- ఈ వ్యవస్థతో కొత్త రాజధానిలో అవస్థలు
- కేబినెట్లో చర్చించి.. కేంద్రానికి ప్రతిపాదిస్తాం: యనమల
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో కీలక పాత్ర వహిస్తున్న జోనల్ వ్యవస్థకు మంగళం పలకాలని ఏపీ సర్కారు భావిస్తోంది. జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు మూలాధారమైన ఆర్టికల్ 371 (డి)ని రద్దుచేయాలని కేంద్రానికి ప్రతిపాదించే ఆలోచనలో ఉంది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను ఏపీకి తరలించడంలో ఎదురవుతున్న స్థానికత, సీమాంధ్రలో ఉన్న ఇతర సమస్యల నేపథ్యంలో ప్రస్తుత కాలానికి చెల్లుబాటు కాని 371 (డి) రద్దు విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి యనమల చెప్పారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో జైఆంధ్రా ఉద్యమం నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని విద్యార్థులకు, ఉద్యోగులకు సమానావకాశాలు కల్పించే ఉద్దేశంతో 6 సూత్రాల పథకాన్ని అమల్లోకి తెచ్చారు. పెద్దమనుషుల ఒప్పందంగా భావించే ఈ ఆరు సూత్రాల పథకానికి చట్టబద్ధత లేకపోతే ఉల్లంఘనలు జరుగుతాయన్న తెలంగాణ నేతల డిమాండ్‌కు తలొగ్గిన కేంద్రం.. ఈ అంశాలకు రాజ్యాంగ రక్షణ కల్పించే ఉద్దేశంతో ఆర్టికల్ 371కు ‘డీ’ కేటగిరీ పేరుతో మార్పును చేర్చింది. ఈ ఆర్టికల్‌కు అనుగుణంగా చీటికిమాటికి ఎవరుపడితే వాళ్లు మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేకుండా 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరిట ఒక సమగ్రమైన నియమావళిని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. పోస్టులను జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులుగా వర్గీకరించారు. ఆయా పోస్టుల్లో స్థానికులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. అంటే స్థానికులకు రిజర్వ్ చేసిన పోస్టుల్లో స్థానికేతరులు ఉండకూడదు. అలాగే, విద్యాసంస్థల్లో ప్రవేశానికి కూడా ఇదే ఫార్ములా అమలు చేశారు. రాష్ట్రవిభజన సమయంలో 371-డీమళ్లీ తెరపైకి వచ్చింది. ఉమ్మడిరాష్ట్రానికి కలిపి ఉంచిన ఈ ఆర్టికల్, రాష్ట్రపతి ఉత్తర్వులు అలా ఉండగానే రాష్ట్ర విభజన చేయడం కుదరదని విభజన సమయంలోనే ఈ ఆర్టికల్‌ను రద్దు చేయాలని అటార్నీ జనరల్ సహా కొందరు న్యాయ నిపుణులు కేంద్రానికి సూచించారు. అయితే, రాజ్యాంగ సవరణ చేసేంత బలం, సమయం లేకపోవడంతో దాన్ని అలాగే ఉంచి విభజన ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 371-డీ, రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ అవసరం లేదని ఏపీలోని అనేకమంది న్యాయ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిరావాలంటే జోనల్ వ్యవస్థలో వారి పిల్లల స్థానికతను ఎక్కడని నిర్ణయించాలో అంతుపట్టని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో 371-డీ, దాని ఆధారంగా వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్, జోనల్ వ్యవస్థలను రద్దుచేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఏపీ సర్కారులో మొదలైంది. ఈ అంశాన్ని సీరియ్‌సగానే పరిగణిస్తున్నామని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధానం అర్థరహితమైనందున దీన్ని తొలగించాలన్నదే తమ అభిప్రాయమని.. దీన్ని కేబినెట్లో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే కేంద్రానికి పంపిస్తామని యనమల అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం 4 జోన్లున్నాయి. మున్సిపల్, వైద్య తదితర నాలుగైదు శాఖల్లో 3 మల్టీజోన్లు ఉన్నాయి. కొత్తగా రాజధాని ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ జోన్ల వ్యవస్థ గందరగోళానికి దారితీస్తుందన్న అభిప్రాయం పలువురు సీనియర్ అధికారుల్లో కూడా వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీ కొత్త రాజధానికి వెళ్లే ఉద్యోగులు వారి పిల్లలకు స్థానికత విషయంలో సమస్యలు ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు యనమల చెప్పాడు.
|
No comments:
Post a Comment