Thursday 27 August 2015

గ్లామర్ కోల్పోయిన ప్రత్యేక హోదా

హోదాకు నిధుల కోత
గ్లామర్ కోల్పోయిన ప్రత్యేక హోదా

  •  90 శాతం గ్రాంటు ఒక్కటే ప్రధాన ఆకర్షణ
  •  నిధులు తగ్గితే హోదా వచ్చినా ఒరిగేదేమీ లేదు
  •  మంచి కేటాయింపులతో ప్యాకేజీయే బెటర్‌
  •  ఏపీ ఆర్థిక శాఖాధికారుల అభిప్రాయం
హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదా కోసం దేశవ్యాప్తంగా అనేక రాషా్ట్రలు పోటీ పడుతున్నా ఈ హోదాకు క్రమంగా గ్లామర్‌ తగ్గిపోతోంది. ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత పడుతుండడమే దీనికి కారణం. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా రాషా్ట్రలకు అందే
నిధులు మరీ తగ్గిపోయాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వంటి రాషా్ట్రలు పాత రోజులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టడం వృథా అని, ఆ హోదా వచ్చినా ఇప్పుడు దాని వల్ల వచ్చే నిధులు పెద్దగా ఉండటం లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధిపరంగా బాగా వెనకబడి ఉన్న ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌, హిమాచల్‌ వంటి రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చే నిమిత్తం వాటికి ప్రత్యేక హోదా కల్పిస్తూ వచ్చారు. వీటికి కొన్ని పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇచ్చినా, వాటిని విడిగా ఇచ్చారు. ప్రత్యేక హోదాకు, ఈ రాయితీలకు సంబంధం లేదు. ఈ రాయితీలు కూడా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఇచ్చారు. అలాగే, హోదా రాషా్ట్రలకు మూడు నాలుగు పద్దుల కింద కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తూ వచ్చింది. ఇదంతా 90 శాతం గ్రాంటుగా వస్తుండడంతో రాషా్ట్రలకు పెద్ద ఆకర్షణగా మారింది. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి ఏఐబీపీ ద్వారా నిధులు; విదేశీ రుణ ప్రాజెక్టుల కింద హోదా రాషా్ట్రలకు 90 శాతం గ్రాంటుగా ఇస్తూ వస్తున్నారు. కానీ, క్రమంగా ఈ రాషా్ట్రలకు ఈ పథకాల ద్వారా వచ్చే నిధులు భారీగా తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు, 2005- 06లో హోదా రాషా్ట్రలకు కేంద్రం అన్ని రాషా్ట్రలకు ఇచ్చే మొత్తం సాయంలో 56 శాతం నిధులు దక్కాయి. 2015- 16కు వచ్చేసరికి ఇది 15 శాతానికి పడిపోయింది. హోదా రాషా్ట్రలకు 40 శాతం మేర కేంద్ర సాయం తగ్గిందని ఆర్థిక శాఖ అధికారుల విశ్లేషణలో తేలింది. కాగా, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రాషా్ట్రలకు నిధుల కేటాయింపు పెంచారు. గతంలో కేంద్ర ఆదాయంలో 32 శాతం వాటాను రాషా్ట్రలకు ఇచ్చేవారు. ఇప్పుడు హోదాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకూ దానిని 42 శాతానికి పెంచారు. ఆ తర్వాత వివిధ పేర్లతో రాషా్ట్రలకు ఇతరత్రా ఇచ్చే సాయాన్ని నిలిపివేశారు. ఉదాహరణకు, హోదా రాష్ట్రాలకు గతంలో గణనీయంగా నిధులు కేటాయించే రాషా్ట్రల వార్షిక ప్రణాళికలకు ఇచ్చే సాయం, ప్రత్యేక ప్రణాళికా సాయం, ప్రత్యేక కేంద్ర సహాయాన్ని 2015- 16 నుంచి పూర్తిగా నిలిపివేశారు. అలాగే, ఏఐబీపీ పథకం కింద సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చే నిధులను కూడా తగ్గించేశారు. 2014- 15లో ఈ పథకం కింద రాషా్ట్రలకు రూ.8992 కోట్లు ఇస్తే ఈ ఏడాది దానిని దేశం మొత్తానికి కలిపి రూ.1000 కోట్లకు పరిమితం చేశారు. ‘‘ప్రత్యేక హోదా రాషా్ట్రలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా వస్తాయన్నది పెద్ద ఆకర్షణ. కానీ, కేంద్రం ఇచ్చే నిధులు బాగా తగ్గిపోతున్నప్పుడు ఆ హోదా పెద్దగా లాభసాటి కాదు. పెద్ద పోరాటం చేసి ప్రత్యేక హోదా తెచ్చుకొని, ఆ తర్వాత పెద్దగా నిధులు రాకపోతే దెబ్బతింటాం. ఏ మార్గంలో నిధులు వస్తాయన్న దానిపైనే ఇప్పుడు దృష్టి పెట్టాలి’’ అని సీనియర్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. హోదా ఉంటే విదేశాల నుంచి వచ్చే రుణాల్లో కూడా 90 శాతం గ్రాంటుగా వస్తాయని, అదొక లాభమని కొందరు చెబుతున్నారు. ఆర్థిక శాఖాధికారులు దానితో కూడా విభేదిస్తున్నారు. ‘‘ఈ హోదాను ఐదేళ్లకు ఇస్తారు. ఇంత తక్కువ వ్యవధిలో విదేశీ రుణ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు తయారు చేయడం, వాటికి విదేశీ సంస్థలతో ఆమోదం పొందడం, నిధులు రావడం అంత తేలిక కాదు. కొన్ని నిధులు వచ్చినా వాటి పరిమాణం పెద్దగా ఉండకపోవచ్చు’’ అని ఒక అధికారి వివరించారు. ఆర్థిక కోణంలో చూసినప్పుడు హోదాతో పోలిస్తే ప్రత్యేక ప్యాకేజీ మేలని ఏపీ ఆర్థిక శాఖ వర్గాలు బలంగా భావిస్తున్నాయి.

No comments:

Post a Comment