ఈ విషయంలో ఆ మోజు తగ్గాల్సిందే! Updated :16-10-2015 15:18:11 |
నేడు అంతర్జాతీయ ఆహార దినోత్సవం
పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్న చందంగా మన నేలపై పండే ఆహార పంటలను కాదని పరాయి మోజులో పడిపోతున్నారు నేటి నగరవాసులు. కావాల్సినన్ని పోషకాలు అందించే కొర్రలను కాదని ఓట్సుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శక్తితోపాటు ఆరోగ్యాన్ని కలిగించే రాగులు, సజ్జలు, జొన్నలు వంటి తృణధాన్యాలను వదిలి హార్లిక్స్, బోర్నవిటా వంటి కృత్రిమ పొడులకు ఆకర్షితులవుతున్నారు. నూడిల్స్, పిజ్జా, బర్గర్లకు దాసోహమంటున్నారు. ఫలితంగా జబ్బుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఓట్స్ తీసుకుంటుంటారు. మనం వాడే వంటనూనెల కన్నా ఆలీవ్ ఆయిల్ మెరుగైనదని భావిస్తారు. మన దగ్గర లభించే జామకాయ కన్నా సిమ్లాలో పండే యాపిల్‌లోనే పోషకాలు ఎక్కువని అనుకుంటారు. ఓట్స్, ఆలీవ్, యాపిల్ ఇవన్నీ మంచివే కావచ్చు. కానీ మన ప్రాంతంలో లభించే ఆహారపదార్థాలు కావు. మన శరీరంలోని అవయవాలు, అవి పనిచేసే విధానాలు, రసాయన చర్యలు, జీవక్రియకు ఉపయోగపడే కణాలు, గ్రంథులు ఇవన్నీ కూడా మన ప్రాంతంలోని తరతరాలుగా వస్తున్న ఆహారఅలవాట్లకు అలవాటుపడుంటాయి. మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు, పోషకాలు, పిండిపదార్థాలు, మాంసకృతులు ఇవన్నీ మన ప్రాంతంలో పండే ధాన్యం, పప్పుదినుసులు, కూరగాయల్లోనే ఎక్కువగా దొరుకుతాయి. కావున మనకు పరిచయమున్న, అలవాటైన ఆహారం ఉత్తమమైనది అంటారు ప్రకృతి వైద్యనిపుణులు డా. సత్యలక్ష్మి.
తెలియనిది తింటే తంటాలే!
మన దేశంలో ఎక్కువగా గోధుమలు, బియ్యం వాడకంతో చేసిన పదార్థాలే తింటారు. అదే పాశ్చాత్య దేశాలవారు, ఆ దేశాల వాతావరణం ఆధారంగా వారు నివశించే వాతావరణానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు ఉంటాయి. అలా కాదని ఏ కారణంతోనైనా ఆహారనియమాలు మారితే శరీరంలో కూడా మార్పులు వస్తుంటాయి. ఇటువంటి మార్పు మంచి దిశగా ఉండచ్చు లేక వ్యాధికారక సమస్యలవైపు దారిమళ్లించవచ్చు. కొత్త లేదా తెలియని పదార్థాలను శరీరం త్వరగా స్వీకరించలేదు. దీని వల్లనే 80శాతం మంది అజీర్తి, జీర్ణకోశవ్యాధులు, మలబద్ధకం వంటి వ్యాధుల బారిన పడుతుంటారని అంతర్జాతీయ పరిశోధనల్లో తేలింది.
నగరం చుట్టుపక్కల
భాగ్యనగరానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు రంగారెడ్డిలో జొన్నలు, కూరగాయలు, ద్రాక్ష, జామతో పాటు కంది వంటి పంటలు పండుతాయి. మరో పక్కనున్న మెదక్ జిల్లాలో జొన్నలు, శనగ, అల్లం, కూరగాయలు, కందులు, మొక్కజొన్న, మామిడి వంటి పంటలు...నల్గొండలో పల్లీ, పెసలు, వరి, కందులు, మిర్చి, నిమ్మ పంటలు విరివిగా పండుతాయి. ఇక రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, సామలు, అలసందలు, సోయాబీన్, మొక్కజొన్న వంటి తృణధాన్యాలు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే వీటి వాడకం నేడు నగరంలో చాలా వరకు తగ్గిందనే చెబుతున్నారు పోషకాహారనిపుణులు.
