Monday 12 October 2015

59 నుంచి 83కు ఎలా చేరింది?.. జగన్‌ షుగర్‌ స్థాయిపై మంత్రి కామినేని డౌట్‌

59 నుంచి 83కు ఎలా చేరింది?.. జగన్‌ షుగర్‌ స్థాయిపై మంత్రి కామినేని డౌట్‌ 
Updated :12-10-2015 01:06:46
ఉనికి కోసమే జగన్‌ దీక్ష: పల్లె 
పండుగ రోజుల్లో దీక్షలా: రేణుక 
 
గుంటూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘నిరవధిక దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌ షుగర్‌ స్థాయి ఆదివారం ఉదయం 11 గంటలకు 59కి పడిపోయింది. అయితే మధ్యాహ్నం మూడు గంటల తరువాత షుగర్‌ స్థాయి 83కు చేరింది. ఇది ఎలా సాధ్యమో వైద్యుడిగా నాకే అర్ధం కావడం లేదు’’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అనుమానం వ్యక్తం చేశారు. గుంటూరు ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో ఆదివారం జగన్‌ ఆరోగ్య పరిస్థితి, వైద్యులు ఇచ్చిన నివేదికను ఆయన విలేకరులకు వివరించారు. జగన్‌ దీక్ష ప్రారంభించిన మొదటి రెండు రోజులు రోజుకు రెండు సార్లు షుగర్‌ పరీక్షలు చేశామని.. తర్వాత మూడు సార్లు చేశామని చెప్పారు. జగన్‌ ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్‌బులిటెన్‌ విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. దీక్షను భగ్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు. ‘‘జగన్‌ షుగర్‌ స్థాయి 91 - 85, 97 - 88, 87 - 82 గా నమోదవుతుంది. ఆదివారం వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది’’ అని చెప్పారు. జగన్‌ ఆరోగ్యంపై సీఎ చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని కామినేని చెప్పారు. జగన్‌ దీక్ష, ఆరోగ్య పరిస్థితిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. కాగా, రాజకీయ ఉనికి కోసమే జగన్‌ దీక్ష చేస్తున్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భోగాపురం ఎయిర్‌పోర్టు వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడాన్ని జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. బందరు పోర్టుతో వేలాది మందికి ఉపాధి లభించడం జగన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. రాయలసీమలో పుట్టి సీమకు సాగు, తాగునీరు వచ్చే పట్టిసీమను అడ్డుకుంటున్న జగన్‌ వైఖరిని సీమ ప్రజలు అసహ్యించుకుంటున్నారు’’ అని ధ్వజమెత్తారు. వైఎస్‌ హయాంలో 110 సెజ్‌లకు 5 లక్షలు ఎకరాలు దానం చేస్తే... జగన్‌ కమీషన్లు వసూలు చేసుకుంటూ కూర్చున్నారని విమర్శించారు. ఇక.. వైసీపీ అధినేత జగన్‌ హిందూ సంప్రదాయ పండుగలను అవమానించేలా ఆ రోజునే దీక్షలు, బంద్‌లు చేపడతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక మండిపడ్డారు. గతంలో రాఖీ పండుగ రోజున ధర్నా తలపెట్టిన జగన్‌... వినాయక నిమజ్జనం, దసరా పండుగ రోజుల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా దీక్షలు, బంద్‌లు తలపెడతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఆదివారం ఎన్టీఆర్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ... యువత ‘ఫ్యాన్‌’ గాలి మాయలో పడొద్దని హితువు పలికారు. ‘‘రాష్ట్ర ప్రయోజనాల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లో ఉన్న 231 ఉమ్మడి సంస్థల్లో జగన్‌ చీకటి మిత్రుడు కేసీఆర్‌ కబ్జాను నివారించి రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగే చర్చలు ఎందుకు చేపట్టలేదు’’ అని ప్రశ్నించారు.

హెచ్చుతగ్గులు సాధారణమే - జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ 
ఐదు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ రక్తంలో ఎటువంటి కీటోన్స్‌ గుర్తించలేదని జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఉదయకుమార్‌ తెలిపారు. జగన్‌ షుగర్‌ లెవల్స్‌ పెరుగుదలపై వచ్చిన విమర్శలపై వైసీపీ నేతలు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల వివరణ కోరారు. దీనిపై ఉదయకుమార్‌ వివరణ ఇచ్చారు. ఏడు గంటల సమయంలో పరీక్ష నిర్వహించినప్పుడు సాధారణ పద్ధతుల్లో ఉపయోగించినట్లుగా గ్లూకోమీటర్‌ను ఉపయోగించలేదని ఆయన తెలిపారు. రక్తం నమూనాను జగన్‌ గుండెకు రక్తాన్ని తీసుకొచ్చే రక్త నాళాల నుంచి కాకుండా గుండె నుంచి వచ్చే రక్త నాళాల నుంచి రక్తం సేకరించారని.. దీని వల్ల షుగర్‌ లెవెల్స్‌లో 10 శాతం మార్పులుండవచ్చన్నారు. అంతే కాకుండా రక్త నమూనాను దీక్షా శిబిరం నుంచి పరీక్షా కేంద్రం వరకు తీసుకు రావడానికి గంటన్నరకు పైగా సమయం పట్టిందన్నారు. ఈ సమయంలో రక్తకణాలు గ్లూకోస్‌ ను తీసుకోవడం వల్ల కూడా గ్లూకోస్‌ శాతం తగ్గవచ్చన్నారు. అంతేతప్ప వైద్యులలో ఎలాంటి నిర్లక్ష్యమూ లేదన్నారు. దీనిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముగ్గురు ఫిజీషియన్లను పరీక్షల కోసం పంపుతున్నట్లు తెలిపారు. కాగా, దీక్ష ప్రారంభమైనప్పటి నుంచీ నివేదికలు కావాలని బొత్స కోరారు.

No comments:

Post a Comment