Sunday 25 October 2015

కేంద్రం ఏమీ ఇవ్వలేదనటం సరికాదు: అశోక్‌ గజపతిరాజు

కేంద్రం ఏమీ ఇవ్వలేదనటం సరికాదు: అశోక్‌ గజపతిరాజు 
Updated :26-10-2015 00:22:38
  • ఇంకా ఇవ్వాలనటం సమంజసం 
  • పార్టీలకతీతంగా పోరాడి సాధించుకోవాలి 
  • ఇప్పుడు కావాల్సింది వార్‌ రూమ్‌లు కాదు..పీస్‌ రూమ్‌లు 
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): విభజన సందర్భంగా నవ్యాంధ్రకు అన్యాయం జరిగిన నేపథ్యంలో కేంద్రం నుంచి అన్ని విధాలా సహా యం లభించాల్సి ఉందని కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు. అయితే కేంద్రం ఏమీ ఇవ్వలేదనడం సరికాదని, ఇంకా ఇవ్వాల్సి ఉందని అనడం సమంజసంగా ఉంటుందన్నా రు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన సమయంలో లోతైన చర్చ జరిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు ఆరు నెలల్లో చర్యలు తీసుకోవాలని చట్టంలో పేర్కొన్నారని.. ఇంత తక్కువ సమయంలో పరిశీలన అంటే సంబంధిత ప్రతిపాదనను తిరస్కరించటమేనని తెలిపారు. అయి నా తాము పట్టుదలతో తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, టెర్మినల్‌ను సిద్ధం చేశామని, త్వరలోనే ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ సదుపాయాలు కూడా ప్రారంభించి అంతర్జాతీయ విమానయాన సంస్థల్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు.. ప్రజాస్వామ్య దేవాలయం అయిన పార్లమెంటు నుంచి ప్రధాని మట్టి తీసుకురావటాన్ని చులకనగా చూడరాదన్నారు. బిల్లులో ఉన్నవన్నీ తప్పకుండా అమలు చేస్తామని ప్రధాని స్పష్టం చేశారని, లేని సంస్థలను కూడా కొన్ని ఇస్తామని వెల్లడించారని పేరన్కొన్నారు. ఇవన్నీ కేంద్రంతో సఖ్యతగా ఉండి సాధించుకోవాల్సినవని చెప్పారు. పార్టీలు వేరైనా ఏపీ ప్రజా ప్రతినిధులంతా ప్రత్యేక హోదా కోసం కలిసి పనిచేయాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు పొరుగు రాషా్ట్రలు, సీఎంలు అంతా వ్యతిరేకంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూముల్లో అనాలోచితంగా రాష్ట్రాన్ని విభజించడంతో నాగార్జున సాగర్‌ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంటోందని, ఇప్పుడు కావాల్సింది వార్‌ రూములు కాదని, శాంతిని సాధించే పీస్‌ రూములు కావాలన్నారు. రాజధాని నిర్మాణం కూడా మొదలు కాకుండానే రూ.1500 కోట్లు కేంద్రం ఇచ్చిందని, కాబట్టి ఏమీ ఇవ్వలేదన్న ప్రచారం తగదని, ఇంకా ఇవ్వాలనటం సమంజసమన్నారు.

అశోక్‌ గజపతి స్ఫూర్తి అభినందనీయం: మోదీ 
కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆదర్శ గ్రామ పథకంలో భాగంగా ద్వారపూడి గ్రామాన్ని ఆదర్శ గ్రామం చేసేందుకు స్వయంగా చొరవ తీసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పథకం అమలుతోపాటు ఆయన ఒక వినూత్న కార్యక్రమం చేపట్టి మంచి ఫలితాలు సాధించారని కొనియాడారు. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులే ఉపాధ్యాయుల్లా మారి గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా ప్రోత్సహించారని వివరించారు. పాఠశాలలో ఉదయం విద్య నేర్చుకునే విద్యార్థులే సాయంత్రం వారి తల్లిదండ్రులతోపాటు గ్రామంలోని నిరక్షరాస్యులందరికీ విద్య చెప్పారని తెలిపారు. ఎలాంటి నిధులు, బడ్జెట్‌ కేటాయింపులు, అధికారిక ఆదేశాలు, వ్యవస్థీకృత సేవలు లేకుండానే.. సంకల్పబలంతోనే గొప్ప మార్పును ఎలా తీసుకురావచ్చో ద్వారపూడిని చూసి నేర్చుకోవాలని సూచించారు. కాగా, ప్రధాని తమ గ్రామాన్ని గుర్తించటం పట్ల అశోక్‌ గజపతి రాజు సంతోషం వ్యక్తం చేశారు. ఇది విద్యార్థుల శ్రమకు దక్కిన గుర్తింపన్నారు. గ్రామంలోని సారాయి దుకాణాన్ని తొలగించామని, ఇళ్లలో ఎల్‌ ఈడీ విద్యుత్‌ దీపాలు వాడి 47 శాతం కరెంటును ఆదా చేశామని చెప్పారు. గ్రామాన్నంతటినీ అక్షరాస్యులుగా చేయడంలో విద్యార్థుల కృషిని ఆయన ఈ సందర్భంగా మెచ్చుకున్నారు.

No comments:

Post a Comment