Thursday 25 June 2015

అసలు కేసు ఇదీ!

అసలు కేసు ఇదీ!
‘కేసుల’ పర్యవేక్షణపైనే గవర్నర్‌ దృష్టి


  • దానిపైనే ఏజీ అభిప్రాయం కోసం లేఖ
  • సెక్షన్‌- 8పై ఏడాదిగా సాగుతున్న వివాదం
  • బాబు, కేసీఆర్‌, కేంద్రం మధ్య ఉత్తరాల పర్వం
  • స్పష్టత కావాలని లేఖలు రాసిన రాజ్‌భవన్‌
 
గవర్నర్‌కు గతంలోనే మార్గదర్శకాలిచ్చిన కేంద్రంఅటార్నీ జనరల్‌ ఏం చెప్పారో తెలిసింది! ఇంతకీ గవర్నర్‌ ఏం అడిగారు? నరసింహన్‌ దేని గురించి అడిగితే అటార్నీ జనరల్‌ అలాంటి వివరణ ఇచ్చారు? ఇద్దరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు మొత్తం సెక్షన్‌- 8 అమలు గురించేనా? లేక తాజాగా తెరపైకి వచ్చిన కేసుల పర్యవేక్షణ గురించా? ఇవీ ఇప్పుడు కుతూహలం కలిగిస్తున్న ప్రశ్నలు. వీటికి సమాధానం కోసం అన్వేషించినపుడు ఆసక్తికర సమాచారం బయటపడింది.
 
హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌పై గవర్నర్‌ చేతికి అధికారాలు కట్టబెట్టే సెక్షన్‌- 8ను అమలు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ నేతలు, వద్దే వద్దని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు. విభజన చట్టంలోని ఈ సెక్షన్‌ వ్యవహారం ఇప్పుడే తెరపైకి వచ్చినట్టు హంగామా చేస్తున్నారు. కానీ, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రాష్ట్ర విభజన (జూన్‌ 2, 2014) జరిగిన కొన్ని రోజుల నుంచే దీనిపై కీలక పరిణామాలు సంభవించాయి. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు సరిగ్గా ఏడాది క్రితం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గత ఏడాది జూన్‌ 24న ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘‘హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రుల భద్రత, మనోభావాలను పరిగణనలోకి తీసుకొని విభజన చట్టంలో సెక్షన్‌ 8 పెట్టారు. ఇందులోని నిబంధనల పరిరక్షణకు అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా తెలంగాణ బిజినెస్‌ రూల్స్‌లో ఈ నిబంధనలు చేరిస్తే సరిపోతుందని కేంద్ర హోం శాఖ ప్రతిపాదించినట్లు నా దృష్టికి వచ్చింది. కానీ ఇది సరిపోదన్నది నా అభిప్రాయం. హైదరాబాద్‌ నగరంలోని పోలీస్‌ బలగాలను, కమిషనర్‌ స్థాయి నుంచి కింది వరకు, ఉభయ రాషా్ట్రల వారితో కూర్పు చేయాలి. శాంతి భద్రతలు, అంతర్గత భదత్ర, ముఖ్యమైన సంస్థల భద్రతకు సంబంధించిన అంశాల్లో హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనర్లు గవర్నర్‌కు బాధ్యత వహించేలా చూడాలి. ఉమ్మడి రాజధాని పాలనకు నియమితులైన అధికారులు గవర్నర్‌ సలహాదారుల ద్వారా గవర్నర్‌కు రిపోర్ట్‌ చేసేలా చూడాలి. ఈ దిశగా కేంద్ర హోం శాఖ తక్షణం చర్యలు తీసుకొనేలా చూడండి’’ అని చంద్రబాబు ఆ లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 
 
