Saturday, 31 October 2015

ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్నారు...

ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్నారు...
Updated :31-10-2015 08:06:28
ఏలూరుక్రైం : ప్రత్యేకహోదా కోసం తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్‌ (50)కు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణికి వివాహం కాగా రెండవ కుమార్తె నిఖిల (22) డిఎడ్‌ చేసింది. ప్రస్తుతం దుర్గాప్రసాద్‌ ఉంగుటూరు మండలం కైకరంలోని 16వ నెంబరు జాతీయరహదారి పక్కన ఒక హోటల్‌ను నడుపుతూ జీవిస్తున్నాడు. తన చిన్నకుమార్తె నిఖిల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్‌లో ఉన్న బంధువుల ఇంటి వద్ద ఉంటూ అక్కడ చదివింది. అనంతరం తాడేపల్లిగూడెంలో ఇంటర్మీడియట్‌ డీఎడ్‌ పూర్తి చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీకి దరఖాస్తు చేసుకోగా నిరాకరించారు. దీంతో కోర్టు ద్వారా ఆమె డీఎస్సీకి దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. కాని ఫలితాలు మాత్రం విత్‌హెల్డ్‌లో ఉంచారు. రాష్ట్ర విభజన వల్ల తన కుమార్తెలాంటివారు ఎంతోమంది నష్టపోయారని, రాష్ర్టానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ సూసైడ్‌ నోట్‌ను రాసి ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీ వేకువజామున ఇంటిలోనే తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలకు గురైన అతనిని తాడేపల్లిగూడెం, ఏలూరు, గుంటూరు, విజయవడ, హైదరాబాద్‌లోని ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించారు. చివరకు ఈ నెల 27వ తేదీ వేకువజామున తిరిగి హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం దుర్గాప్రసాద్‌ మృతి చెందాడు. బాధితుడికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు కె.రఘువీరారెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు పుప్పాల వాసుబాబు తదితరులు రూ.25 వేల చొప్పున మొత్తం లక్ష రూపాయలను ఆర్థ్ధికసహాయాన్ని బాధితుడు దుర్గాప్రసాద్‌కు వైద్యపరీక్షలు నిమిత్తం అందజేశారు. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించలేదంటూ, అత్త మల్లారెడ్డి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ వివిధాసుపత్రులలో వైద్యం కోసం 5 లక్షలకు పైగా ఖర్చు అయ్యిందని, అనేక అప్పులు చేశామంటూ తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లేదంటే అప్పుల్లో ఉన్న తాము కూడా బ్రతకలేమంటూ బోరున విలపించారు. ఈ సంఘటనపై చేబ్రోలు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. సమాచారం అందుకున్న వైసీపీ నాయకులు పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, పటగర్ల రామ్మోహనరావు, గుడిదేశి శ్రీను, డాక్టర్‌ దిరిశాల ప్రసాద్‌, మున్నుల జాన్‌గురునాధ్‌, పుప్పాల వాసుబాబు, తదితరులు ఆసుపత్రికి చేరుకుని దుర్గాప్రసాద్‌ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేకహోదా కోసం ఆసుపత్రి వద్దే నినాదాలు చేశారు.

No comments:

Post a Comment