అంతా రెడీమేడ్
రెండు నిమిషాల్లో సిద్ధమైయ్యే నూడిల్స్, క్షణంలో దోశ, ఇడ్లీ, చపాతీ తయారుచేసుకునే విధంగా రెడీటూ మిక్స్ ప్యాక్‌లు, పిల్లల స్నాక్స్ బాక్సులోకి కురుకురేలు, స్వీట్‌కార్న్‌లు ఇసుమంత కష్టపడకుండా అన్నీ సూపర్‌మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. చాలా మంది నగరవాసులు రోజూవారీ పనిలో పడి ఎక్కువసమయం కంప్యూటర్లతో గడపడం వల్ల తీరిక, ఓపిక లేక కర్రీపాయింట్లు, రెస్టారెంట్లపైనే ఆధారపడుతున్న పరిస్థితి. ప్యాకెట్ ఫుడ్‌లలో తప్పనిసరిగా అవి నిల్వఉండటానికి కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. అవి శరీరంలోని హార్మోన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడంతోపాటు పిల్లల్లో హైపర్‌యాక్టివిటీని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
హోటల్ ఫుడ్‌తో జాగ్రత్త
ఈ మధ్యకాలంలో వంటచేసుకునే ఓపిక లేక ఎక్కువశాతం మంది హోటల్స్‌మీదే ఆధారపడుతున్నారు. బయట ఆహారపదార్థాలకు అలవాటు పడుతున్నారు. అయితే వారు శుచి, శుభ్రత పాటిస్తారా అనేది ఓ ప్రశ్న అయితే అందులో నూనె, ఉప్పు, కారం వంటివి సహజంగానే ఎక్కువ వాడటం, రుచిగా ఉండటంకోసం అనవసరమైన మసాలా పొడులు చల్లడం వంటివి జరుగుతాయి. వాటి వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అంతేకాక ఉదయం వండిన పదార్థాలు మిగిలినవి మళ్లీ సాయంత్రం వేడిచేసి వడ్డించడం, మళ్లీ నూనెలో వేపడం వంటివి చేస్తుంటారు. దీని వల్ల కడుపులో అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డా. అనీల్ చెరుకూరి.
శరీర బరువును తగ్గించే రాగులు
బరువు తగ్గాలనుకునేవారికి రాగులు మంచి ఆహారం. దీనిలో ఫైబర్, ఇనుము ఎక్కువగా ఉంటాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. రాగులతో ఇడ్లీ, దోశ, లడ్డు, రాగిముద్ద, జావ వంటి రకరకాల వంటలను తయారుచేసుకోవడం మంచిదని చెబుతారు వైద్యులు.
రక్తపోటును అదుపుచేసే సజ్జలు
కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు అధిక రక్తపోటును అదుపుచేయగల గుణం సజ్జలకుంది. ఇందులో ఉండే బీ కాంప్లెక్స్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, పొటాషియమ్, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులోని ఫైబర్ మలబద్ధక సమస్యను పోగొడుతుంది. సజ్జలను తీసుకోవడం వల్ల మహిళలు ఎర్లీ మెనోపాజ్ సమస్యను అధిమించవచ్చని చెబుతున్నారు వైద్యులు. ఆస్తమాతో బాధపడే పిల్లలకు సజ్జలతో చేసిన ఆహారం పెట్టడం మంచిది.
మధుమేహానికి కొర్రలు మంచివి
కొర్రల్లో యంటీయాక్సిడెట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల శరీర దారుఢ్యానికి మంచి ఆహారంగా కొర్రలను చెబుతారు. అంతేకాకుండా ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో పెడుతుంది. మధుమేహాన్ని కట్టడి చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను అదుపులో ఉంచగలుగుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. కొర్రలతో అన్నం, ఉప్మా, పాయసం వంటి వంటకాలు చేస్తారు. నగరంలో చాలా మంది వైద్యులు కొర్రలను ఆహారంగా తీసుకోమని మధుమేహ బాధితులకు సూచిస్తున్నారు.
