మన లక్ష్యం హరిత అమరావతి: చంద్రబాబు Updated :29-08-2015 17:26:14 |
విజయవాడ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : రాజధా ని అమరావతిని గ్రీన్‌సిటీగా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ ప్రాంతంలో ఏరియల్ సీడింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం విజయవాడలోని ఇంది రాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి సారి గా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా హెలికాప్టర్ నుంచి కొండలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలల్లో విత్తనాలు చల్లే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో దాదాపు 3,500 ఎకరాల్లో విత్తనాలు జల్లే ఏర్పాట్లు చేశామని వివరించారు. సీఆర్‌డీఏను గ్రీన్ పార్క్‌గా చూడటమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రజలందరూ సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటితే ఐదేళ్ల కాలంలో కోట్ల మొక్కలు పెంచిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్క రూ పాల్గొనాలని అప్పుడే మన మనుగడకు పూర్తి భరో సా వస్తుందని సూచించారు. ఏరియల్ సీడింగ్ కోసం కృష్ణపట్నం పోర్టు హెలికాప్టర్‌ను ఉచితంగా ఇవ్వడం ఎంతో సంతోషమన్నారు. హెలికాప్టర్ మెత్తం 30 ట్రిప్పుల ద్వారా ఈ కార్యక్రమన్ని పూర్తి చేస్తుందని వివరించారు.
భవనాలు నావి.. మొక్కలు మీవి
ప్రతి విద్యార్థి తప్పని సరిగా గ్రీన్ కార్ప్స్‌లో చేరాలని సీఎం సూచించారు. విద్యార్థుల పుట్టినరోజు, తల్లిదండ్రుల పుట్టిన రోజు, పరీక్షలు పాసైనా, ఫెయిలైనా మొక్కలు నాటాలన్నారు. మీరు జీవితంలో చేసే పనులన్నింటికీ అవే నిదర్శనం అని పేర్కొన్నారు. వాటిని సంరక్షించే బాధ్యత కూడా పిల్లలే తీసుకుని పెద్దవాళ్లకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో అడవులను అభివృద్ధి చేయడానికి ఉపాధి హమీ ద్వారా రూ. 350 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. మన వాతావరణానికి సరిపోయే విత్తనాలను విదేశాల నుంచి అయినా సరే తెప్పిస్తామని తెలిపారు. నవ్యాంధ్ర రాజధానిలో బిల్డింగ్‌లు, రోడ్లు వేయించడం సంగతి తాను చేసుకుంటానని వాటి పక్కన మొక్కలు పెంచే బాధ్యత పిల్లలు చూసుకోవాలని చమత్కరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 23 శాతం గ్రీనరీ ఈ కార్యక్రమం ద్వారా 40 శాతానికి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు
|
No comments:
Post a Comment