Tuesday 2 June 2015

నిద్రపట్టట్లేదు: బాబు.. రేవంత్ ఉదంతంపై ఆవేదన?

నిద్రపట్టట్లేదు: బాబు.. రేవంత్ ఉదంతంపై ఆవేదన?

విజయవాడ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):రేవంత్‌ రెడ్డి ఉదంతంపై ఏపీ సీఎం చంద్రబాబు కలత చెందుతున్నట్లు తెలిసింది. మంగళవారం విజయవాడలో నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, అడిషనల్‌ డీజీపీ గౌతం సవాంగ్‌, పలు శాఖల ఉన్నతాధికారులతోపాటు, మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌లతో సమావేశమాయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... తాజా ఘటనలతో రెండు రోజులుగా నిద్రపట్టడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. రేవంత్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదాపడిన విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు నవనిర్మాణ దీక్ష సందర్భంగా కూడా చంద్రబాబు తన ప్రసంగంలో రేవంత్‌ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో మరిన్ని అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. సమైక్య ఉద్యమం జరిగిన తీరు, అప్పటి కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి, పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు చర్చకు వచ్చినప్పుడు తలుపులు వేసి, ప్రత్యక్షప్రసారాలు నిలపుదల చేసి బిల్లు ఆమోదించిన తీరుపై చర్చించుకున్నారు. తాను ‘సమన్యాయం’ గురించి అడిగినప్పుడు కొంతమంది నేతలు ఎగతాళి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్ష సభలో చంద్రబాబు ప్రసంగం బాగుందని అధికారులు ప్రశంసించారు.

No comments:

Post a Comment