Tuesday, 25 August 2015

మరణం ఇలాగా రావొచ్చు..బోగీని చీల్చిన గ్రానైట్‌ రాయి

మరణం ఇలాగా రావొచ్చు..బోగీని చీల్చిన గ్రానైట్‌ రాయి

  • గేటు వేసినా దూసుకెళ్లి  రైలును ఢీ కొట్టిన లారీ
  • అనంతలో ఘోర ప్రమాదం
  • లారీని క్లీనర్‌ నడపడమే కారణం!
అనంతపురం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆదివారం అర్థరాత్రి దాటింది... సమయం 2.15 నిమిషాలు. 20 టన్నుల గ్రానైట్‌ బండను తీసుకొని ఓ లారీ వేగంగా దూసుకెళుతోంది. దారిలో రైల్వే క్రాసింగ్‌ వచ్చింది. అదే సమయంలో రైలు వెళుతుండడంతో గేటు వేసి ఉంది. మితిమీరిన వేగంతో వెళుతున్న లారీ గేటును ఛిన్నాభిన్నం చేసుకుంటూ రైలును ఢీకొట్టింది. లారీలోని 20 టన్నుల గ్రానైట్‌ రాయి రైలు బోగీని ఛిద్రం చేసుకుంటూ ఇవతలనుంచి అవతలకు వెళ్లి పడింది. ఈ ప్రమాదంలో హెచ్‌1ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు, లారీ క్లీనర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ప్రమాదం అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణ సమీపంలో జరిగింది. మడకశిరనుంచి 20 టన్నుల గ్రానైట్‌ బండతో ఏపీ 16 టీటీ 9885 నెంబర్‌ లారీ ఆదివారం అర్ధరాత్రి బయలు దేరింది. క్లీనర్‌ నాగరాజే ఆ సమయంలో లారీనడుపుతున్నాడు. ఆ లారీ పెనుకొండ సమీపంలోని రాజేశ్వరి కాలనీ సమీపంలో ఉన్న రైల్వే క్రా సింగ్‌ను చేరుకుంది. ఆ సమయంలో బెంగళూరు-నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వెళుతుండడంతో రైల్వే గేట్‌ వేసి ఉంది. అది గమనించని నాగరాజు అతివేగంతో రైల్వే గేటునుంచి దూసుకుపోయి నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టాడు. లారీలోని గ్రానైట్‌ బండ అతివేగంగా హెచ్‌ 1 బోగీని ధ్వంసం చేసుకుంటూ ఇటు నుంచి అటువైపునకు బుల్లెట్‌లా దూసుకుపోయింది. దీంతో ఆ బోగీలోని ఓ చాంబర్‌లో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లా దేవదుర్గ ఎమ్మెల్యే వెంకటే్‌షనాయక్‌(82), అదే ప్రాంతానికి చెందిన రైతు ఈదూరు పుల్లారావు(50), బెంగళూరు ఇండోఫిల్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ టీఎ్‌స డీ రాజు(50), అదే బోగీలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన సయ్యద్‌ అహ్మద్‌ (48)తోపాటు లారీ నడుపుతున్న తాడిపత్రికి చెందిన నాగరాజు(48) మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.
 
తప్పిన పెను ప్రమాదం... 
భారీ గ్రానైట్‌ రాయి రైలు బోగీని ఛిద్రం చేసిన క్రమంలో మిగిలిన బోగీలు కూడా కుదుపునకు లోనయ్యాయి. హెచ్‌ 1 బోగీకి ముందున్న ఎస్‌ 1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4, ఎస్‌5 బోగీలు పట్టాలు తప్పాయి. దాదాపు 300 మీటర్ల దాకా అలాగే ముందుకు సాగడంతో వాటి చక్రాలు ఊడిపోయాయి. అలా వెళ్లిన ఆ బోగీలు 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనపై నిలిచిపోయాయి. ఏమాత్రం అదుపుతప్పిఉన్నా ఆ బోగీలన్నీ వంతెనపైనుంచి లోయలోకి పడి ఉంటే ఊహించనంత భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. సమాచారం అందగానే కలెక్టర్‌ శశిధర్‌, డీఐజీ సత్యనారాయణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రమాద స్థలికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, జడ్పీ చైర్మన్‌ చమన్‌, స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రమాద స్థలిని సందర్శించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.50వేలు చొప్పున బెంగుళూరు డీఆర్‌ఎం సంజయ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. రైల్వేశాఖకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేనందున ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించలేదని నైరుతి రైల్వే డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సంజీవ్‌అగర్వాల్‌ ప్రకటించారు.

క్షణాల్లో ప్రమాదం
గేటు వేసినప్పుడు వాహనాలు ఏవీ రాలేదు. రైలు గేటు సమీపంలోకి రాగానే అవతలి వైపు నుంచి వాహ నం వెలుతురు కనిపించింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంరావడంతో నా వద్దనున్న గ్రీన్‌సిగ్నల్‌ను రెడ్‌సిగ్నల్‌లోకి మార్చి సమాచారాన్ని అధికారులకు అందించాను. ప్రమాదం క్షణా ల్లో జరిగిపోయింది.      - గేట్‌మన్‌ తిమ్మప్ప

No comments:

Post a Comment