Wednesday, 5 August 2015

కొత్త మలుపు తిరిగిన రిషితేశ్వరి కేసు

కొత్త మలుపు తిరిగిన రిషితేశ్వరి కేసు
కలకలం రేపుతున్న డైరీలోని అంశాలు

గుంటూరు, ఆగస్టు 5 : ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా రిషితేశ్వరి డైరీలోని అంశాలు కలకలం రేపుతున్నాయి. ర్యాగింగ్‌ భూతానికి బలైన రిషితేశ్వరి కేసు రోజు కొక కొత్తమలుపు తిరుగుతోంది. చనిపోయేముందు ఆమె రాసిన డైరీలోని రెండు పేజీలు బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

వర్శిటీలో తన స్నేహితులు, తనకు ఎదురైన అనుభవాలు, నమ్మిన స్నేహితులు చేసిన మోసాన్ని రిషితేశ్వరి తన డైరీలో వివరంగా రాసింది. స్నేహితులని నమ్మినవారే తనను మోసం చేశారని ఆమె బాధపడింది. మంచి స్నేహితుడు అనుకున్న తోటి విద్యార్థి తనకు ఐ లవ్‌ యూ చెప్పేసరికి షాక్‌ అయ్యానని రాసింది. ప్రేమను కాదన్నందుకు ఆ విద్యార్థి తనకు అసభ్య మేసేజ్‌లు పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే నమ్మిన స్నేహితురాలు తనను దారుణంగా మోసం చేసిందని, తన వ్యక్తిగత వివరాలను అందరికి చెప్పిందని డైరీలో రాసుకుని రిషితేశ్వరి బాధపడింది.

అయితే డైరీలోని కొన్ని పేర్లను కొట్టివేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పేర్లు ఎవరివి? అసలు ఆ పేర్లను ఎవరు కొట్టేశారు? దీని వెనుక ఎవరు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చనిపోయిన తర్వాత ఆ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే డైరీలోని రెండు పేజీలు బయటకు వచ్చాయి. పోలీసుల వద్ద ఉన్న డైరీలో పేజీలు ఎలా బయటకు వచ్చాయన్నది మిష్టరీగా మారింది. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.

ఈ నేపథ్యంలో డైరీలో రెండు పేజీలు బయటకురావడంతో కేసు విచారణ చేస్తున్న పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పడు బయటపడిన డైరీలో రెండుపేజీలపై 23 అని రాసి ఉంది. లేఖలోని అంశాలతోపాటు అసలు ఈ లేఖ ఎప్పటిది? ఎప్పుడు... ఎలా...ఎక్కడ బయటకు వచ్చిందన్న అంశంపై దర్యాప్తు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. రిషితేశ్వరి జులై 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా 10 రోజుల అనంతరం తిరిగి బుధవారం నాగార్జునా వర్శిటీ ప్రారంభమైంది. విద్యార్థులందరూ క్లాసులకు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ‘‘ర్యాగింగ్‌ చేస్తే కఠిన చర్యలు, స్ర్తీలను గౌరవించు’’ అనే బోర్డులను ఏర్పాటు చేశారు.


రిషితేశ్వరి ఘటన మరువకముందే గుంటూరులో మరో విద్యార్థిని ఆత్మహత్య


   గుంటూరు, ఆగస్టు 5: రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన మరవకముందే మరో ఘటన గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. పుల్లడిగుంటలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఈ విషాదం జరిగింది. కాలేజీ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న సునీత అనే విద్యార్థిని కళాశాల భవనం పైనుంచి దూకడంతో అక్కడికక్కడే మరణించింది. అయితే ఆ యువతి ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషించగా ఫ్రెండ్‌తో కలిసి ర్యాగింగ్‌కు  సునీత పాల్పడింది. ఇలా చేస్తే టీసీ ఇస్తామని ప్రిన్సిపాల్ మందలించడంతో సునీత ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం తెలిసింది. సునీత స్వస్థలం ప్రకాశం జిల్లా చందలూరు గ్రామం గా పోలీసులు పేర్కొన్నారు. 

No comments:

Post a Comment