైన్ల రహదారి

‘సీమ’ నుంచి రాజధానికి 6 లైన్ల రహదారి
Updated :28-10-2015 00:28:32
  • అటవీప్రాంతానికి నష్టం లేకుండా నిర్మించండి
  • కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కో రోడ్డు తరహాలో..
  • ఇచ్ఛాపురం- తడ బీచ్‌ కారిడార్‌ రోడ్డు
విజయవాడ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
అటవీప్రాంతానికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా రాయలసీమ నుంచి రాజధాని అమరావతికి ఆరు వరుసల రహదారిని నిర్మించాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి నాలుగు వరుసల రోడ్లు నిర్మించి, అవి మూడూ కలసిన చోటు నుంచి రాజధాని వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మించాలని సీఎం సూచించారు. మంగళవారం రోడ్లు-భవనాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతపురం నుంచి అమరావతికి చేరుకొనేందుకు ప్రస్తుతం 472 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, ఈ మార్గంలో వంపులు, అతి పెద్ద మలుపులను తొలగించి నేరుగా రహదారిని నిర్మిస్తే 86 కిలోమీటర్ల దూరం తగ్గి 386 కిలోమీటర్లు వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ మార్గంలో 25 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంటుందని తెలిపారు. అటవీ ప్రాంతానికి, మధ్యలో వచ్చే నీటివనరులకు నష్టం లేకుండా రహదారి మార్గాన్ని రూపొందించామని అధికారులు చెప్పారు. అయితే, మధ్యలో రెండు లేక మూడు టన్నెల్స్‌ నిర్మాణం తప్పనిసరి అవుతుందని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం జరిగితే అనంతపురం నుంచి రాజధానికి 5 గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు. కృష్ణపట్నం నుంచి రావూరు, కడప, చిట్వేలు, తాడిపత్రి, గుత్తి మీదుగా నాలుగు వరుసల రహదారిని నిర్మించి బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారికి లింకు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
ఇచ్ఛాపురం - తడ మధ్య ఏర్పాటు చేయనున్న బీచ్‌ కారిడార్‌పై అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కారిడార్‌ను నాలుగు ప్యాకేజీలుగా రూపొందించనున్నట్టు తెలిపారు. భోగాపురం, గంగవరం, విశాఖ, కాకినాడ, అంతర్వేదిలను కలిపే మొదటి ప్యాకేజీని త్వరగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 14 మీటర్ల కమర్షియల్‌ రోడ్డు, రెండు మీటర్ల వాక్‌ వే, రెండు మీటర్ల సైకిల్‌ వే, రెండు మీటర్ల యుటిలిటీ రోడ్డు ఈ బీచ్‌ రోడ్డులో అంతర్భాగంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కో, మెల్‌బోర్న్‌-విక్టోరియా రోడ్లను అధ్యయనం చేసి ఆస్థాయిలో ఇక్కడ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తున్న ఆర్వీ అసోసియేట్స్‌ ప్రతినిధులు ఆయా దేశాలను సందర్శించి తుది నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉన్న ఎకరంన్నర స్థలంలో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేలా భవనాన్ని ఆరు నెలల్లో నిర్మించవచ్చని, దాన్ని వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు కేటాయించవచ్చని శ్యాంబాబ్‌ ప్రతిపాదించారు. దీనిపై పూర్తి ప్రణాళికను సిద్ధం చేసి నిర్మాణం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు..

No comments:

Post a Comment