Friday, 16 October 2015

టీడీపీ నేతలకు ప్రాణభిక్ష పెట్టిన మావోయిస్టులు

టీడీపీ నేతలకు ప్రాణభిక్ష పెట్టిన మావోయిస్టులు
Updated :16-10-2015 09:05:46
  • క్షేమంగా విడిచిపెట్టడంపై సర్వత్రా హర్షం
  • బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని చిత్తశుద్ధితో కొనసాగించాలంటూ రాజకీయ నేతలకు హుకుం
  • గిరిజన ఉద్యోగులు భాగస్వాములు కావాలని పిలుపు
  • బందీల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజం
  • సీఎం ప్రకటన అస్పష్టంగా ఉందంటూ అసంతృప్తి
చింతపల్లి అక్టోబర్‌ 15: ‘‘అమ్మో...పదమూడవ తారీఖు దగ్గర పడుతోంది...ప్రాణాలతో బయటపడతామో లేదా...కాలం ఆగిపోయినా బాగుణ్ణు...’’ అని అనుకుంటూ పది రోజులూ క్షణమొక యుగంలా గడిపామని మావోయిస్టుల చెర నుంచి విడు దలైన టీడీపీ నాయకులు మహేష్‌, వండలం బాలయ్య, మామిడి బాలయ్య తెలిపారు. గురువారం ఉదయం వారు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ఈనెల ఐదున ఒక గ్రామంలో పార్టీ సమావేశం నిర్వహించేందుకు వెళ్లిన తమను మావోయిస్టులు అపహరించి తమ వెంట తీసుకుపోయారన్నారు. ఆరవ తేదీన బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రకటన చేయాలని, ప్రభుత్వ ప్రకటనపైనే తమ జీవితాలు ఆధారపడి వున్నాయని పత్రికా ప్రకటన పంపించామన్నారు. మావోయిస్టులు 13లోగా రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రకటన చేయాలని లేకుంటే ప్రజాకోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారన్నారు.
                                    మావోయిస్టులు తమను అతిథుల్లా చూసుకుంటున్నప్పటీకీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆందోళనకు గురయ్యామన్నారు. ప్రభుత్వ ప్రకటన కోసం ప్రతిరోజు వార్తా పత్రికలు చూసేవారమన్నారు. పదమూడో తేదీ దగ్గరపడుతుందని గుర్తుచేసుకుంటే గుండె చెరువైపోయేదన్నారు. మావోయిస్టులు చాలా చక్కగా చూసుకుంటూ సమయానికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టారన్నారు. ఎంత చక్కని భోజనం ఎదురుగా వున్నా...ప్రాణాలతో తిరిగి వెళతామో లేదోననే బెంగతో ఏమీ తినలేపోయేవారమన్నారు. కేంద్ర కమిటీ సభ్యుల చెర నుంచి విడుదల కావడం చూస్తుంటే కలయా..నిజమా అన్న సందేహం కలుగుతోందన్నారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోయినా మావోయిస్టులు క్షమాభిక్ష ప్రసాదించడం మరిచిపోలేని సంఘటనన్నారు.
అతిథుల్లా చూసుకున్నారు: 
మావోయిస్టులు మమ్మల్ని అతిథుల్లా చూసుకున్నారు. కనీసం ఒక్కమాట కూడా అనలేదు. ఇంట్లో తినేదానికంటే మంచి భోజనం పెట్టారు. పది రోజుల తరువాత కుటుంబ సభ్యులను చూసుకునే అవకాశం కల్పించిన మావోయిస్టులకు ధన్యవాదాలు తెలుపుతున్నా.
వండలం బాలయ్య
 
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: మామిడి బాలయ్య
మా ఆరోగ్యంపై మావోయిస్టులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్యురాలైన మావోయిస్టును నియమించారు. జ్వరం వచ్చిన వెంటనే మందులిచ్చారు. మావోయిస్టులు ప్రాణాలతో విడిచిపెట్టడం అసాధ్యమైనా క్షమించి విడిచిపెట్టారు. ప్రజాకోర్టులో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేవిధంగా బాక్సైట్‌ వ్యతిరేక పోరాటం చేస్తా.
 
పునర్జన్మనిచ్చారు: ముక్కలి మహేష్‌
మాకు మావోయిస్టులు పునర్జన్మ ఇచ్చారు. క్షేమంగా తిరిగి గ్రామానికి వస్తామనుకోలేదు. గడువు ముగిసిన రోజు ఒకరు వుండరని చెబితే గుండె జారిపోయింది. జిల్లా కార్యవర్గ సభ్యుడుగా వున్నాను..మొదటిగా బలయ్యేది నేనేనని వణికిపోయాను. మావోయిస్టులు మరో జన్మ ఇచ్చినట్టు భావిస్తున్నాను. ప్రస్తుతం మావోయిస్టులు విడుదల చేయడంతో కుటుంబ సభ్యులతో కలిసి సంతో షంగా వున్నాను. మా విడుదలకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి వుంటాము.

No comments:

Post a Comment