Friday, 16 October 2015

పెగ్గేద్దాం రా.. భర్తకు మందు ఆఫర్ చేసిన భార్య

పెగ్గేద్దాం రా.. భర్తకు మందు ఆఫర్ చేసిన భార్య
Updated :16-10-2015 09:51:09
చెన్నై, అక్టోబరు 16: తాగుబోతు భర్తతో విసిగిపోయిన భార్య.. అతడిని మార్చేందుకు ఏకంగా భర్త తాగే బార్‌కే వెళ్లి పెగ్గేద్దాం.. ఆర్డర్ చేయమంది. దీంతో సదరు భర్త గారికి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిందీ ఘటన. నగరంలోని కేఆర్‌జీ నగర్‌లో నివాసముండే జయకుమార్, విల్లీ భార్యాభర్తలు. జయకుమార్ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తుంటాడు. రోజూ పూటుగా తాగి ఇంటికి రావడం అలవాటుగా చేసుకున్నాడు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. ఇంట్లోకి చిల్లిగవ్వ మిగల్చకుండా మొత్తం జీతాన్ని భర్త తాగుడుకే తగలేస్తుండడంతో భార్య విల్లీ విసిగిపోయింది. భర్త తాగుడుకు పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్న ఆమె కొన్ని రోజులపాటు అతడిని అనుసరించింది. అతను ఏ బార్‌లో తాగుతున్నాడో తెలుసుకుంది. బుధవారం భర్త కంటే ముందే ఆయన తాగే టాస్మాక్ బార్(ఆబ్కారీశాఖ నిర్వహించే బార్)కు చేరుకుంది. తొణుకుబెణుకు లేకుండా మందుబాబుల మధ్య కూర్చుంది. బార్ నిర్వాహకులు ఆమెను వెళ్లిపోవాలని బతిమాలినా ససేమిరా అంది. మరికొద్ది సేపట్లో తన భర్త వస్తాడని, ఇద్దరం కలిసి తాగివెళ్లిపోతామని నచ్చజెప్పింది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన జయకుమార్.. బార్‌లో భార్యను చూసి షాకయ్యాడు. ‘ఇంటికెళ్లు’ అంటూ గద్దించాడు. ‘ఇంటికెళ్లేందుకా వచ్చింది.. రండి ఇద్దరం కలిసి తాగుతూ ఎంజాయ్ చేద్దాం’ అని భార్య అనడంతో ఆయనకు కోపం నషాళానికి అంటింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మందుబాబులు తాగడం మానేసి వీరి గొడవను ఆసక్తిగా తిలకిస్తూ చర్చించుకోసాగారు. ఇంటికి వెళ్లమని భర్త.. కలిసి తాగుదామని భార్య.. గొడవ పెరుగుతుండడంతో చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి జయకుమార్‌తో ఇక మద్యం తాగను అంటూ ప్రమాణం చేయించారు. దీంతో శాంతించిన విల్లీ భర్తతో కలిసి ఇంటికెళ్లింది. మరోసారి మద్యం తాగేందుకు బార్‌కు వస్తే అక్కడే ధర్నా చేస్తానంటూ భర్తను హెచ్చరించింది.

No comments:

Post a Comment