Friday 12 June 2015

మోదీ, ముస్లింలు

మోదీ, ముస్లింలు

భారతీయ జనతా పార్టీలో ముస్లిం నాయకుల పరిస్థితి ఏమిటి? ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వికి చాలా కాలం ముందు సికందర్‌ భక్త్‌ ఉండేవారు. బీజేపీ ‘ముస్లిం ముఖం’గా భక్త్‌ రెండు దశాబ్దాల పాటు ఉన్నారు. ‘హిందువులు మాత్రమే’ ఉన్న పార్టీ అన్న ఆరోపణ నిరాధారమైనదని సికిందర్‌ భక్త్‌ ని చూపిస్తూ బీజేపీ ఖండించేది. అటల్‌ బిహారీ వాజపేయి 1996లో మొదటిసారి ప్రధాన మంత్రి అయ్యినప్పుడు భక్త్‌కు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖను అప్పగించారు. పెద్దగా ప్రాధాన్యం లేని ఆ పోర్ట్‌ఫోలియోతో భక్త్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ సందర్భంలో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనిలా వ్యాఖ్యానించారు: ‘ నేను ముస్లింనయినందునే నా సీనియారీటీని పార్టీ నాయకత్వం గౌరవించలేదా? అని మీరు ప్రశ్నించనున్నారని నాకు తెలుసు’. ఆయన మోములో ఆగ్రహం స్పష్టంగా కన్పించింది. వారం రోజుల అనంతరం భక్త్‌కు అదనంగా విదేశాంగ వ్యవహారాలను కూడా అప్పగించారు. దురదృష్టవశాత్తు వాజపేయి తొలి ప్రభుత్వం 13 రోజులకే పతనమయింది. ఆ మంత్రి వర్గంలో తనకు పెద్దగా ప్రాధాన్యంపై లభించకపోవడంపై భక్త్‌ ప్రతిస్పందన బీజేపీలో ముస్లిం నాయకుల క్లిష్ట పరిస్థితిని ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు.
 
కొద్ది వారాల క్రితం ఒక మీడియా సదస్సులో మైనారిటీ వర్గాల వ్యవహారాల మంత్రి నఖ్విని కలుసుకున్నాను. బీఫ్‌ (గొడ్డు మాంసం) పై నిషేధం గురించి, మైనారిటీ వర్గాల వారిపై ఆ చర్య చూపే ప్రభావం గురించి ప్రశ్నించాను. సాధారణంగా స్నేహమర్యాదలతో వ్యవహరించే నఖ్వి ఒక్కసారిగా నిగ్రహాన్ని కోల్పోయారు. ‘బీఫ్‌ తినకుండా ఉండలేనివారు పాకిస్థాన్‌కు వెళ్ళి పోవాలి. గోవు మనకు పవిత్రమైనది’ అని ఆయన అన్నారు. నవ ముస్లిం రాజకీయాలలో కొత్త ముఖమైన అసదుద్దీన్‌ ఒవైసీ మా యీ చర్చలో పాల్గొంటూ బీజేపీ పాలనలో ఉన్న గోవాలోని కేథలిక్‌ క్రైస్తవులను పాకిస్థాన్‌ వెళ్ళిపొమ్మంటున్నారా అని నఖ్విని ప్రశ్నించారు. ఈశాన్య భారత రాష్ట్రాల ప్రజలకు కూడా బీఫ్‌ బాగా ఇష్టమైన ఆహారమని నేను గౌరవనీయ మంత్రికి తెలియజేశాను. దీంతో నఖ్వి రక్షణలో పడిపోయారు. ఒక ముస్లిం నాయకుడిని అనుమానాస్పదంగా చూసే ధోరణి ఉన్న తమ పార్టీ కార్యకర్తలకు, తన ‘విధేయత’ను నిరూపించుకొనే ప్రయత్నంలోనే నఖ్వి బహుశా అలాంటి వ్యాఖ్య చేసివుంటారు. ఒక హిందూత్వ పార్టీలో ఒక ముస్లింగా ఉండడమంటే ఆమోదరహితుడైన ఒంటరివాడుగా ఉండడమేనని చెప్పక తప్పదు. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టిక్కెట్‌ పై కేవలం ముగ్గురు ముస్లింలు మాత్రమే ఎన్నికయ్యారు. వారు: నఖ్వి, షానవాజ్‌ హుస్సేన్‌, అరిఫ్‌ బేగ్‌ (సికిందర్‌ భఖ్త్‌ 1977లో జనతా పార్టీ టిక్కెట్‌పై లోక్‌ సభకు ఎన్నికయ్యారు). నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న పదమూడు సంవత్సరాలలో విధాన సభకు పోటీచేయడానికి ఒక్క ముస్లింకూ పార్టీ టిక్కెట్‌ నివ్వ లేదు.
 
