Saturday 10 October 2015

నడిరోడ్డుపై నగ్నత్వం!

నడిరోడ్డుపై నగ్నత్వం!
Updated :10-10-2015 01:43:14
  • పోలీసులే విప్పారన్న బాధితులు
  • కాదు వారే విప్పుకొన్నారన్న పోలీసులు
  • గ్రేటర్‌ నోయిడాలో ఘటన

న్యూఢిల్లీ, అక్టోబరు 9: తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన దళిత దంపతుల పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. నడివీధిలో వారి దుస్తులు విప్పి నగ్నంగా చేసి ఈడ్చిపారేశారు. గ్రేటర్‌ నోయిడా(ఉత్తర్‌ప్రదేశ్‌)లోని గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌ ప్రాంతంలో గురువారం జరిగిందీ ఘటన. నోయిడాలోని అట్టా ప్రాంతంలో నివసించే సునీల్‌ గౌతమ్‌ అనే దళితుడి ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. దీంతో అతడు ఫిర్యాదు చేసేందుకు గురువారం దాంకౌ ర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తన భార్యతో సహా వెళ్లాడు.
 
కానీ, స్టేషన్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ తమ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడంతో.. స్టేషన్‌ బయట తాను తన కుటుంబసభ్యులతో సహా నిరసనకు దిగామని, అసహనానికి గురైన పోలీసులు తమను కొట్టి తమ దుస్తులను చించేసి ఈడ్చేశారని సునీల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. సునీల్‌ కుటుంబసభ్యులు తమంత తామే దుస్తులు విప్పుకొని నిరసన తెలిపే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారని మరికొందరు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటన మొత్తాన్నీ తన మొబైల్‌లో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టడంతో.. పోలీసుల వైఖరిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన అనంతరం పోలీసులు ముగ్గురు మహిళలు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్టు, వారిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు స్థానిక పత్రిక ఒకటి వెల్లడించింది. పోలీసులు అరెస్టు చేసినవారిలో సునీల్‌ దంపతులు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా.. ఈ ఘటనపై యూపీ సర్కారు అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా స్పందించింది. జరిగిన ఘటన తాలూకూ వీడియో పోలీసుల వద్ద ఉందని.. సునీల్‌ గౌతమ్‌ దంపతులు తమంత తామే దుస్తులు విప్పుకొన్నట్టుగా వీడియోలో స్పష్టంగా ఉందని పేర్కొంది.

No comments:

Post a Comment