రాజధాని తరలింపులో రాజకీయ పార్టీల నాయకులకు, వివిధ వర్గాల ప్రజలకు రకరకాల అభిప్రాయాలు ఉన్నట్లే, ఉద్యోగులకు కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నట్లు బాచిన రామాంజనేయులు గారి వ్యాసం (ఆగస్టు 14, తాత్కాలిక రాజధానికి తరలింపు ఎలా?) చూస్తే అర్ధమ వుతుంది. ఈ అభిప్రాయాల జోలికి పోకుండా, ప్రస్తుతం హైదరాబాద్‌లో మనకు పని ఏమిటి - అనే భావా వేశానికి, హైదరాబాద్‌లో మన డబ్బులు ఎందుకు ఖర్చుపెట్టాలనే క్షణి కావేశానికి తావు ఇవ్వకుండా, రాజధానిని అర్ధంతరంగా తర లించడం వల్ల వచ్చే లాభనష్టాలను బేరీజు వేసి, లాభం వైపు మొగ్గు చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అసలు తాత్కాలిక తరలింపు అవసరాన్ని అర్ధం చేసుకోవాలంటే, రాజ ధానిలో ఉండే వివిధ ప్రభుత్వ విభాగాలస్థాయి, వాటికి ఉద్దేశిం చిన పనిని కొంత అవగాహన చేసుకోవాల్సిన అవసరముంది.
స్థూలంగా చూస్తే, మన కార్య నిర్వాహక వ్యవస్థ - అందు లోని వివిధ ప్రభుత్వ విభాగాలు, మూడు అంచెలలో పని చేస్తాయి. వీటిలో మొదటిది సచివాలయం. ఇది విధాన నిర్ణ యాలకు కేంద్రం. అంటే ముఖ్యమంత్రి నాయకుడుగా ఉండే మంత్రివర్గం, ఒక్కొక్కమంత్రి అధిపతిగా ఉండే వివిధ ప్రభుత్వ శాఖలు. సాధారణంగా సచివాలయం - విధాన నిర్ణయాలు తీసుకోవడం, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించడం, వాటి అమలుకు సంబం ధించిన నిర్దేశికాలు రూపొందించడం, వివిధ పథకాలకు నిధు లను కేటాయించి విడుదల చేయడం శాసనసభ జరగనప్పుడు తీసుకొన్న విధాన నిర్ణయాలకు సంబంధించిన విషయాలకు- శాసనసభ నుంచి అనుమతి పొందడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందువలన ప్రత్యేకంగా పౌరులు ఎవరికీ వాస్తవానికి సచివాలయంతో పని ఉండదు. అయితే తమ వ్యక్తిగత సమస్యల గురించి మంత్రుల వద్దకు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం కోసం మాత్రం సుమారు చాలా కొద్దిమంది సాధారణ పౌరులు సచివాలయానికి వస్తుంటారు. ఇక మిగతా వివిధ ప్రభుత్వ శాఖలలో పని గురించి వచ్చే వారిలో సింహభాగం మండల/జిల్లా/రాష్ట్ర స్థాయి ఉద్యోగులు తమ వ్యక్తిగత సర్వీసు సమస్యల గురించి, కొద్దిమంది కాంట్రాక్టర్లు, ఏజెంట్లు- వీరు రకరకాల బిల్లుల చెల్లింపుకై నిధుల విడుదలను వేగవంతం చేయించుకోవడం కోసం, వేరే వారి పనిని తమ పలుకుబడితో చేయిస్తామనో సచివాలయానికి వస్తారు. అడపాదడపా, ఎవరైనా సాధారణ పౌరులు సచివాలయానికి వచ్చి తమ వ్యక్తిగత సమస్య మీద ఒక వినతిపత్రాన్ని ఇస్తే, సచివాలయ శాఖలు - తమ శాఖాధి పతి కార్యాలయాన్నో, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్నో- ఈ వినతి పత్రాన్ని అమలులో ఉన్న రూల్స్ ప్రకారం పరిశీలించి తగు నిర్ణయం తీసుకోండి- అనో లేదా ఆ వ్యక్తికి మంత్రుల లేదా శాసనసభ్యుల అండ ఉంటే, ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రస్తుతం అమలులోఉన్న నియమ నిబంధనలలో చేయవలసిన మార్పులను సూచిస్తూ ఒక నివేదిక పంపండి - అనో వారికి పంపడం మినహా సచివాలయాల శాఖలు చేసేదేమీ ఉండదు.