కొద్ది రోజులకే కేంద్రం స్పందన
చంద్రబాబు లేఖపై కేంద్రం స్పందించింది. హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేష్‌ కుమార్‌ ఆగస్టు 6న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు. సెక్షన్‌ 8 అమలుకు సంబంధించి కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా అందులో సూచించారు. ‘‘విభజన చట్టం రూపొందే సమయంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఇతర ప్రాంతాల వారి ఆస్తులు, స్వేచ్ఛ, భద్రతకు సంబంధించి కేంద్రానికి అనేక వినతులు అందాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. పార్లమెంటు కూడా ఈ కోణాన్ని అంగీకరించింది. అందువల్ల సెక్షన్‌ 8 కింద రికార్డులు, లేదా సమాచారం లేదా మంత్రివర్గ నిర్ణయాలకు సంబంఽధించిన సమాచారాన్ని కోరే హక్కు గవర్నర్‌కు ఉంటుంది. ఉమ్మడి రాజధాని ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ నియమిత కాల వ్యవధిలో గవర్నర్‌కు శాంతిభద్రతల నివేదికలు ఇవ్వాలి. తీవ్రమైన నేరాలకు సంబంధించి ప్రత్యేక నివేదికలు కూడా సమర్పించాలి. వీటిపై చట్ట పరిధిలో ఆదేశాలు జారీ చేసే హక్కు గవర్నర్‌కు ఉంటుంది. ఇక ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న అంశాలను పోలీస్‌ అధికారులు గవర్నర్‌కు నివేదించాలి. వాటిపై గవర్నర్‌ సలహాను పాటించాలి. తెలంగాణ డీజీపీ, ఉభయ కమిషనరేట్ల కమిషనర్లతో ఒక బోర్డు ఏర్పాటు చేసి, దాని ఆధ్వర్యంలోనే ఉమ్మడి రాజధానిలో పోలీస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిర్ణయం తీసుకోవాలి. వీటిలో మార్పుచేర్పులు చేయడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుంది. అధికారులు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానిపై నివేదిక కోరే, విచారణకు ఆదేశించే హక్కు, చర్య తీసుకొనే అధికారం గవర్నర్‌కు ఉంటాయి. బాధితుల హక్కుల రక్షణ కోసం ఆయన అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు’’ అని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది.
 
ససేమిరా అన్న తెలంగాణ ప్రభుత్వం
దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. గవర్నర్‌కు విస్తృత అధికారాలు ఇవ్వాలనడం సరికాదని స్పష్టంచేస్తూ, కేంద్రం లేఖ అందిన మూడు రోజులకే అంటే 2014 ఆగస్టు 9నే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘‘గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలనడం రాజ్యాంగం ప్రవచించిన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఒకవేళ గవర్నర్‌ తన అధికారాలను వినియోగించుకోవాల్సి వచ్చినా, తెలంగాణ కేబినెట్‌ సలహా మేరకే నడచుకోవాలి. విభజన చట్టం ప్రకారమైనా కూడా తెలంగాణ మంత్రి మండలి సలహాలను ఆయన పాటించాల్సిందే. అందువల్ల హోంశాఖ పంపిన నోట్‌ను ఉపసంహరించుకోవాలి’’ అని కేసీఆర్‌ తన లేఖలో మోదీని కోరారు. దీంతో ఈ విషయం అలా పెండింగ్‌లో పడిపోయింది. కొన్నాళ్ల తర్వాత కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. విభజన చట్టం ప్రకారం సెక్షన్‌-8 అమలుపై తాము ఇప్పటికే మార్గదర్శకాలు సూచించినందున తదనుగుణంగా బిజినెస్‌ రూల్స్‌లో మార్పులు చేసుకోవాలని కేంద్రం అందులో సూచించింది. అయితే ఈ మార్గదర్శకాలు రాజ్యాంగ విరుద్ధమనీ, దీన్ని ఆమోదించడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు.
 
