పెళ్లికాని కుర్రాళ్లే... వారి టార్గెట్ Updated :29-08-2015 09:49:34 |
నగరంలో ఓ అందమైన అమ్మాయి ఫొటోతో పత్రికల్లో ప్రకటన ఇస్తారు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న ఆమెకు తగిన వరుడు కావాలని.. సమర్థుడైతే చాలని.. కులగోత్రాలు.. ఆస్తిపాస్తులతో పనిలేదని ప్రకటనలో పేర్కొంటారు. ఆస్తి తర్వాత సంగతి.. అందమైన ఫొటో చూడగానే అబ్బాయిలు ఫ్లాటైపోతున్నారు. క్షణం ఆలోచించకుండా అక్కడ ఉన్న ఫోన్ నంబర్‌కు డయల్ చేస్తున్నారు. అట్నుంచి వినిపించే అందమైన కంఠం తాము మ్యారేజ్ బ్యూరో అంటూ సమాధానమిస్తుంది. ఆకట్టుకునే యువతుల ఫొటోలతో పెళ్లికాని కుర్రాళ్లకు వలవేసి రప్పించుకుంటారు. యువకులకు గాలం వేయడానికి 10 మంది యువతులు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరి పనంతా అందంగా అబద్ధాలను నమ్మించడమే. పెళ్లి సంబంధం కోసం వచ్చిన యువకుల నుంచి రిజిసే్ట్రషన్ ఫీజు కింద 5 నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇలా... రోజు పదుల సంఖ్యలో కుర్రాళ్లకు వలవేశారు. అక్కడి రిసెప్షన్‌లో ఉండేది ఆడపిల్లలు కావటంతో గట్టిగా ప్రశ్నించలేని యువకులు ఫోన్ చేసినప్పుడల్లా అక్కడ వాలిపోయేవారు. వెళ్లిన ప్రతిసారీ ఎంతోకొంత రాబట్టుకునేవారు. కొద్దిరోజులు గడిచాక ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది. మరికొన్ని సందర్భాల్లో తాము ఇతర ప్రాంతంలో ఉన్నట్టు చెప్పేవారు. గట్టిగా అడిగితే.. మరోచోట అందం.. ఆస్తిపాస్తులున్న ఆడపిల్ల ఉందంటూ అక్కడ పనిచేసే యువతులు సమా ధానం చెప్పేవారు. ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నంబర్లు వీరి వద్దే ఉండటంతో యువకులు పోన్ చేసిన సమయంలో నమ్మించేలా నాటకమాడేవారు. అక్కడ నుంచి కథ మళ్లీ మొదటికే. చివరకు పెళ్లిసంగతి దేవుడెరుగు... పర్సు ఖాళీ అవుతుండటంతో.. ధైర్యం చేసిన ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పత్రికా ప్రకటనల్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాము కూడా బ్రహ్మచారులమనే నమ్మించారు. మోసాన్ని మోసంతోనే బట్టబయలు చేశారు. నకిలీ మ్యారేజ్ రాకెట్ వెనుక సూత్రధారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నెలవారీ జీతంతో 10 మంది యువతులను ఉద్యోగంలో చేర్చుకుని ఈ తంతు సాగిస్తోంది. చివరకు బండారం బయట పడటంతో కేసు నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నట్టు సమాచారం. |
No comments:
Post a Comment