రెండవది శాఖాధిపతి కార్యాలయాలు. రాష్ట్రస్థాయిలో పనిచేసే ఈ కార్యాలయాలు - సచివాలయం ఇచ్చే వివిధ మార్గదర్శకాలకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం, వివిధ పథకాల అమలు తీరును, నిధుల ఖర్చును పరిశీలించి అవి సరిఅయిన లబ్ధిదారులకు అందేలా పర్యవేక్షించడం, వివిధ పథకాల అమలులో ఎదురయ్యే లోటుపాట్లను గుర్తించి, వాటిలో తగు సవరణలకు ప్రభుత్వానికి నివేదించడం- అంటే ఒక విధంగా - సచివాలయానికి - పథకాలు అమలు అయ్యే క్షేత్ర స్థాయికి -అనుసంధాన కర్తగా వ్యవహరిస్తాయి. ఇక్కడ కూడా సాధారణ పౌరులకు పని వుండదు. ఇక్కడికి వచ్చే వారు ఎక్కువమంది పదోన్నతి, స్థానచలనం, క్రమశిక్షణ కేసుల వంటి వాటి గురించి వచ్చే ఉద్యోగులే ఉంటారు. ఇక్కడకు వ్యక్తిగత పనులమీద వచ్చే పౌరుల సంఖ్య చాలా తక్కువ. రెవిన్యూ, పంచాయతీ రాజ్ వంటి శాఖలో ఈ సందర్శకుల సందడి ఎక్కువగానే వున్నా, ఆ స్థాయిలో సమస్యలు పరిష్కారమయ్యేది చాలా తక్కువ.
ఇక మూడవది జిల్లా స్థాయి. వాస్తవానికి మండల స్థాయి/ గ్రామ స్థాయిలో కూడా కార్యాలయాలు ఉన్నా, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు దీన్నే క్షేత్రస్థాయి అనవచ్చు. దాదాపు అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, సచివాలయం ఇచ్చే నియమ నిబంధనలకు అనుగుణంగా, శాఖాధిపతులు ఇచ్చే కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా, జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకొంటాయి. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించే అన్ని పథకాలు, కార్యక్రమాలు, లబ్ధిదారుల ఎంపిక అన్నీ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో, ఆయన స్థాయిలోనే జరుగుతాయి. అందుకే ఒక జిల్లా నుంచి అధికారికంగా ఏ సమాచారం రావాలన్నా ముఖ్యమంత్రి నుంచి అందరు జిల్లా కలెక్టర్‌పైనే ఆధార పడతారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖలకు జిల్లా స్థాయిలో అధికారులు ఉన్నా, వీరంతా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోనే ఉంటూ, తమ శాఖాధిపతి కంటే కూడా, జిల్లా కలెక్టర్‌కు జవాబుదారిగా ఉంటారు. కాబట్టి, ఏ ప్రభుత్వ శాఖకు సంబం ధించిన పని అయినా, అమలులో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటే, అది జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కార మవుతుంది. కాబట్టి జిల్లాస్థాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్ఠ పరిచి, వారితో సరిగా పని చేయించగలిగితే, సగం సమస్య తీరి, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు వచ్చే పౌరుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.
