Wednesday 17 June 2015

ఉండవల్లిలో సీఎం రెస్ట్‌హౌస్‌

ఉండవల్లిలో సీఎం రెస్ట్‌హౌస్‌

మంగళగిరి: నవ్యాంధ్ర రాజధానికి అప్పుడే కొత్తకళ వచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లి పంచాయతీ పరిధిలో తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సంసిద్ధమయ్యారు. ఈ నెల ఆరో తేదీన మందడం రెవెన్యూ పరిధిలో భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక మీదట వారంలో మూడు రోజులపాటు ఇక్కడి నుంచే పాలనను కొనసాగిస్తామని హామీనిచ్చారు. విజయవాడ నీటి పారుదల శాఖ కార్యాలయంలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రికి తాత్కాలిక నివాసాన్ని కూడా ఏర్పాటు చేయాలని అధికార వర్గాలు నిర్ణయించాయి. ఇందుకోసం అధికారులు రాజధాని ప్రాంతానికి ఈశాన్యంగా ఉన్న ఉండవల్లి పంచాయతీ పరిధిలో కృష్ణాతీ రం వెంట ఉన్న లింగమనేని ఎస్టేట్స్‌ అతిథిగృహాన్ని ఎంపిక చేశారు. ఈ భవనం సీతానగరం ప్రకాశం బ్యారేజీ నుంచి ఎగువ కరకట్ట రోడ్డులో 2.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి సీఎం క్యాంపు కార్యాలయమైన విజయవాడ నీటి పారుదల శాఖ కార్యాలయం కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రయాణ సమయం పది నిమిషాల లోపు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
 
గోప్యంగా గృహప్రవేశం..
ఈ అతిథిగృహాన్ని ముఖ్యమంత్రి తాత్కాలిక నివాసంగా ఎంపిక చేయడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి తాత్కాలిక నివాసం రాకతో రోజుల వ్యవధిలోనే అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం స్థానికుల్లో పెరిగింది. ఈ నెల 12వ తేదీనే ఈ తాత్కాలిక నివాస గృహానికి రహస్యంగా గృహప్రవేశం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. హైదరాబాద్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి సాధ్యమైనంత ఎక్కువగా నవ్యాంధ్రలోనే గడపాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే గృహప్రవేశాన్ని హడావిడిగాను, కొంత రహస్యంగాను జరిపించారని అంటున్నారు.
అధికారుల పరిశీలన..
లింగమనేని అతిథిగృహాన్ని మంగళవారం ముఖ్యమంత్రి ముఖ్య భద్రతాధికారి నగేష్‌బాబు, జిల్లా కలెక్టరు కాంతిలాల్‌ దండే, విజయవాడ నగర కమిషనరు వీరపాండ్యన్‌, గుంటూరు ఆర్డీవో భాస్కర్‌నాయుడు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీతానగరం నుంచి సీఎం తాత్కాలిక నివాసానికి దారితీసే మార్గమైన కృష్ణా కరకట్ట రోడ్డు మార్గాన్ని యుద్ధప్రాతిపదికన విస్తరించేందుకు అవసరమైన చర్యలను కూడా చేపడుతున్నట్టు తెలిసింది. భవనానికి చేరుకునే మార్గాల వెంట తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఎలకి్ట్రకల్‌, టెలిఫోన్‌ ఇతరత్రా సౌకర్యాల కల్పనపై ఆయా శాఖల ఉన్నతాధికారులు మంగళవారం గోప్యంగా విచ్చేసి క్షేత్రస్థాయిలో కసరత్తు చేశారు.

No comments:

Post a Comment