Thursday 18 June 2015

గంగిరెద్దులా గవర్నర్‌!

గంగిరెద్దులా గవర్నర్‌!
  •  అలాగైతే పదవికి ఎలా న్యాయం చేస్తారు!
  •  మిగిలిన సెక్షన్లకు లేని మార్గదర్శకాలు..సెక్షన్‌ 8కి అవసరమయ్యాయా?
  •  ఫోన్‌ ట్యాపింగ్‌ వంద శాతం వాస్తవం : మంత్రి అచ్చెన్న 
హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ‘విభజన చట్టంలోని సెక్షన్‌ 8 అమలుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వలేదని గవర్నర్‌ కుంటిసాకులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా మరో ప్రభుత్వంపై కుట్రలు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా గంగిరెద్దులా ఉంటే ఎలా? అలా ఉంటే ఆ పదవికి ఎలా న్యాయం చేసినట్లు?’ అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలో కేబినెట్‌ సమావేశం అనంతరం ఆయన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్‌ రెడ్డి, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్‌బాబుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోని 35 సెక్షన్లకు లేని మార్గదర్శకాలు సెక్షన్‌ 8కి అవసరమయ్యాయా? అని ప్రశ్నించారు. మిగతా సెక్షన్లపై ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా స్పందించిన గవర్నర్‌ సెక్షన్‌ 8పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉమ్మడి రాజధానిలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిన విషయం నూటికి నూరుపాళ్లు వాస్తవమన్నారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడటంతో టి సర్కార్‌ హడావిడి చేస్తోందని విమర్శించారు. టెలికం ఏజెన్సీలపై ఒత్తిడి తెచ్చి ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ట్యాపింగ్‌కు రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలు కూడా తమ వద్ద ఉన్నాయని అచ్చెన్న వివరించారు. ఏపీ ప్రభుత్వ జీతాలతో ఉమ్మడి రాజధానిలో బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులతో తమనే ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఎక్కడ అవసరమైతే అక్కడ పోలీసుస్టేషన్లూ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ నోటీసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఏసీబీ డీజీ ఖాన్‌ రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయకముందు ఎన్నికల కమిషనర్‌ అనుమతి తీసుకున్నామని అబద్ధాలు చెప్పారన్నారు. ఎక్కడెక్కడో క్లిప్పింగులు తెచ్చి చంద్రబాబు వాయిస్‌ను క్రియేట్‌ చేశారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఐదేళ్లు మాత్రమే ఉంటుందని హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి పదేళ్లు ఉండే అధికారముందన్నారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిలో టీఆర్‌ఎస్‌ నేతలు, టీవీ చానెల్స్‌కు చెందిన వారున్నారన్నారు. గవర్నర్‌ ఫోన్‌ కూడా ట్యాప్‌ చేశారన్న అనుమానాలున్నాయన్నారు. 

No comments:

Post a Comment