అంతే గానీ, అయిదు కోట్లమంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు తమ వద్దకు రావాలని కోరుకొంటున్నారు అంటూ - ఉద్యోగులు మా కోసం ఈ త్యాగం చేయలేరా అని ప్రశ్నిస్తున్నారు అంటూ- మనని మనం మభ్య పెట్టుకొని, ప్రైవేటు భవనాలను అక్విజిషన్ పేరుతో స్వాధీనపర్చుకొని లేదా కోట్లు కోట్లు వెచ్చించి అద్దెకు తీసుకోనో, తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోవడం వల్ల తక్షణ ప్రయోజనం లేకపోగా, అక్విజిషన్ వల్ల భవనపు సొంతదారుల ఆగ్రహానికి, అద్దెల వల్ల అదనపు ఆర్థిక భారానికి గురికావలసి వస్తుంది. ముందుగా హైదరాబాద్‌ను, కేంద్రం ఆంధ్రప్రదేశ్ మీద దయతోనో, దాక్షిణ్యంతోనో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చేయలేదని గుర్తించాలి. అరవై సంవత్సరాలు కలసి ఉన్న రాష్ర్టాన్ని ఏకాభిప్రాయం లేకుండా విడదీసారు కాబట్టి, కంటి తుడుపు చర్యగా, 10 సంవత్సరాలలో, నవ్యాంధ్రకు కావలసిన రాజధానిని నిర్మించుకోవడానికి, అక్కడ సచివా లయం, శాసనసభ వంటివి నిర్మించుకోవడానికి తగిన ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంటే పదేళ్ళలో, నవ్యాంధ్రకు కావలిసిన రాజధానిని, ఆ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలను పూర్తిచేసి, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న నవ్యాంధ్ర ప్రభుత్వాన్ని అక్కడికి తరలించాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే అని మనం మరవకూడదు. ఒకవేళ కార్యాలయాలు ఇప్పుడే తరలిపోతే, రాజధానికి కేంద్ర నిధులు వస్తాయి గానీ, అవి పది సంవత్సరాలలోనా, 20 సంవత్సరాలలోనా అన్నది దేవుడికే తెలియదు. ఇక విభజననే ఊహించలేని మనమెంత? రేపు కేంద్రం కూడా, ఆ తాత్కాలిక కార్యాలయాలనే, శాశ్వతం చేసుకోండి - మేము ఇంత మాత్రమే సహాయం చేయగలం అని, తృణమో పణమో విసిరేస్తే దాన్నే తీసుకొనిపోవాల్సిన దుర్గతి పడుతుంది. ఒకసారి తరలింపు జరిగేతే, కేంద్ర ప్రభుత్వంపై, విభజన చట్టానికి అనుగుణంగా, పది సంవత్స రాలలో రాజధాని నిర్మించి, ఆంధ్ర ప్రభుత్వాన్ని అక్కడకు తరలించవలిసిన బాధ్యత నుంచి మనమే బయటపడవేసినట్లే. అసలే విభజన జరగదు జరగదు అనుకొంటూ - మనకు కావలసినవి సాధించడంలో ఒకసారి మోసపోయిన సీమాంధ్ర ప్రజలు మరోసారి మోసానికి గురయితే తట్టుకోలేరు. దీన్ని ఊహించడానికి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ఆడుతున్న నాటకాన్ని చూస్తే చాలు. కాబట్టి, ఆంధ్రప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్‌లోనే కొనసాగడం వల్ల వచ్చే నష్టాలను ఎక్కువగా ఊహించకుండా, రాజధాని, పోలవరం వంటి వాటికి పూర్తిస్థాయిలో నిధులు రాబట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సాధారణ పౌరులు సచివాలయం, శాఖాధిపతి వంటి కార్యాలయాలకు రాకుండానే వారి సమస్యలను పరిష్కరించడానికి మార్గాంతరాలు అన్వే షించాలి. ముఖ్యమంత్రి ఎలా అయినా విజయవాడలో వారానికి కొన్ని రోజులు ఉండటానికి నిర్ణయం తీసుకొన్నారు కాబట్టి, మంత్రులందరూ కూడా నిర్ణీత రోజులలో ప్రజలకు అందు బాటులో విజయవాడలోనే ఉంటారు కాబట్టి తమతో పని ఉన్నవారు హైదరాబాద్ వరకు రానవసరంలేదనీ ప్రకటించాలి.
