రాజమండ్రి, ఆగస్టు 15: రైతులకు నీళ్లు ఇస్తే భూమిలో బంగారం పండిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నదుల అనుసంధానంలో భాగంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు వద్ద శనివారం పైలాన్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పట్టిసీమ నిర్మాణంతో అటు కృష్టా, ఇటు గోదావరి నదుల అనుసంధానం జరిగిందన్నారు. వేలాది ఎకరాలకు సాగునీరేగాక రాయలసీమకు తాగునీటి అవసరాలకు కూడా పట్టిసీమ ఎత్తిపోతల నీరు అందుతుందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో తీవ్ర కరువు ఉందన్న ఆయన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో పట్టిసీమ పైప్ లైన్ ఆపరేట్ చేస్తామని, పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ధృడ సంకల్పంతో పనిచేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతులు విదేశాల్లోనూ వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఆగస్టు 15, 2015 భారత్, ఏపీ చరిత్రలోనే శాశ్వతంగా లిఖించదగిన రోజు అని సీఎం పేర్కొన్నారు. కాగా, పట్టిసీమపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఈ ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. 2018 కంటే ముందే పోలవరం పూర్తి చేస్తామని, పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలకు నీటి సమస్య ఉండదని వివరించారు. గోదావరి జిల్లాల ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్న చంద్రబాబు తమ ప్రభుత్వానికి మెజార్టీ ఇచ్చిన జిల్లాలను ఎప్పటికీ మర్చిపోనని విశ్వాసం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు అన్యాయం చేసే పని ఎప్పుడూ చేయబోనన్నారు.
రాష్ట్ర విభజనతో ఇబ్బందులు పెరిగాయని, కష్టపడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావని సీఎం చంద్రబాబు రాష్ట్ర సమస్యలను ప్రజలకు వివరించారు. ‘రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతో మన పొట్ట గొట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను సవాల్‌గా స్వీకరించి రాష్ట్రాన్న దేశంలోనే నెంబర్ వన్‌గా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి ముందు సీఎం చంద్రబాబు వందల కోట్లతో నిర్మించిన ‘పట్టిసీమ’ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద పనుల పురోగతిని పరిశీలించడమేకాక పంపుహౌస్ వద్ద జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. ఇంకా మిగిలి ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
No comments:
Post a Comment