ఇది కేవలం బీజేపీ సమస్య మాత్రమేకాదు. సమకాలీన రాజకీయాలలో ముస్లిం నాయకుడుగా ఉండడం అంత తేలికైన విషయం కాదు. 16వ లోక్‌సభలో కేవలం 22 మంది ముస్లింలు మాత్రమే ఉన్నారు. మన పార్లమెంటరీ చరిత్రలో లోక్‌సభలో ఇంతతక్కువమంది ముస్లిం ఎంపీలు ఉండడం ఇదే మొదటిసారి. ఈ రాజకీయ శూన్యంలోకి, ముస్లింల అస్తిత్వ రాజకీయాల ప్రతినిధిగా, అసదుద్దీన్‌ ఒవైసీ అడుగుపెట్టారు. ఒవైసీ పార్టీ ఎమ్‌ఐఎమ్‌ మూలాలు నిజాం అనంతర హైదరాబాద్‌ పాత బస్తీ రాజకీయాలలో ఉన్నాయి. ఇప్పుడు తమ పార్టీని ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలకు కూడా విస్తరింపచేయడానికి ఒవైసీ పూనుకున్నారు. ముస్లింలో పెరిగిపోతున్న భయాందోళనలు ఎమ్‌ఐఎమ్‌ విస్తరణకు అనుకూలంగా ఉన్నాయి. లండన్‌లో బారిస్టర్‌ గా శిక్షణ పొందిన అసదుద్దీన్‌ ఒవైసీ మంచి వక్త. మత విశ్వాసాలతో ముడివడివున్న ముస్లిం అస్తిత్వ రాజకీయాలకు ప్రతినిధిగా ఒవైసీ తన మతస్థుల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు.

ఒవైసీ ఉత్థానం ఒక విధంగా, ముస్లింల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకొనే జాతీయ పార్టీల (లౌకిక విలువల పరిరక్షణలో) వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. ఈ పార్టీల వైఖరి ఎంత సేపూ ఓటు బ్యాంకు రాజకీయాల చుట్టూ పరిభ్రమిస్తోందిగాని మైనారిటీ వర్గాలకు నిజమైన లబ్ధిని సమకూర్చడం లేదు. ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో సచార్‌ కమిటీ నివేదిక తేటతెల్లం చేసింది. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఇటీవల ఒక సదస్సు కు హాజరైన సందర్భంగా ఒక విద్యార్థి నాతో ఇలా అన్నారు: ‘ముజఫర్‌నగర్‌‌లో మమ్ములను రక్షించడంలో విఫలమైన సమాజ్‌ వాది పార్టీకి మేము ఎందుకు ఓటు వేయాలి? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో తాము అధికారంలో ఉన్నప్పుడు అమాయకులు, నిరపరాధులైన ముస్లిం యువకులపై ఉగ్రవాదులుగా అభియోగాలు మోపడానికి అనుమతించిన కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం మేము ఎందుకు ఓటు వేయాలి?’ చాలా బలమైన వ్యాఖ్యలు. ఒవైసీలాంటి రాజకీయవేత్తలకు మద్దతు ఎందుకు పెరుగుతుందో ఆ విద్యార్థి వ్యాఖ్యలు చెప్పకనే చెప్పుతున్నాయి. 
 
ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ముస్లింల అన్వేషణలో మౌలిక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ, ప్రధానమంత్రి ఇచ్చిన ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ హామీకి ఉన్న స్థానమేమిటి? ‘మిస్స్‌డ్‌ కాల్‌’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 30 లక్షల మంది ముస్లింలు తమ పార్టీలో చేరినట్టు బీజేపీ ఇటీవల వెల్లడించింది. ప్రధాని మోదీ ఇటీవల తన అధికారిక నివాసంలో ముప్పై మంది ముస్లిం మతాచార్యుల, నాయకుల ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు. ‘ఒక చేతిలో ఖురాన్‌, మరో చేతిలో కంప్యూటర్‌’ ఉన్న ముస్లింలను చూడాలన్న తన ఆకాంక్షను మోదీ పునరుద్ఘాటించారు. తన ప్రభుత్వానికి, ముస్లింలకు మధ్య పెరుగుతున్న అగాధాలపై వారధులు నిర్మించడానికి ఇటువంటి సమావేశాలు, శుభ కామనలే సరిపోతాయా?
 
మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా 2002 గుజరాత్‌ మారణకాండ ఇప్పటికీ ముస్లింలను వెంటాడుతూనే ఉన్నది. మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గానివ్వవండి లేదా మరే ఇతర కారణాల వల్ల నైనాకానివ్వండి ఆ మారణకాండను ఆపడంలో విఫలమయిందని ముస్లింలు భావిస్తున్నారు. తన తరపున, తన ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి ప్రధాని మోదీ ఎంపిక చేసుకున్న ముస్లింల నాయకులకు స్వీయ మతస్థులలో విశ్వసనీయత లేదు . తమ స్వప్రయోజనాలు మాత్రమే చూసుకునే వారుగా ఆ నాయకులను ముస్లింలు భావిస్తున్నారు. ఇక సంఘ్‌ పరివార్‌ ఇప్పటికీ మిశ్రమ సందేశాలను పంపుతోంది. అవి ముస్లింలలో సంప్రదాయక అనుమానాలను మరింతగా దృఢపరుస్తున్నాయి. రాజ్యాంగమే తన ధర్మమని ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. అయితే తమ పార్టీ ఎంపీలు, సంఘ్‌ పరివార్‌ నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలను నివారించలేకపోతున్నారు. మరి ఇక్కడే నఖ్వి లాంటి నాయకులు సూటిగా, స్పష్టంగా, దృఢ స్వరంతో మాట్లాడవలసిన అవసరమున్నది. బీఫ్‌ తినకుండా ఉండలేమనే వారు పాకిస్థాన్‌ వెళ్ళి పోవడం మంచిదని బెదిరించడానికి బదులు అసహ్యకరమైన లవ్‌ జిహాద్‌ భావనకు వ్యతిరేకంగా మన గౌరవనీయ మంత్రి ఎందుకు మాట్లాడరు? హిందూ మతస్థురాలిని వివాహం చేసుకున్న నఖ్వి లవ్‌ జిహాద్‌ను ప్రచారం చేసే వారు భారత్‌ను విడిచివెళ్ళిపోవాలని ఎందుకు గట్టిగా ఆదేశించరు?
 
తాజా కలం: బీజేపీ పాలనలో ఉన్న హర్యానాలోని వల్లభ్‌గఢ్‌లో గత వారం మతతత్వ అల్లర్లు చోటుచేసుకున్నాయి. చాలా ముస్లిం కుటుంబాలు సర్వం కోల్పోయాయి. న్యూఢిల్లీకి వల్లభ్‌గఢ్‌ కేవలం నలభై కిలో మీటర్ల దూరంలో ఉన్నది. స్వయంగా వెళ్ళి ఆ బాధితులను ఎందుకు పరామర్శించకూడదు? శుభకామనల కంటే ఇటువంటి సానుభూతి చర్యలు ఎక్కువ ప్రభావాన్ని చూపవూ?

No comments:

Post a Comment