- శ్రీ వెంకట సూర్య ఫణి తేజ దినవహి
తాత్కాలిక రాజధానికి తరలింపు ఎలా? (14-Aug-2015) | |
|
తెలుగు రాష్ట్రాల ముందు రెండు బృహత్తర కార్యక్రమాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు నూతన రాజధాని నిర్మాణ కార్యక్రమం ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు అన్ని రంగాల్లో స్వయంపోషక శక్తిని సాధించి హైదరాబాద్ నగరాన్ని భారతదేశ రెండవ రాజధానిగా తీర్చిదిద్దటమనే కార్యక్రమం ఉన్నది. ఈ కలలను నిజం చేయటానికి ఉభయ రాష్ట్రాల్లోని ఉద్యోగులందరూ కార్యోన్ముఖులు కావాలి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి తరలిపోవటానికి ఉద్యోగులందరూ సిద్ధంగా ఉండాలి. భావితరాలకు మనం మేలు చేయటానికి ఇదే సరైన సమయంగా భావించండి.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రజలు తమ ప్రాంతానికి రాజధాని ఎప్పుడువస్తుందా అని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. హైదరాబాదు పదేళ్ళు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్ 5 చెప్పినప్పుడు కొంత సంతోషం కలిగిన మాట వాస్తవమే. రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాంత ప్రజల మనోభావాలు వేగంగా మారిపోయాయన్న సత్యాన్ని గుర్తించాలి. ప్రస్తుతం హైదరాబాద్‌తో మనకు పనేమిటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇంకా పదేళ్ళ పాటు తమ సొమ్మును హైదరాబాద్‌లో ఎందుకు ఖర్చుచేయాలని సామాన్యులనుంచి పారిశ్రామికవేత్తల దాకా వాదిస్తున్నారు. ఎంత తొందరగా తమ ప్రాంతానికి రాజధాని వస్తే అంత మంచిదని ప్రజలు భావిస్తున్నారు. పరాయి రాష్ట్రంలో తమ రాజధాని ఉండటాన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి 90ఏళ్ళ ముసలాళ్ళ వరకు వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాంతం నుంచే సుపరిపాలన, స్వపరిపాలన అందించాలని మనసారా కోరుకొంటున్నారు. రాజధాని తరలింపులో అనేక సమస్యలున్నాయని చెప్పే నాయకులతో ఆ ప్రాంత ప్రజలు ఏకీభవించటం లేదు. రాజధానిని తరలించటానికి సౌకర్యాల కన్నా చిత్తశుద్ధి ఉండాలని వాదిస్తున్నారు. భవనాలు లేవు, ఉద్యోగులు ఒప్పుకోవటం లేదు అని చెప్పే కారణాలను ప్రజలు విశ్వసించటం లేదు. నాయకులకు హైదరాబాద్‌పై మమకారం ఇంకా పోలేదని నిందిస్తున్నారు. కొంతమంది రాజకీయ, ఉద్యోగ నాయకులు పదేళ్ళ తర్వాత కూడా హైదరాబాద్‌లోనే ఉంటామని అంటున్న మాటలు పుండు మీద కారం చల్లుతున్నట్లుగా ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. మరి కొంతకాలం హైదరాబాదు నగరం నుంచి పరిపాలన చేయటం వలన అదనంగా ఒనగూరే ప్రయోజనాలు ఏమీ లేవు. ఫోను ట్యాపింగులు, అవినీతి కేసులు వెలుగులోకి వచ్చాక ప్రజల్లో ఆగ్రహం పెరిగి మెడ బట్టి గెంటేదాకా హైదరాబాద్ వదలిరారా అనే భావం వ్యాపిస్తున్నది. హైదరాబాద్‌లో ఉండే రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో సుమారు యాభైవేల మంది ప్రభుత్వోద్యోగులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఐదు