Wednesday 24 June 2015

8ని ఒప్పుకోకుంటే..విభజననూఒప్పుకోం: ఏపీమంత్రులు

8ని ఒప్పుకోకుంటే..విభజననూఒప్పుకోం: ఏపీమంత్రులు
నేరాల్లేవని పోలీస్ స్టేషన్ ఎత్తేస్తారా?: ప్రత్తిపాటి

  • సెక్షన్‌ 8ను అమలు చేయాల్సిందే
  •  నేను చెప్పిందే వేదం అంటే కుదరదు
  •  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ మంత్రులు ఫైర్‌
హైదరాబాద్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్‌ నా తాత జాగీరు, నేను చెప్పిందే వేదం అని కేసీఆర్‌ అంటే కుదరదు. విభజన చట్టాన్ని ఆమోదించినవారు.. అందులోని సెక్షన్‌ 8ను ఆమోదించాల్సిందే. సెక్షన్‌ 8కి వారు అంగీకరించకపోతే... మేము విభజన చట్టాన్నే అంగీకరించం’ అని ఏపీ మంత్రులు తేల్చి చెప్పారు. మంగళవారం సచివాలయంలో పలువురు మంత్రులు విలేకరులతో మాట్లాడారు. సెక్షన్‌ 8ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్‌ 8ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం, గవర్నర్‌లదేనని స్పష్టం చేశారు. సెక్షన్‌ 8ని సీఎం కేసీఆర్‌ చాక్లెట్‌ అనుకుంటున్నారని రావెల కిశోర్‌బాబు ఎద్దేవా చేశారు. తెలివి, జ్ఞానం, పునర్విభజన చట్టంపై నమ్మకం ఉన్నవారికి మాత్రమే దాని ఉద్దేశం అర్ధమవుతుందన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా సెక్షన్‌ 8 ద్వారా గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించారని చెప్పారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడం కోసమే ఏపీ ప్రభుత్వం సెక్షన్‌ 8 కోసం పట్టుపడుతున్నదనే ఆరోపణలను రావెల కొట్టిపారేశారు. ‘ఈ ఏడాదిలో ఏమీ జరగలేదని మీరు చెబుతున్నారు. ఎంసెట్‌తోపాటు ఎన్ని విషయాల్లో కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందో అందరికీ తెలిసిందే’ అని అన్నారు. విద్యుత్‌ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోమని హైకోర్టు ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
కాగా, ఒక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏడాది కాలంలో ఏమీ నేరాలు జరగకపోతే ఆ స్టేషన్‌నే ఎత్తేస్తారా అని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సమస్యలు లేవని చెబుతూ సెక్షన్‌ 8ను అమలు చేయం అనడం కూడా అంతేనని అన్నారు. 

No comments:

Post a Comment