Saturday 20 June 2015

‘సిట్’ కేసులు ఫిట్ కాదేమో!

‘సిట్’ కేసులు ఫిట్ కాదేమో!
Sakshi | Updated: June 20, 2015 06:04 (IST)
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తెలంగాణపై ఎదురుదాడిలోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదై...ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ అవుతున్న కేసుల్లో పస లేదనే వాదన తెరపైకొచ్చింది. కేవలం ప్రతీకార చర్యలో భాగంగానే నమోదు చేసినట్లుందని న్యాయనిపుణులతోపాటు కొందరు పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. వీటి దర్యాప్తులో పరిధి సహా అనేక సాంకేతిక సమస్యలు త లెత్తుతాయని నివేదించారు.
 
అయితే ఇవేమీ పట్టించుకోని ‘ప్రభుత్వ పెద్దలు’ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు తర్వాత  చంద్రబాబుకి చెందినదిగా వెలుగులోకొచ్చిన ఫోన్ సంభాషణల ఆడియోకు సంబంధించి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 88 కేసులు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేయడం కోసం డీఐజీ మహ్మద్ ఇక్బాల్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కేసులన్నింటిలోనూ దాదాపుగా ఐపీసీలోని 12 సెక్షన్లతోపాటు టెలిగ్రాఫిక్, ఐటీ చట్టాల్లోని సెక్షన్లనే జోడించారు.
 
తెలంగాణలో నేరం... ఏపీలో దర్యాప్తా?
ఈ కేసుల దర్యాప్తులో ప్రాథమికంగా పరిధి సమస్య తలెత్తుందని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నేరాలకు సంబంధించి ఏపీలో నమోదైన కేసులు. దేశమంతటా ఒకే చట్టం అమలులో ఉన్నా ఓ ప్రాంతంలో జరిగిన నేరానికి సంబంధించిన కేసుల్ని మరో ప్రాంత పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం లేదు. పైగా తెలంగాణలో జరిగినట్లు ఆరోపిస్తున్న నేరాన్ని ఏపీ పోలీసు విభాగానికి చెందిన ‘సిట్’ దర్యాప్తు చేయడం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
 
అత్యుత్సాహంతో కేసుల్లో సెక్షన్లు...
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు దాదాపు టీడీపీ నేతలు, కార్యకర్తలే. ఈ కేసులపై పోలీసులు అత్యుత్సాహంతో స్పందించారు. వీటిలో అవసరమైన వాటితో పాటు అనవసర సెక్షన్లనూ జోడించారని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఎన్ని రకాలుగా చెబుతున్నా ఏదోలా ముందుకెళ్లాల్సిందేనంటూ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.

No comments:

Post a Comment