Friday 30 October 2015

దస్విదానియా సినిమా - సౌమ్య

దస్విదానియా
సౌమ్య
భారతీయ సినిమా, సమీక్ష, హిందీ
bucket list, dasvidaniya, IKIRU
10 comments
దస్విదానియా అంటే రష్యన్ భాషలో farewell అని అర్థం. వినయ్ పాథక్ నటిస్తూ నిర్మించిన బాలీవుడ్ చిత్రం. బాలీవుడ్ లో వెరైటీ కోసం ప్రయత్నిస్తున్నారన్న విషయం మరోసారి ఈ సినిమాతో నిరూపితమైంది. కాకపోతే, కథని మరింత సృజనాత్మకంగా, కథనాన్ని కూడా ఇదెక్కడో చూశామే అన్న అనుమానం వచ్చే విధంగా కాకుండా సరిగ్గా చేసిఉంటే, “ఇది మన భారతీయ సినిమా” అని బయట చెప్పుకునేంత గొప్ప అనుభవంగా మిగిలేది ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమా చూడటం ఓ మంచి అనుభవమే. కానీ, గొప్ప అనుభవం మాత్రం కాదు.

కథ: అమర్ కౌల్ ఓ ఫార్మా కంపెనీలో అకౌంటెంట్. కథ మొదట్లోనే అతనికి stomach cancer అని తెలుస్తుంది. మూణ్ణెల్ల కంటే బతకడని తెలుస్తుంది. అక్కడ్నుంచి ఆ మూడు నెలలలో అతను తన జీవితాన్ని ఎలా గడిపాడు, తను – “జీవితంలో ఎప్పటికైనా..” అనుకుంటూ కలలుగన్న కోరికల్ని ఎలా తీర్చుకున్నాడు? అన్నది ఈ సినిమా కథ. కథా పరంగా చూస్తే ఈ సినిమా హృషికేశ్ ముఖర్జీ “ఆనంద్”, ఇటీవలి “కల్ హోన హో”, మణిరత్నం “గీతాంజలి”, కమల్ హాసన్ సినిమా “నమ్మవర్” – ఇలా చాలా సినిమాల “స్పిరిట్” కి దగ్గరగా ఉంటుంది. వస్తువు పరంగా “మై లైఫ్ విదవుట్ మీ”, “బకెట్ లిస్ట్” అనే ఆంగ్ల సినిమాల లా ఉందని వికీలో చదివాను. నాకు మాత్రం సినిమా చూసేముందు నుంచీ ఇది “ఇకిరు” కి దగ్గరగా ఉంటుందేమో అన్న అనుమానం కలిగింది. (ఇకిరు గురించి నవతరంగం లో రెండు వ్యాసాలు వచ్చాయి – అవి ఇక్కడ మరియు ఇక్కడ) అది మొదటి పది నిముషాల్లోనే అనుమానం కాదు, నిజం అని తేలింది. పాథక్ – “సినిమా చూడని వారు చాలామంది ఇది ఇకిరు వల్ల ప్రభావితమైందని అనుకుంటున్నారు. ఇది చూసాక వీటి మధ్య తేడా ఉందని ఒప్పుకుంటారు” అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడని ఇప్పుడే చూసాను. సినిమా చూసాకే ఖచ్చితంగా ఇది ఇకిరు ప్రభావంలో తీసిన సినిమా అని చెప్పగలుగుతున్నాను. రెంటి మధ్యా తేడా బోలెడు ఉంది. ఏదీ తక్కువ కాదు. రెండూ మంచి సినిమాలే. అయినంత మాత్రాన ఇది ఇకిరు నుండి ప్రభావితమైనది కాకుండా పోదు. నిజం ఒప్పుకోడానికి భయమెందుకో అర్థం కాదు.