శక్తిని అందించే జొన్నలు
శరీర బరువు తగ్గాలనుకునేవారికి, మలబద్ధకంతో బాధపడేవారికి అనువైన ఆహారం జొన్నలు. ఇందులో ఫైబర్ ఇతర పోషకాలు గుండె సంబంధిత జబ్బులను అదుపు చేస్తాయి. మంచి ఆరోగ్యానికి శక్తితో పాటు శరీర ఎదుగుదలకు జొన్నలు ఎంతో మేలు చేస్తాయి. గతంలో తెలంగాణ గ్రామీణప్రాంతంలో జొన్నరొట్టెనే ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. వారు చాలా ద్రుఢంగా, ఆరోగ్యంగానూ ఉండేవారు. మధుమేహం, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్, మలబద్ధకంతో ఇబ్బందిపడేవారు జొన్నలతో చేసిన వంటకాలు రోజూ వారీ ఆహారంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు పోషకాహారనిపుణులు.
మంచిని చిన్నచూపు
ఈ తృణధాన్యాలన్నీ కూడా మంచి పోషకాలు, శక్తిని అందించడంతోపాటు ఊబకాయాన్ని రాకుండా చేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులనుంచి కాపాడతాయి. గుండె సంబంధిత వ్యాధులను దూరంచేస్తాయి. ఇవి చేసే మేలు కాదని మన మనస్సంతా నేడు పిజ్జా, బర్గర్లవైపు పరుగెడుతోంది. బజ్జీలు, పునుగులు వంటి నూనెపదార్థాలను ఇష్టపడుతోంది. దానివల్ల అధికబరువు సమస్య ముప్పు పొంచి ఉంటోంది. దీనికితోడు శరీర వ్యాయామం లేకపోవడంతో అనేక రకాల వ్యాధులకు శరీరం ఓ పుట్టినిల్లవుతుంది. కావున మనం తినే ఆహారం మన శరీర ఆరోగ్యాన్ని, మన బంగారు భవిష్యత్తును శాసిస్తుందని గమనించాలి. మనం ఏం తింటున్నామో గుర్తెరగాలి.
హార్లిక్స్, బోర్నవిటా కన్నా
ఖరీదైన ఆహారమే ఆరోగ్యకరమైనదనే అపోహ చాలామందిలో ఉంది. నేడు మార్కెట్లో దొరికే హార్లిక్స్, బోర్నవిటాలను బలవర్థకమైన ఆహారంగా భావిస్తారు. పిల్లలకు అవే ఇస్తారు. వీటి బదులు మొలకెత్తిన రాగులు, సజ్జలు, సోయాబీన్, పెసలు, పల్లీలను దోరగా వేయించి వాటిలో యాలుకలు, స్థోమతను బట్టి బాదం, జీడిపప్పు వంటివి చేర్చి పొడిలాగా చేసి రోజూ పిల్లలకు పాలల్లో కలిపి ఇవ్వడం మంచిది అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
మనం తీనే ఆహారం మోతాదును శ్రమను బట్టి, చేసే పనులను బట్టి నిర్థారించుకోవాలి.
మన జీవక్రియ సూర్యునితో అనుసంధానమై ఉంటుంది. అందుకే ఉదయం అల్పాహారం ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం మితంగా తినాలి. రాత్రివేళలో అర్ధాకలితో ముగించడం ఆరోగ్యదాయకం అంటారు డాక్టర్లు. హైదరాబాద్‌కు 100కిలోమీటర్ల దూరంలోని 57గ్రామాలలో డెక్కన్ డెవలప్ మెంట్ సంస్థ ఆధ్వర్యంలో పూర్తి సేంద్రీయ పద్ధతిలో తృణధాన్యాలను పండిస్తున్నారు రైతులు. వారు పండించిన ఆహార పంటలను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు.
వారి చిరునామా డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, 101, కిషన్ రెసిడెన్సీ, ప్యాంటలూన్స్ ఎదురుగా
బేగంపేట్, హైదరాబాద్ , ఫోన్ నెంబర్లు : 040- 27764577, 27764744, 27764722 |
No comments:
Post a Comment