Wednesday 3 June 2015

బాబుపై తెలంగాణలో నిఘా !.. ఏపీ పోలీస్ ఆరా

బాబుపై తెలంగాణలో నిఘా !.. ఏపీ పోలీస్ ఆరా

  • ఫోన్‌కాల్స్‌ డేటాతో సంభాషణలపై ఆరా
  • సన్నిహితులు, అధికారులు, మంత్రులపైనా కన్ను
హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణలో ‘నిఘా’ అమలవుతోందా? రోజువారీ కార్యకలాపాల్లో ఆయనకు సహకరించే, ఆయనతో సన్నిహితంగా మెలిగే వారి ఫోన్లపై ‘చెవి’ వేశారా? ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు, అధికార వర్గాలు బలంగా ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్‌పై నిఘా వేస్తే వివాదాస్పదమయ్యే అవకాశం ఉండటంతో... చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే వారి ఫోన్లపై కన్నేసినట్లు అనుమానిస్తున్నారు. కొన్ని ఫోన్లను ట్యాప్‌ చేశారని కూడా భావిస్తున్నారు. చంద్రబాబుతో ఎవరు మాట్లాడుతున్నారు? ఆయనతో మాట్లాడిన వెంటనే వారు ఏ నెంబర్‌కు కాల్‌ చేసి మాట్లాడారు? ఆ నెంబర్‌ ఎవరిది? వారు మాట్లాడుకున్న విషయం ఏమై ఉండొచ్చు? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో... ఈ ఫోన్‌కాల్స్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉంది? ఏం జరిగి ఉండొచ్చు? తదుపరి అడుగు ఎలా వేయాలి? ఇలా అనేక కోణాల్లో విశ్లేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు ప్రైవేటు సెల్‌ ఆపరేటర్ల సహకారం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాల్‌డేటాలోని నెంబర్లు, కాల్స్‌ వెళ్లిన సమయం ఆధారంగా... ‘లింకులు’ వెతుకుతున్నట్లు చెబుతున్నారు.
 
అనుమానాలకు కారణం?
ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖలో పని చేస్తున్న ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఇటీవల మరో అధికారికి ఫోన్‌ చేశారు. ఆ సమయంలో తెలంగాణ పోలీస్‌కు సంబంధించిన కాలర్‌ టోన్‌ వినిపించింది. ఫోన్‌ ఎత్తింది మాత్రం ఏపీ కేడర్‌ అధికారే. దీంతో ఆ సీనియర్‌ ఐపీఎస్‌ ఆశ్చర్యపోయారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు ఫోన్‌ చేసి దీనిపై ఆరా తీశారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇలాంటిదేదో పొరపాటున జరిగి ఉండొచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే, ఇది నిజం కాదని ఏపీ అధికారులు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా ఆరా తీయడంతో... చంద్రబాబు సన్నిహితులతోపాటు ఏపీకి చెందిన సీనియర్‌ అధికారులు, కొందరు ముఖ్యమైన మంత్రుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. తమ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తులపైనే నిఘా వేశారనేవిషయం ఏపీ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనిని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ‘నిఘా నిజం’ అని ఏపీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు ధ్రువీకరించుకున్నాయి. అయితే... పక్కా ఆధారాలు లేకుండానే ఈ విషయాన్ని బయటికి చెప్పడం మంచిదికాదని భావిస్తున్నాయి. అధికారిక అనుమతులు, నిర్దిష్ట ప్రక్రియకు లోబడి కాకుండా ఇతరుల ఫోన్లపై నిఘా వేయడం, వారి కాల్‌లిస్టులు సంపాదించడం నేరం. ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలపై కన్నేయడం మరింత సీరియస్‌ అంశం. సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు తప్పుడు మార్గాల్లో ఆయన కాల్‌లిస్ట్‌ సంపాదించిన వైనం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత టెలిఫోన్‌ ఆపరేటర్లు కూడా జాగ్రత్తపడ్డారు. ఎవరు పడితే వారికి కాల్‌డేటా ఇవ్వకుండా, అధికారికమైన అభ్యర్థనలకు మాత్రమే స్పందిస్తున్నారు. అయితే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సెల్‌ఫోన్‌ ఆపరేటర్ల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
 
ప్రత్యేకమైన పరిస్థితుల్లో, కొందరి ఒత్తిళ్లకు తలొగ్గి వారికి సహకరించక తప్పని పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. మరోవైపు... కేసు దర్యాప్తుకోసం ఫలానా నెంబర్ల కాల్‌డేటా కావాలనే అధికారిక అభ్యర్థనల్లో, నిజమైన అనుమానితుల నెంబర్లతోపాటు, తమకు ‘అవసరమైన’ వారి నెంబర్లనూ చేర్చుతున్నట్లు తెలుస్తోంది. ఇలా కాల్‌ లిస్టును యథేచ్ఛగా తీసుకుంటున్నారని ఏపీ పోలీసులు పక్కాగా ధ్రువీకరించుకున్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది; ఎవరెవరి ఫోన్లపై నిఘా వేశారు అనే అంశాలను ఆధార సహితంగా రాబట్టాలని భావిస్తున్నారు. ఈ అంశాన్ని తమ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకొచ్చి, ఆయన సూచనల మేరకు నడుచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది సున్నితమైన వ్యవహారం కావడంతో పోలీసు ఉన్నతాధికారుల అంతర్గత సంభాషణల్లో మాత్రమే దీనిపై చర్చ జరుగుతోంది. అవసరమైతే దీనిపై కేసు పెట్టి, చట్టపరంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు. బుధవారం కూడా దీనిపై ఏపీ ఉన్నతస్థాయి అధికారుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం.

No comments:

Post a Comment