- ముంబైలో సంగీత కచేరీ రద్దు
- కలత చెందిన గజల్ గాయకుడు
- శివసేన హెచ్చరికతోనే కార్యక్రమాన్ని రద్దు చేసిన నిర్వహకులు
- ముఖ్యమంత్రి ఫడణవీసా? ఉద్ధవ్ ఠాక్రేనా?ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్
న్యూఢిల్లీ: గులాం అలీ..గజల్ గురించి,హిందుస్తానీ సంగీతం గురించి తెలిసిన వారికి పరిచయం అక్కరలేని పేరు. ఆయన గజల్స్ వినేందుకు ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు.అయితే బుధవారం ముంబైలో జరగాల్సిన ఆయన కార్యక్రమం రద్దయింది. దీనికి ఆయన సున్నితమైన మససు గాయపడింది.ఈ సందర్భంగా స్పందించిన గులాం అలీ సంగీతానికి సరిహద్దులుండవని పేర్కొన్నారు. ముంబైలో తన సంగీత కచేరీని శివసేన రద్దు చేయించినందుకు మనసు బాధపడినా ఎవరిపై కోపం లేదన్నారు. పాకిస్థాన్‌కు చెందిన గజల్ గాయకుని సంగీత కచేరీ కార్యక్రమాన్ని శివసేన రద్దు చేయించింది. ప్రముఖ గజల్ నాయకుడు దివంగత జగ్‌జిత్ సింగ్ జ్ఞాపకార్థం గులాం అలీ సంగీత కచేరీని ముంబైలోని షణ్ముకానంద హాల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడాలని, ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకూడదని అలీ చెప్పారు. సంగీత ప్రియులను ఇలాంటి సంఘటనలు ఎంతో ఆవేదనకు గురిచేస్తాయన్నారు. పాకిస్థాన్ మద్దతుతో భారత్‌లో టెర్రరిస్టులు కార్యకలాపాలు సాగిస్తున్నందుకు నిరసనగానే గులాం సంగీత కచేరీని రద్దు చేయాలని శివసేన యువజన విభాగం బుధవారం నిర్వహకులను హెచ్చరించింది. ఈ సందర్భంగా యువ శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్‌తో మన సైనికులు అష్టకష్టాలు పడుతుంటే ఆ దేశానికి చెందిన గాయకుని పాటలను ఆస్వాదించడం సరికాదన్నారు. ఆయన తమ చర్యను సమర్థించుకున్నారు. కాగా తమకు గులాం అలీపై ఎలాంటి వ్యక్తిగత కోపం లేదన్నారు. ఇదిలా ఉండగా బుధవారం శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రేను నిర్వహకులు కలుసుకున్నారు. ఆయనతో చర్చించిన అనంతరం గులాం అలీ కార్యక్రమాన్ని ముంబైలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గులాం అలీ కార్యక్రమాన్ని రద్దు చేయడం పట్ల ముంబైలోని ప్రగతిశీల మేధావులు, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు, ఇతరులు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఫడణవీస్ గులాం అలీ కార్యక్రమానికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయించకపోవడం పట్ల ఈ పార్టీల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గులాం అలీ కార్యక్రమానికి అనుమతి ఇచ్చారు, కానీ తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తామని నిర్వహకులకు ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. దీంతో నిర్వహకులు వెనక్కి తగ్గారు.
శివసేన భారతీయ తాలిబన్‌గా వ్యవహరిస్తోంది: దిగ్విజరు సింగ్
శాంతి కాముకుడు గులాం అలీ కార్యక్రమాన్ని రద్దు చేయడం ద్వారా శివసేన భారతీయ తాలిబన్‌గా వ్యవహరించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజరు సింగ్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్‌లో స్పందించారు. శివసేన పార్టీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నదని కాంగ్రెస్ నాయకుడు షకీల్ అహ్మద్ ఆరోపించారు. పాకిస్థాన్ గాయకుడు గులాం అలీ సంగీత కచేరీని రద్దు చేయించిన శివసేన, పాకిస్థాన్ క్రికెటర్ మియాందాద్‌ను ఎలా ఆహ్వానించిందని ఆయన విమర్శించించారు.
భారత్‌ను 'హిందు సౌదీ'గా మార్చేందుకు యత్నం: తస్లీమా నస్రీన్
ఇదిలా ఉండగా ప్రముఖ బాంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. పాలకులు భారత్‌ను 'హిందు సౌదీ' గా మార్చేందుకు వేగంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.జిహాదీకి, గాయకునికి మధ్య తేడాను రాజకీయ పార్టీలు గమనంలోకి తీసుకోవాలని శివసేనను ఉద్దేశించి తస్లీమా వ్యాఖ్యానించారు. ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తూ గురువారం అనేక ట్వీట్లు చేశారు. గులాం అలీ సంగీత విభావరిని రద్దు చేయడంపై ఆమె తన అసంతృప్తి వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment