Saturday, 17 October 2015

అమెరికా ఖజానా ఖాళీ కానుందా?

అమెరికా ఖజానా ఖాళీ కానుందా?
Updated :17-10-2015 04:18:20
  • నవంబర్‌ 3 డెడ్‌లైన్‌
వాషింగ్టన్‌: వచ్చే నెల మూడో తారీఖు తర్వాత అమెరికా ప్రభుత్వ ఖజానా ఖాళీ కానుందా? చెల్లింపులు చెల్లించలేక ఒబామా ప్రభుత్వం చేతులెత్తనుందా?... అమెరికా ట్రెజరీ కార్యదర్శి జాకబ్‌ ల్యు మాటలు వింటే అవుననిపిస్తోంది. నవంబర్‌ 3 లోపు ప్రభుత్వ రుణ పరిమితి పెంపుదలకు కాంగ్రెస్‌ అనుమతించకుంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం యుఎస్‌ ఫెడ్‌ రుణ పరిమితి 18.1 లక్షల కోట్ల డాలర్లు. రోజూవారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ పరిమితి పెంచాలని ఒబామా ప్రభుత్వం కోరుతోంది. ఈ కీలక అంశానికి కాంగ్రెస్‌ అనుమతి అవసరం. అయితే అందులో ఒబామా ప్రత్యర్ధులైన రిపబ్లికన్లకు మెజార్టీ ఉండడంతో ప్రభుత్వ కోరిక నిరవేరుతుందా? లేదా? అని ఉత్కంఠ నెలకొంది. నవంబర్‌ 3 తర్వాత యుఎస్‌ ఖజానాలో 3000 కోట్ల డాలర్ల కన్నా తక్కువ నగదు ఉంటుందని, ఇది అనర్ధాలకు దారి తీస్తుందని ల్యూ తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం నెలనెలా 800 కోట్ల డాలర్ల మేర చెల్లింపులు జరపాల్సి వస్తోందని, అందువల్ల తక్షణమే రుణ పరిమితి పెంచుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. ఒకవేళ కాంగ్రెస్‌ అనుమతి నిరాకరిస్తే యుఎస్‌ చరిత్రలో తొలిసారి ప్రభుత్వం చెల్లింపులు జరపలేకపోయే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు డెమోక్రాటిక్‌ ప్రతినిధులు కూడా రిపబ్లికన్లను ఇదే విషయమై అర్ధిస్తున్నారు. అమెరికా లోటు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4400 కోట్ల డాలర్ల మేర తగ్గింది. 2007 తర్వాత విత్తలోటు 2.5 శాతానికి క్షీణించింది. ఒబా మా ప్రభుత్వం ఆర్థికవ్యవస్థ పటిష్ఠానికి అనేక చర్యలు తీసుకుంటోందని, ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనమని ల్యూ చెప్పారు

No comments:

Post a Comment