Monday, 24 August 2015

బీజేపీ మద్దతుతోనే ఏపీ గొంతు కోశారు

బీజేపీ మద్దతుతోనే ఏపీ గొంతు కోశారు
ఎన్నికల్లో పోటీ చేయను : ఉండవల్లి

హైదరాబాద్, ఆగస్టు 24: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర కూడా ఉందని ఉండవల్లి ఉద్ఘాటించారు. అయితే ఈ విభజనలో తన పాత్రేమీ లేనట్టు వెంకయ్య మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ రెవెన్యూ లోటు భర్తీ చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, ఆ మేరకు రెవెన్యూ లోటును కేంద్రమే త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయని నిలదీశారు. బీజేపీ మద్దతుతోనే పార్లమెంట్‌లో విభజన బిల్లు ఆమోదం పొందిందని, ఆ పార్టీ మద్దతుతోనే ఏపీ గొంతుకోశారని ఉండవల్లి నిప్పులు చెరిగారు. నాడు రాజ్యసభలో వెంకయ్య మాటలు విన్నవారంతా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని నమ్మకంతో ఉన్నారన్నారు. పార్లమెంట్ రూల్స్ ప్రకారం విభజన బిల్లు పాస్ కాలేదని అన్నారు. పాస్‌కాని బిల్లును ఎలా అమలు చేస్తారంటూ సుప్రీంకు కూడా వెళ్లామని ఉండవల్లి చెప్పారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపిస్తామని ఉండవల్లి ఉద్ఘాటించారు

No comments:

Post a Comment