- ఆశించిన మెజారిటీ ఏదీ?
- కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు
- పులివెందులకు నీళ్లొస్తే ఆటలు సాగవని వైసీపీలో భయం
కుప్పం, ఆగస్టు 18: ‘ఇల్లు వదిలిరాని తమిళనాడు సీఎం జయలలిత.. ఎమ్మెల్యేగా పోటీచేస్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా ఓటర్లు గెలిపిస్తున్నారు. మరి... అనుక్షణం కుప్పం అభివృద్ధిని కాంక్షిస్తూ.. బాగోగులను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నా ఆశించిన మెజారిటీ రాకపోవడమేంటి?’ అని కుప్పం పార్టీ శ్రేణులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం పర్యటనలో భాగం గా మంగళవారం రాత్రి ఆయన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ నేతల పనితీరుపట్ల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ‘పులివెందులకు నీళ్లొస్తే తమకు పుట్టగతులుండవని, తమ ఆటలు సాగవని వైసీపీ భయపడుతోంది. అందుకే.. ఉభయ గోదావరి జిల్లాల్లో చిచ్చు పెట్టడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. విపక్షాల ఆటలక్కడ సాగడం లేదు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నదుల అనుసంధానం చేసి తీరుతాం. కరువు సీమను సస్యశ్యామలం చేసి రైతన్నకు అండగా నిలుస్తాం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కుప్పంలో జరిగిన డ్వాక్రా, మహిళా సంఘాల సభలో పాల్గొని ప్రసంగించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అమలు చేస్తున్నామని, కాకపోతే రెండుమూడు విడతల్లో వారి ఖాతాలకే నిధులు జమ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తొన్నా విభజన సమస్యలు వెంటాడుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అనిమిగానిపల్లెలో 3 గంటలు
కుప్పం మండలం అనిమిగానిపల్లెలో చంద్రబాబు సుమారు 3 గంటలపాటు ప్రజలతో మమేకమయ్యారు. ముందుగా ఎస్సీ కాలనీకి చేరుకున్న చంద్రబాబు.. మునికృష్ణ, జ్యోతి దంపతులతో కలిసి భోజనం చేశారు. ఆ ఇంటి వద్దే గ్రామస్థులతో ముఖాముఖి మాట్లాడారు. తర్వాత సుజల స్రవంతి ప్లాంటును ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పాలు తాగించి ‘డ్రింక్ మిల్క్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భిణులకు సీమంతం చేశారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఇదిలావుండగా, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అమలుపై మంగళవారం విజయవాడలో ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
No comments:
Post a Comment