Tuesday 16 June 2015

సుష్మ తర్వాత బుక్కయిన వసుంధర

సుష్మ అయింది.. ఇక వసుంధర వంతు!
  • సుష్మ తర్వాత బుక్కయిన వసుంధర
  • శస్త్ర చికిత్స సమయంలో రాజే నా భార్య పక్కనే ఉన్నారు
  • నా ఇమిగ్రేషన్‌ పత్రాలపైనా  సంతకం చేశారు: లలిత్‌ మోదీ
  • రాజస్థాన్‌తో పోర్చుగల్‌ ఆస్పత్రి ఎంవోయూపై అనుమానాలు
న్యూఢిల్లీ, జూన్‌ 16: ఐపీఎల్‌ అక్రమార్కుడు లలిత్‌ మోదీ వీసా వివాదంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజె అడ్డంగా బుక్కయ్యారు! కాదు.. కాదు.. సాక్షాత్తూ లలిత్‌ మోదీయే ఆమెను బుక్‌ చేశారు! తన భార్యకు పోర్చుగల్‌లో కేన్సర్‌ శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఆమె పక్కనే వసుంధరా రాజె ఉన్నారని లలిత్‌ మోదీ స్వయంగా వెల్లడించారు. అంతేనా, లలిత్‌ మోదీ బ్రిటన్‌లో నివాసం ఉండడానికి వసుంధరా రాజె సహకరించారు. అతడి ఇమిగ్రేషన్‌ దరఖాస్తుపై 2011 ఆగస్టులో ఆమె సంతకం చేశారు. తాను సంతకం చేసిన విషయాన్ని భారతీయ అధికారులకు తెలియజేయరాదని షరతు కూడా విధించారు. ఇంకో విశేషం ఏమిటంటే, లలిత్‌ మోదీ భార్యకు శస్త్ర చికిత్స చేసిన ఆస్పత్రితో రాజస్థాన్‌ ప్రభుత్వం తరఫున ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. లలిత్‌ మోదీ భార్యకు శస్త్ర చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత ఆ ఆస్పత్రికి రాజస్థాన్‌ ప్రభుత్వం 35 వేల చదరపు అడుగుల భూమిని కూడా కేటాయించింది. దాంతో, ఇప్పటి వరకు సుష్మా స్వరాజ్‌ మెడ చుట్టూనే ఉచ్చు బిగుసుకుందని భావిస్తే.. ఇప్పుడు ఈ వివాదంలో వసుంధరా రాజె కూడా ఇరుక్కున్నట్లు అయింది. ప్రస్తుతం మాంటెనీగ్రోలో ఉన్న లలిత్‌ మోదీ అక్కడ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. తనపై మోపిన అభియోగాల్లో ఏ ఒక్కదానిని అయినా నిరూపించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సవాల్‌ విసిరారు. వసుంధరా రాజె, సుష్మా స్వరాజ్‌ కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం తనను ఇరికించిందని, తన భార్య ప్రస్తుతం అనారోగ్యంతో ఉందని, అందువల్ల తనకు సహాయం చేయాలని సుష్మ, వసుంధరలను తాను కోరానని చెప్పారు. ‘‘నేను బ్రిటన్లో నివాసం ఉండడానికి వసుంధరా రాజె 2011 ఆగస్టులో సంతకం చేశారు. లిఖితపూర్వకంగా అంగీకరించారు. అంతేనా, పోర్చుగల్‌లో నా భార్యకు శస్త్ర చికిత్స జరిగినప్పుడు రాజస్థాన్‌ సీఎం అక్కడే ఉన్నారు. ఇక సుష్మ కుటుంబం నాకు పాతికేళ్లుగా తెలుసు’’ అని మోదీ వివరించారు. ఇంకా విశేషం ఏమిటంటే, బ్రిటన్‌ నుంచి పోర్చుగల్‌ వెళ్లడానికి తనకు ట్రావెల్‌ డాక్యుమెంట్లు రావడానికి శరద్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌, రాజీవ్‌ శుక్లా తదితరులు కూడా సహకరించారని వెల్లడించారు. అయితే, లలిత్‌ మోదీ కుటుంబం తనకు తెలుసని, అయితే, తాను సంతకం చేశానంటూ మీరు చెప్పే పత్రాలు ఏమిటో తెలియదంటూ వసుంధరా రాజె వ్యాఖ్యానించారు. అయితే, మూడు పేజీల మోదీ ఇమిగ్రేషన్‌ పత్రాల్లో.. ‘‘లలిత్‌ మోదీ ఇమిగ్రేషన్‌ దరఖాస్తుకు మద్దతుగా నేను ఈ ప్రకటన ఇస్తున్నాను. అయితే, ఇందుకు ఒక కచ్చితమైన షరతు కూడా పెడుతున్నాను. మోదీకి నేను సహాయం చేసిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ అధికారులకు తెలియరాదు’’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, మోదీ న్యాయవాది మహమూద్‌ అబ్ది విడుదల చేసిన ఆ పత్రాలపై వసుంధరా రాజె సంతకం లేకపోవడం గమనార్హం.

No comments:

Post a Comment