కోట్ల మంది ప్రజలున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉండే హైదరాబాద్ నగరానికి పనులకోసం ఎందుకు రావాలని ప్రశ్నిస్తున్నారు. ఐదుకోట్ల మంది ప్రజలకోసం యాభైవేల మంది ఉద్యోగులు తరలిరాలేరా, సామాన్యప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా అని అడుగుతున్నారు. ప్రజలకోసమే ఉద్యోగులు ఉన్నారే తప్ప ఉద్యోగుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేయటం లేదు కదా అని అంటున్నారు. వేలకొలది ఉద్యోగులు బదిలీలపై దూరప్రదేశాలకు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు రాష్ట్రస్థాయి కార్యాలయాల ఉద్యోగులు తాత్కాలిక రాజధానికి వెళ్ళి పనిచేయటానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాజధాని తరలింపులో వచ్చే సమస్యలను, వాటిని పరిష్కరించే పద్ధతులను సి.నరసింహం అనే మాజీ ఐఏఎస్ అధికారి తన స్వీయచరిత్ర ‘మి అండ్ మై టైమ్స్’ అనే పుస్తకంలో సవివరంగా రాశారు. 1953లో మద్రాసు నుంచి కర్నూలుకు, 1956లో కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధానిని తరలించటానికి కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించటానికి నరసింహంను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన రాత్రింబవళ్ళు పనిచేసి అతి స్వల్పకాలంలో రాజధానిని తరలించటంలో విజయం సాధించారు. కమ్యూనికేషన్ల వ్యవస్థ సరిగాలేని రోజుల్లో అప్పటికప్పుడు మూడునెలల్లో రాజధానిని తరలించగలిగినప్పుడు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో రాజధానిని తక్షణమే తరలించటం పెద్ద సమస్య కాదు. ఆ రోజుల్లో స్థానిక ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు సహకారం అందించబట్టే రాజధాని తరలింపు సులభంగా జరిగిపోయింది. ప్రస్తుతం రాజధానిని తరలించటానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించటానికి పూర్తికాలపు ప్రత్యేక అధికారిని నియమించాలి. ప్రత్యేక అధికారి సిఫారసులను అమలు చేయటానికి త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి.
రాజధాని తరలింపులో భవనాల వసతి, ఉద్యోగుల సమస్యలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో చాలా ప్రైవేటు ఇంజనీరింగు కాలేజీలు మూతపడ్డాయి. ఇంకా ఇతర ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, అపార్టుమెంట్లు ఉన్నాయి. సచివాలయం, కమిషనరేట్లు ఒకే ప్రాంతంలోనో లేక ఒకే భవనంలోనో ఉండాలన్న నియమం పెట్టుకోరాదు. పెద్ద భవనాలు, ఇంజనీరింగు కాలేజీ భవనాల్లో ఎక్కువసంఖ్యలో ఉద్యోగులున్న కార్యాలయాలను, డిపార్ట్‌మెంటులను ఏర్పాటు చేయాలి. చిన్న భవనాలలో చిన్న డిపార్ట్‌మెంటులు ఏర్పాటు చేయాలి. కొంతకాలం పాటు ఎక్కడవసతి దొరికితే అక్కడ ఏర్పాటు చేసుకోవటంలో తప్పులేదు. సచివాలయాన్ని సాధ్యమైనంత మేరకు ఒక చోట ఏర్పాటుచేస్తే మంచిది. మిగతా కమిషనరేట్లను ఇతర భవనాలలో ఏర్పాటుచేస్తే మంచిది.
