Wednesday 19 August 2015

తల్లిదండ్రుల స్థానికతే పిల్లలకూ!.. అమలు చేయాలి: ఉద్యోగ సంఘాలు

తల్లిదండ్రుల స్థానికతే పిల్లలకూ!.. అమరావతికి పంపేవారికి అమలు చేయాలి: ఉద్యోగ సంఘాలు

  •  రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాలి
  •  విద్యార్థుల విషయంలో త్యాగాలు చేయలేం
  •  ప్రభుత్వానికి తెలిపిన ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వెళ్లే ఉద్యోగుల పిల్లలకు వారి తల్లిదండ్రుల స్థానికతనే వర్తింపజేయాలని, ఆ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ‘ఒక్కసారి స్థానికత’ (వన్‌టైం లోకల్‌) ప్రాతిపదికన దీనిని అమలు చేసేలా మార్పులు చేయాలని విజ్ఞప్తి చేసింది. అమరావతికి వెళ్లే ఉద్యోగుల పిల్లల స్థానికతపై ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం సచివాలయంలో న్యాయ శాఖ కార్యదర్శి దుర్గాప్రసాద్‌తో భేటీ అయ్యారు. స్థానికత విషయంలో తమ పిల్లలకు న్యాయం చేయాలని కోరారు. ‘‘మా పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టారు. వాళ్లు ఏపీకి వెళితే అక్కడ స్థానికేతరులు అవుతారు. తద్వారా విద్యా, ఉద్యోగ అవకాశాలు నష్టపోతారు. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వసతుల కల్పనలో ఏవైనా ఇబ్బందులుంటే సర్దుకుపోతాం. కానీ, పిల్లల విషయంలో త్యాగాలు చేయలేం. ఉద్యోగుల స్థానికతను బట్టి వారి పిల్లలకూ అదే జిల్లా స్థానికతను వర్తింపజేయాలి’’ అని స్పష్టం చేశారు. అనంతరం జేఏసీ చైర్మన్‌ పి.అశోక్‌బాబు, నేతలు ఐ.వెంకటేశ్వరరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు విలేకరులతో మాట్లాడారు. స్థానికతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. అమరావతికి ఎప్పుడు వెళ్లాలనే విషయాన్ని ప్రభుత్వం చెప్పలేదన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత త్వరలో ఉద్యోగులను తరలించాలని కోరారు. అలవెన్సులు, పీఆర్‌సీ సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వెంటనే నిర్ణయం ప్రకటించాలని, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబరు 2న జాతీయ స్థాయిలో ట్రేడ్‌ యూనియన్లు చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలిపారు.
 
కేంద్రానికి ముసాయిదా పంపుతామన్నారు
ఉద్యోగుల స్థానికతను వారి పిల్లలకు వర్తింపజేసేందుకు 371 డిలో అవసరమైన మార్పుల కోసం ముసాయిదా తయారు చేసి కేంద్రానికి పంపుతామని న్యాయ శాఖ కార్యదర్శి తెలిపారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు యు.మురళీకృష్ణ, వెంకటసుబ్బయ్య తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తేవాలని కోరామన్నారు. జోనల్‌ వ్యవస్థను మార్చకుండానే స్వల్ప మార్పులతో అమరావతికి వెళ్లే ఉద్యోగుల పిల్లలకు న్యాయం చేయాలని కోరామన్నారు. ఎన్నికల కోసమే బీహార్‌కు ప్యాకేజీ ప్రకటించారని, అక్కడ ఎన్నికల్లోపు ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం చేపడతామని తెలిపారు.

No comments:

Post a Comment