సినిమాలో పాత్రధారుల పోషణ అద్భుతం. సందర్భోచితంగా ఉన్న నేపథ్య సంగీతం, చక్కని సంభాషణలు, అంతర్లీనంగా కథలో కలిసిపోయిన హాస్యం – ఈ విధంగా చూస్తే, ఇదొక మంచి సినిమా. వినయ్ పాథక్ నటన చాలా సహజంగా ఉంది. ఈ సినిమాకి స్క్రీన్‍ప్లే ఒక అసెట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే, అలాంటి కథా నేపథ్యం లో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నప్పటికీ ఇది చూసేవారిని ఆకట్టుకోగలిగింది కనుక. జానీ మేరా నామ్ సినిమాలో కిశోర్ కుమార్ పాడిన – “పల్ భర్ కె లియే కొయీ హమే ప్యార్ కరియే” పాటను సినిమాలో రెండు మూడు చోట్ల బాగా వాడుకున్నారు. సినిమాలో అంతరాత్మ అమర్ తో సంభాషించే దృశ్యాల దగ్గర సంభాషణలు నాకు చాలా నచ్చాయి. హాస్యానికి హాస్యమూ ఉంది, సీరియస్ నెస్ కూడా ఉంది వాటిలో. అలాగే, నేహా ధూపియా ఇంట్లో జరిగే దృశ్యమంతా కూడా నాకు బాగా నచ్చింది. చిన్ననాటి స్నేహితుడెవరో ఉన్నట్లుండి తారసపడితే ఎలా ఉంటుందో అదంతా ఆ దృశ్యం చూస్తూ ఉండగా చూసేవాళ్ళు కూడా అనుభవించగలిగారు అంటే, దర్శకుడు విజయవంతమైనట్లే కదా.

మొత్తానికి ఈ సినిమా మాత్రం మిస్ అవదగ్గ సినిమా కాదు. మీరు ఇకిరు చూసినా కుడా, ఇది చూడండి. ఇది కాపీ కాదు. దాన్నుంచి “ప్రేరణ చెందినది”. తేడా ఇన్నాళ్ళకి తెలిసింది నాకు – కాపీకీ, ప్రేరణకీ. ఈ సినిమా ఓ మంచి భారతీయ సినిమా. ఎటొచ్చీ Ignorance is bliss అని ఎందుకంటారో నిన్న నాకు బాగా అర్థమైంది. నన్ను సినిమా చూస్తున్నంతసేపూ “ఇకిరు” నుండి తీసారు ఈ కథ అన్న బాధ తొలుస్తూనే ఉండింది. అసలు ఇకిరు చూడకపోయినా బాగుండేది. ఈ సినిమా గురించి నేనూ గొప్పగా చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేదాన్ని. ఒక సినిమాను చూసి మరో సినిమా తీసినప్పుడు గర్వంగా నేను ఈ సినిమా నుండి ప్రేరణ పొందాను అని చెప్పుకోవచ్చు కదా. ఇదేమీ కాపీ కాదు. కొన్ని దృశ్యాలు అలాగే ఉన్నా కూడా. “మా సినిమాకీ ఇకిరు కి సంబంధం లేదు” అన్న స్టేట్‍మెంట్ ఇవ్వడంలో ఎంత సిగ్గులేనితనం ఉందో రెండు సినిమాలూ చూసిన ఎవరికైనా అర్థమౌతుంది. ఎందుకు మన వాళ్ళు ఇలా చేస్తారు? అంటే, ఎవరూ కనుక్కోలేరేమో అన్న ధీమానా? ఈ యుగంలో అంత ధీమాగా ఎలా ఉండగలరు? మంచి సినిమాలు తీయడం చేతనౌను. తెలిసిన కథని కొత్తగా చూపడం చేతనౌను (ఈ సినిమా చేసిందదే, చాలావరకూ). కానీ, తమ కథకి మూలం ఇదీ అని ఒప్పుకోడానికి మాత్రం సిగ్గు! ఇది మా భారతీయ సినిమా అని నేను ఏ సినిమా గురించి, దీనికీ, ఏ ఫారిన్ సినిమాకీ సంబంధం లేదు అని గర్వంగా చెప్పుకోగలనో…అసలా రోజు వస్తుందో లేదో.

No comments:

Post a Comment