 రంగంలోకి దిగిన రాజ్‌భవన్‌
విషయం ఇక్కడితో ఆగిపోలేదు. సెక్షన్‌- 8 అమలుకు సంబంధించి తనకు అనేక వినతులు వస్తున్నాయని, ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ లేకుండా దాన్ని అమలు చేయలేమని, అందువల్ల ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ కోసం రూల్స్‌ తయారు చేయాలని రాజ్‌భవన్‌ పలుమార్లు కేంద్రాన్ని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ సర్కారు బిజినెస్‌ రూల్స్‌లో మార్పులు జరగకుండా అధికారులు గవర్నర్‌కు రిపోర్ట్‌ చేయడం కుదరదు కనుక, గైడ్‌లైన్స్‌ అవసరాన్ని నొక్కిచెప్పినట్టు సమాచారం. ఈ మేరకు కేంద్రానికి గవర్నర్‌ లేఖలు కూడా రాసినట్టు ఢిల్లీలోని హోంశాఖ వర్గాలు తెలిపాయి. అయితే విభజన చట్టంలో ‘పవర్‌ టు మేక్‌ రూల్స్‌’ అనే నిబంధన లేనందున, ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ జారీ చేసే వెసులుబాటు లేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అదే సమయంలో ‘‘గవర్నర్‌ విధులు, భాధ్యతలు, అధికారాలు (ఫంక్షనాలిటీస్‌)’’ మీద సవివరమైన నోట్‌ ఒకటి తయారు చేసి, గవర్నర్‌ వ్యక్తిగత అవగాహన కోసం రాజ్‌భవన్‌కు పంపినట్టు తెలిసింది. 2014 ఆగస్టు 6న కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేష్‌ కుమార్‌ రాసిన లేఖకు కొనసాగింపుగా ఇది ఉన్నట్టు సమాచారం. అయితే దీన్ని రాజ్‌భవన్‌ వర్గాలు బయటపెట్టలేదు.
 
కేసుల పర్యవేక్షణే గవర్నర్‌ లక్ష్యం
కేంద్రం పంపిన ఆ నోట్‌ ఆధారంగానే గవర్నర్‌ నరసింహన్‌ తాజా వివాదాలపై అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ అభిప్రాయం కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘ఉమ్మడి రాజధాని ప్రాంతం ఒక రాష్ట్ర పరిధిలో ఉంది. ఇక్కడ మరో రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసులు కూడా ఉన్నారు. పరస్పరం వివాదాలు సాగుతున్నాయి. ఓటుకు నోటు కేసు రాజకీయ వివాదంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇది రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధంగా మారింది. పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం కేసులు పెట్టుకునే పరిస్థితి. ఇది శాంతిభద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉంది. సెక్షన్‌ 8 ప్రకారం హైదరాబాద్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణ గవర్నర్‌ చేతిలో ఉండాలి. ఓటుకు నోటు వ్యవహారం శాంతి భద్రతల వివాదానికి దారి తీస్తుంది కాబట్టి, సెక్షన్‌ -8 ప్రకారం ఈ కేసు దర్యాప్తును నేను నేరుగా (తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా) పర్యవేక్షించవచ్చా? అందుకోసం నోటిఫికేషన్‌ ఇవ్వవచ్చా? ఆ నోటిఫికేషన్‌ ముసాయిదాను మీరు తయారు చేసి పంపించగలరా?’’ అని గవర్నర్‌ ఏజీని అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జూన్‌ 16, 2015న ఏజీకి లేఖ రాశారు. గవర్నర్‌ పేర్కొన్న నోటిఫికేషన్‌ ‘మొత్తం క్లాజ్‌ (సెక్షన్‌-8)’ అమలు కోసం కాదనీ, కేవలం సబ్జెక్ట్‌ (రెండు కేసులపై) క్లారిఫికేషన్‌కు సంబంధించినదనీ నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్లే ఏజీ కూడా గవర్నర్‌ తన విచక్షణ మేరకు నోటిషికేషన్‌ జారీ చేయవచ్చని పేర్కొన్నట్టు చెప్పారు. ఏజీ లేఖ మొత్తం కూడా కేసులపై పర్యవేక్షణకు సంబంధించిన వివరణలాగే ఉందని వారు వివరించారు. విభజన చట్టం ప్రకారం సెక్షన్‌ 8 అమల్లో ఉన్నట్టే కేంద్రం, రాజ్‌భవన్‌ భావిస్తున్నదనీ, అందువల్లే దాని కింద అధికారాలు వినియోగించుకునేందుకు ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు. అయితే ఒకసారి ఇందుకు అవకాశం ఇస్తే ఇది ఆనవాయితీగా మారుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని వివరించారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన సెక్షన్‌-8 వ్యవహారంపై గవర్నర్‌ లేఖలో ఏముందన్నదానిపై అటు రాజ్‌భవన్‌గానీ, ఇటు ఏజీ కార్యాలయంగానీ అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం పట్ల ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ ముఖ్యులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

No comments:

Post a Comment