Thursday 27 August 2015

చర్చకు రెడీ.. హోదా, భూ సేకరణలపై విపక్షాలకు బాబు సవాల్‌

చర్చకు రెడీ..
హోదా, భూ సేకరణలపై విపక్షాలకు బాబు సవాల్‌

  • వైసీపీ, కాంగ్రెస్‌ రాజకీయాలపైనా చర్చిద్దాం
  • ప్రధాని మోదీకి సమస్యలన్నీ వివరించా
  • ఆవేశం కాదు.. సమస్య పరిష్కారం ముఖ్యం
  • నాయకుల ‘భావోద్వేగ’ మాటలు నమ్మవద్దు
  • ప్రత్యేక హోదాతో నిధులు తగ్గిపోతాయి
  • ఉద్యోగుల స్థానికతకు వచ్చిన ఇబ్బందేమీ లేదు
  • పవన్‌ కల్యాణ్‌తోనూ మాట్లాడతా: చంద్రబాబు
 
 విజయవాడ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజకీయ లబ్ధే పరమావధిగా రాష్ర్టాభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న ప్రతిపక్షాలకు ఒక్కటే చెబుతున్నా! ప్రత్యేక హోదా, భూ సమీకరణ, సేకరణలతోపాటు వైసీపీ నీతిమాలిన రాజకీయాలు, కాంగ్రెస్‌ బాగోతాలపైనా చర్చిద్దాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్‌ విసిరారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మేం వస్తాం.. భూములు తిరిగి ఇస్తాం’ అన్న జగన్‌ ప్రకటనతోపాటు ప్రతిపక్షాల విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘నిప్పులా బతికాను. నా జీవితంలో తప్పు చేయలేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేనెవరికీ భయపడలేదు. భయపడను కూడా. మేమే వస్తాం.. భూములన్నీ ఇచ్చేస్తాం అంటున్నారు. మీకు రాజకీయాలు కావాలి. మాకు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. పోలవరం కాల్వ కింద ఉన్న 200 గ్రామాలను పునరావాసం చేయాల్సి వస్తుంది. భూములు వద్దంటే.. పోలవరం కాలువ కూడా వద్దా? పోలవరం పూర్తి చేయకపోతే రాష్ట్రం అంధకారంలో ఉంటుంది. కృష్ణా నదికి నీళ్లివ్వకపోతే రాయలసీమకు నీళ్లెలా వెళతాయి? నీకు నీళ్లు కావాలి. వాళ్లకు వద్దా?’’ అని ధ్వజమెత్తారు. తనను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, రాజకీయ సమ ఉజ్జీలతో మాట్లాడితే ఓ హోదా ఉంటుందని ఎద్దేవా చేశారు. అయినా, ‘‘ఎలాంటి వ్యక్తులు వచ్చినా చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. అన్ని విషయాలూ చర్చిద్దాం. భావోద్వేగాలతో ఆడుకునే రాజకీయ నాయకుల మాటలు విని ఆవేశం కొని తెచ్చుకోవద్దు. అఘాయిత్యాలకు ఒడికడితే మీ కుటుంబమే నష్టపోతుంది’’ అని హితవు పలికారు. ‘‘అభివృద్ధిని అడ్డుకునేవాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అవినీతికి పాల్పడి తవ్వుకున్న గోతిలోనే వాళ్లు పడ్డారు. లేపాక్షికి 8 వేల ఎకరాలు ఇచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వాటిని అటాచ్‌ చేసింది. వీళ్లు చేసిన తప్పులకు సీబీఐ, కేంద్రం, ఈడీ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను అటాచ్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వాటిని కాపాడుకోవ టానికి చట్టం తీసుకొస్తాం’’ అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని, అయినా దీని గురించి వైసీపీ మాట్లాడదని, సెక్షన్‌ 8, విభజన చట్టంలోని అంశాలపై కూడా మాట్లాడదని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చేసి ప్రధాన మంత్రితో మాట్లాడలేని పెద్ద మనిషి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవటానికే భూములు ఇచ్చేస్తామంటూ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘రాజధాని నిర్మాణానికి భూ సమీకరణను వ్యతిరేకించిన ఈ పెద్ద మనుషులు రాయలసీమకు నీళ్లు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఆలమట్టిలో నీళ్లు లేవు. తుంగభద్రలో కూడా ఇదే పరిస్థితి. దాంతో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాలని మేం ప్రయత్నిస్తున్నాం. దానినీ అడ్డుకుంటున్నాడు. పోలవరం కాల్వ పూర్తి చేయటానికి 1800 ఎకరాలు కావాలి. రైతుల్ని ఒప్పించి వారికి న్యాయం చేసి ఎకరానికి రూ.40 లక్షల చొప్పున పరిహారం చెల్లించాం. రూ.700 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ప్రాజెక్టును గందరగోళం చేశారు. భ్రష్టుపట్టించారు’’ అని మండిపడ్డారు. ఎంతో పారదర్శకంగా పట్టిసీమ తలపెట్టామని, వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని, చిత్తశుద్ధితో సహకరిస్తే స్వాగతిస్తామని, రాజకీయ లబ్ధితో వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ప్రతిపక్షాలకు హెచ్చరించారు. ప్రత్యేక హోదా రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలు ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆర్థికంగా లబ్ధి కలిగించే బెటర్‌ ప్యాకేజీని కోరుతున్నాం. ఆ మేరకు కేంద్రానికి నివేదించామని తెలిపారు. 
 
ఉద్యోగుల పిల్లల స్థానికత పెద్ద సమస్య కాదు
సొంత రాష్ర్టానికి వచ్చే ఉద్యోగుల పిల్లల స్థానికతకు సంబంధించి ఎలాంటి సమస్యా లేదని చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లోని వారికి ఇక్కడి స్థానికత కల్పించే విషయంలో ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ రావాల్సి ఉంటుందని, దానిని తీసుకు రావటానికి కృషి చేస్తామని, ఇదేమంత పెద్ద సమస్య కాదని చంద్రబాబు చెప్పారు. ‘‘95 శాతం మంది రాజధానికి భూములు ఇవ్వటానికి ముందుకు వచ్చారు. మిగిలిన 5 శాతం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అవసరమైతే పవన్‌ కళ్యాణ్‌తో కూడా మాట్లాడతాను’’ అని చంద్రబాబు అన్నారు.

No comments:

Post a Comment