రాజధాని తరలింపులో మరో ప్రధానమైన సమస్య ఉద్యోగుల విషయం. ఉద్యోగుల్లో నాలుగు రకాల వారు ఉన్నారు. హైదరాబాద్ నగరంలోనే కొంతకాలం పాటు రాజధాని ఉండాలనే ఉద్యోగులు. వీళ్ళు 20శాతం ఉంటారు. వీళ్ళంతా యాభై ఏళ్ళ వయస్సు దాటిన వాళ్ళే. మరో ఐదేళ్ళు రాజధాని హైదరాబాద్‌లో ఉంటే రిటైరు కావచ్చన్నది వీరి అభిప్రాయం. ఇటీవల రిటైర్మెంట్ వయస్సు పెంచినందువలన ఈ తరహా ఉద్యోగుల సంఖ్య పెరిగింది. వీళ్ళు తాత్కాలిక రాజధానికి వెళ్ళటానికి అంత సుముఖంగా లేరు. రెండవ రకం వారు నలభై సంవత్సరాల వయస్సులోపు ఉద్యోగులు. వీళ్ళంతా ఇటీవలే ఉద్యోగాల్లో చేరారు. వీరు కూడా 20 శాతం ఉంటారు. వీరంతా రాజధాని ఎప్పుడు తరలి వెళుతుందా అని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. వీరికి హైదరాబాద్‌లో ఇల్లు, వాకిలి, చెంబూ తపేలా ఏమీ లేవు. మంచి వయస్సులో ఉన్నారు. హైదరాబాద్‌తో మనకేం పని లేదని భావిస్తూ మన ప్రాంతం వెళ్ళి చక్కగా ఉద్యోగం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. మూడో రకం వాళ్ళు నలభై-యాభై ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వారు. వీళ్ళు నలభై శాతం ఉంటారు. వీళ్ళు ఎటుపోవాలో అర్థం కాక తలబాదుకొంటున్నారు. నాలుగో రకం ఉద్యోగులు వ్యాపారాలు, ఇతర కార్యక్రమాలు చేసుకొంటున్నారు. వీరికి లాభం ఎటు వుంటే అటు వెళ్ళిపోతారు. ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ముందు ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు ప్రతి ఉద్యోగి అభిప్రాయాన్ని ఆప్షన్ ఫారం రూపంలో తీసుకోవాలి. ఆప్షన్ ఫారంలో అవసరమైన సమాచారాన్ని అడగాలి. ఉదాహరణకు ఒంటరిగా వస్తున్నాడా లేక కుటుంబంతో వస్తున్నాడా అనే సమాచారం చాలా ముఖ్యం. పిల్లల చదువులపై సమాచారం మొదలైన అంశాలపై ప్రశ్నలు ఉండాలి. తర్వాత ఆప్షన్ ఫారంలోని సమాచారాన్ని క్రోడీకరించి త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలను, ఉద్యోగులకు వసతిని ఒకే భవన సముదాయంలో లేక సమీప భవనాలలో ఏర్పాటు చేయటం మంచిది. రవాణాఖర్చు, శ్రమ పూర్తిగా తగ్గించటానికి వీలుపడుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువసేపు పనిచేయటానికి వీలుపడుతుంది. ఉదాహరణకు-సమీపంలో రెండు భవనాలు ఉంటే ఒకభవనంలో ప్రభుత్వ కార్యాలయం, ఇంకొక భవనంలో ఉద్యోగుల వసతిని ఏర్పాటు చేయాలి. నాలుగు అంతస్థుల భవనం దొరికితే రెండు అంతస్థులు ప్రభుత్వ కార్యాలయానికి కేటాయించి, మిగతా రెండు అంతస్థులలో ఉద్యోగులకు వసతి ఏర్పాటుచేయండి. ప్రభుత్వ ఉద్యోగులను రెండు తరగతులుగా విభజించాలి. ఒంటరిగా వచ్చే వాళ్ళకు వర్కింగ్ మెన్ హాస్టల్ లేదా మెస్ లాగాను, కుటుంబంతో వచ్చే వాళ్ళకు అర్హత మేరకు భవనాలను కేటాయించే ఏర్పాటు చేయాలి. కుటుంబంతో ఉండే ఉద్యోగులకు ప్రభుత్వ ఏర్పాటు ఉంటే ఇంటి అద్దె భత్యం ఇవ్వనవసరం లేదు. ఒంటరిగా వచ్చిన ఉద్యోగుల నుంచి నామినల్ ఛార్జీలను వసూలు చేసుకోవచ్చు. మరో పీఆర్‌సీ వచ్చే వరకు ప్రస్తుతం ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె భత్యాన్ని యథావిధిగా