Wednesday 19 August 2015

ఆ నీటిలో ఏపీకి వాటా లేదు..చుక్క కూడా ఇవ్వలేం

ఆ నీటిలో ఏపీకి వాటా లేదు..చుక్క కూడా ఇవ్వలేం

హైదరాబాద్‌, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు తాగునీరు చుక్కు కూడా ఇవ్వలేమని, సాగర్‌ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిలో ఏపీకి ఎలాంటి వాటా లేదని కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేయాలంటే.. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఏపీ విడుదల చేస్తే సాగర్‌ నుంచి తాము విడుదల చేస్తామని తేల్చి చెప్పింది. కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించిన బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ పైవిధంగా సమాధానం చెప్పింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 803 అడుగుల వద్ద నుంచి దిగువకు దాదాపు 17-18 టీఎంసీల నీరు లభిస్తుందని, ఆ నిల్వ నుంచి మూడు టీఎంసీలను ఏపీ జల వనరుల శాఖ విడుదల చేస్తే, ఆ మేరకు తాము సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేస్తామని బోర్డుకు తెలిపింది. కాగా.. సెప్టెంబర్‌ రెండో వారంలోగా కృష్ణానదికి వరదలు వచ్చి శ్రీశైలం, సాగర్‌ రిజర్వాయర్లు నిండితేనే రెండు రాష్ర్టాలకు నీటి కరువు తీరుతుంది. లేదంటే, శ్రీశైలంలో 803 అడుగులకు దిగువన ఉన్న 17-18 టీఎంసీలు, సాగర్‌లో 509 అడుగులకు దిగువన ఉన్న 130 టీఎంసీల నీటిని ఇరు రాష్ర్టాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తాగునీటి కోసం రెండు రిజర్వాయర్లను ఖాళీచేయడం మినహామార్గం లేదని రెండు రాష్ర్టాల నీటి పారుదల శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. శ్రీశైలం కంటే కూడా సాగర్‌ నిల్వల వాడ కంపైనే తీవ్ర వత్తిడి వస్తుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రీశైలంలో 800 అడుగులకు దిగువకు వెళితే బురద నీరు వస్తుందని, ఆ నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం వాడుకోవడం కష్టమని తెలిపాయి. దీంతో సాగర్‌లోని డెడ్‌స్టోరేజ్‌లో ఉన్న నీటిని మాత్రమే తాగునీటి అవసరాలకు వాడుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుందని పేర్కొన్నాయి. చివరకు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను తీర్చే అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని తెచ్చే ఏఎంఆర్‌పీ లిఫ్ట్‌ స్కీం పని చేయాలంటే.. దాని అప్రోచ్‌ ఛానల్‌కు సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పంపుల ద్వారా పంపింగ్‌ చేయాల్సి ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి. సాగర్‌ ఎడమ కాల్వ, కుడి కాల్వ తాగునీటి అవసరాలు, కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలను తీర్చాలంటే రిజర్వాయర్‌ లెవెల్స్‌ను 450 అడుగుల వరకు వినియోగించాల్సి వస్తుందని పేర్కొన్నాయి.

No comments:

Post a Comment