Tuesday 2 June 2015

జగన్‌ ఏపీ అభివృద్ధి నిరోధకుడిగా మారారు - చంద్రబాబు

జగన్‌ ఏపీ అభివృద్ధి నిరోధకుడిగా మారారు
జగన్‌దీక్షకు ధీటుగా స్పందించండి :నేతలతో చంద్రబాబు


హైదరాబాద్‌, జూన్‌ 3 : జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నిరోధకుడిగా మారారని, రాజదాని ప్రాంతంలో రెండు రోజులపాటు జగన్‌ చేపట్టనున్న దీక్షకు ధీటుగా స్పందించాలని పార్టీ శ్రేణులకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం అనంతపురం జిల్లాలో జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి బయలుదేరే ముందు మంత్రులు, ఏపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలతో బాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకే జగన్‌ దీక్ష చేపట్టారన్నారు. మరోవైపు జగన్‌ టీఆర్‌ఎస్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడమే ఇందుకు నిదర్శనమని నేతలకు వివరించారు. కేసీఆర్‌, జగన్‌ దిష్టిబొమ్మలు దహనం చేయాలని కాన్ఫరెన్స్‌లో నిర్ణయించారు. దీనితో పాటు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలపైనా బాబు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రూపొందించుకోవాలని, ఇన్‌చార్జి మంత్రులు ఈ బాధ్యతలను తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

విశాఖ : జగన్‌, కేసీఆర్‌ ఫ్లెక్సీల దహనం...ఉద్రిక్తత

విశాఖపట్నం, జూన్‌ 3 : జగన్‌ దీక్షను నిరసిస్తూ జిల్లాలో టీడీపీ కార్యకర్తల నిరసన ఉద్రిక్తలకు దారి తీసింది. జగదాంబ జంక్షన్‌లో జగన్‌, కేసీఆర్‌ ఫ్లెక్సీ దహనానికి టీడీపీ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు అని తెలియక సివిల్‌ యూనిఫామ్‌లో ఉన్న కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. చివరికి నేతలు, ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సర్దుమణిగింది.

No comments:

Post a Comment