కొనసాగించాలి. భవనాల సేకరణకు అవసరమైతే ‘ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ ఫర్ పబ్లిక్ పర్పస్ అక్విజిషన్’ చట్టం ప్రవేశపెట్టి భవనాల సేకరణ చేయాలి. రాజధాని తరలింపు ఇప్పటికే ఆలస్యం అయింది. వచ్చే మార్చి నెల నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలిక రాజధానికి తరలించాలి. హైదరాబాద్‌లోని ప్రభుత్వ లిటిగేషన్ వ్యవహారాలను చూడటానికి స్కెలిటన్ స్టాఫ్‌ను ఉంచాలి. ఎన్నికలప్పుడు ఎక్కువ మందిని ఎన్నికల విధులకు కేటాయించి అతి తక్కువ మందిని స్కెలిటన్ స్టాఫ్ ఉంచినట్లు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఉద్యోగుల పిల్లల విద్యా, ఉద్యోగ విషయాలను కూడా మార్చిలోపే పరిష్కారం చేసుకోమని చెప్పాలి. నూతన విద్యా సంవత్సరంలోపే అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేసుకోవాలి. తాత్కాలిక రాజధానికి త్వరగా తరలిపోయి రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగస్తులంతా భాగస్వాములు కావాల్సిన తరుణం ఆసన్నమైనది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంక్షేమం, అభివృద్ధిలో పోటీ ఉండాలి. ముఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాల ముందు రెండు బృహత్తర కార్యక్రమాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు నూతన రాజధాని నిర్మాణ కార్యక్రమం ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు అన్ని రంగాల్లో స్వయంపోషక శక్తిని సాధించి హైదరాబాద్ నగరాన్ని భారతదేశ రెండవ రాజధానిగా తీర్చిదిద్దటమనే కార్యక్రమం ఉన్నది. ఈ కలలను నిజం చేయటానికి ఉభయ రాష్ట్రాల్లోని ఉద్యోగులందరూ కార్యోన్ముఖులు కావాలి. తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి తన వంతు కృషిని అందించాలి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి తరలిపోవటానికి ఉద్యోగులందరూ సిద్ధంగా ఉండాలి. భావితరాలకు మనం మేలు చేయటానికి ఇదే సరైన సమయంగా భావించండి. ఏ రాష్ట్రంలోనైనా పనిచేయటానికి, ఎక్కడైనా పనిచేయటానికి సిద్ధంగా ఉండండి.
బాచిన రామాంజనేయులు
అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ అధికారుల సంఘం
రాజధాని తరలింపులో తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని, దానిని బాధ్యతగా భావిస్తామని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎంని కలిసిన ఎన్జీఓ నేత షిఫ్టింగ్ కు సంబంధించి తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళితే సానుకూలంగా స్పందిచారన్నారు. అదే విధంగా రాజధాని తరలింపు, పాలనకు సంబంధించి ఉద్యోగులు సహకరించాలని సీఎం కోరారన్నారు. పీఆర్సీతో పాటు ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, రాబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీయం చెప్పారని ఎన్జీఓ నేత అశోక్ బాబు వివరించారు. - See more at: http://www.expresstv.in/ap-ngos-helped-to-the-capital-movement-16771.aspx#sthash.bcKxm0zo.dpuf
|
|
No comments:
Post a Comment