- కేంద్రమంత్రి వీకే సింగ్ వ్యాఖ్య... రాజకీయ దుమారం
- మంత్రి పదవి నుంచి తొలగించాలి: విపక్షాలు
- ఎస్సీ, ఎస్టీ చట్టంకింద కేసు పెట్టాలని డిమాండ్
- బిహార్‌లో బీజేపీ దళిత మిత్రపక్ష నేతల మండిపాటు
- సింగ్‌కు హెచ్చరిక.. రాజ్‌నాథ్ నష్ట నివారణ చర్య
- ఎస్సీ-ఎస్టీ కేసు నమోదుకు ఎన్‌సీఎస్సీ ఆదేశాలు
లఖ్‌నవ్/న్యూఢిల్లీ, అక్టోబరు 23: ‘‘కుక్కపై ఎవరో రాళ్లేసినా కేంద్రంపై నిందలేస్తారా?’’ అంటూ కేంద్ర మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యానించడంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. హర్యానాలోని సన్‌పెడ్ గ్రామంలో ఇద్దరు దళిత చిన్నారుల సజీవ దహనం ఘటన నేపథ్యంలో సింగ్ ఇలా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఆయనను తక్షణం మంత్రి వర్గంనుంచి తొలగించి జైలుకు పంపాలని డిమాండ్ చేశాయి. మరోవైపు సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ ఉత్తరప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీసు కమిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీచేసినట్లు కమిషన్ చైర్మన్ పి.ఎల్.పూనియా తెలిపారు. కాగా, తన వ్యాఖ్యలను సందర్భం నుంచి విడదీసి విపరీతార్థాలు సృష్టించారని వీకే సింగ్ వివరణ ఇచ్చారు. ఇక పి.ఎల్.పూనియా కాంగ్రెస్ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత, కమిషన్ మాజీ చైర్మన్ విజయ్ సోన్‌కర్ శాసి్త్ర విమర్శించారు. దళితులపై చిన్నచూపుతోనే సింగ్ ఆ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై ఎస్సీ-ఎస్టీ చట్టంకింద కేసుపెట్టడంతోపాటు మంత్రి పదవినుంచి తొలగించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా విమర్శలు గుప్పిస్తూ- సన్‌పెడ్ గ్రామానికి పరుగెత్తి మొసలి కన్నీరు కార్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏలుబడిలోనూ హర్యానాలో ఇలాంటి సంఘటనే జరిగినప్పుడు ఆయనెక్కడున్నారని నిలదీశారు. ఆనాడు విపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఇలాగే పరుగెత్తుకొచ్చారని, ఇప్పుడు వారెక్కడా కనిపించడంలేదని ధ్వజమెత్తారు. ఇక వీకే సింగ్ అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి షెల్జా డిమాండ్ చేశారు. సింగ్ వ్యాఖ్యలలో కులతత్వం స్పష్టంగా ధ్వనిస్తున్నదని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ కోరారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే డిమాండ్ చేశారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యేలు కొందరు సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదుచేసి, ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టాలని కోరారు. వీకే సింగ్ భూస్వామ్య మనస్తత్వానికి ఆయన వ్యాఖ్యలు నిదర్శనమని బిహార్‌లో బీజేపీ మిత్రపక్ష నేతలు జితన్‌రామ్ మాంఝీ, రాంవిలాస్ పాశ్వాన్ కూడా మండిపడ్డారు. దళితులపై బీజేపీ వైఖరేమిటో సింగ్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోందంటూ ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్ ఎన్నికల ప్రచార సభల్లో ధ్వజమెత్తారు. కాగా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు అపార్థానాలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. వీకే సింగ్‌తోపాటు హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు తమ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా వివాదాన్ని సాగదీయడం తగదని విపక్షాలకూ సూచించారు.
|
No comments:
Post a Comment