Friday 5 June 2015

బాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారు: మత్తయ్య

బాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారు: మత్తయ్య

  • రేవంత్‌ నన్ను బాబు వద్దకు తీసుకెళ్లినట్లు..
  • ఆయనే నన్ను స్టీఫెన్‌ వద్దకు పంపినట్లు..
  • చెప్పింది రాసివ్వాలని హెచ్చరికలు
  • అధికారులు, మీడియా పేరిట బెదిరింపులు
  • నాకు, కుటుంబ సభ్యులకు ప్రాణ హాని 
  • 4వ నిందితుడు మత్తయ్య ఆందోళన
విజయవాడ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి):ఓటుకు నోటు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పాలంటూ తనను బెదిరిస్తున్నారని, ప్రలోభ పెడుతున్నారని ఈ కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. తనకు, తన కుటుంబానికీ ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను రేవంత్‌ రెడ్డి కానీ, చంద్రబాబు కానీ స్టీఫెన్సన్‌ వద్దకు పంపలేదని స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డి తనను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారనడం నిజం కాదన్నారు. ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శిగా, ఒక సామాజిక బాధ్యతగా తానే స్టీఫెన్సన్‌ కలిసి ఆయన అభిప్రాయం తెలుసుకున్నానని చెప్పారు. గురువారం విజయవాడలో ఆయన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘ఆలిండియా దళిత క్రైస్తవ సమాఖ్య కార్యదర్శిగా నేను నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ను కలిశాను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుసుకున్నాను. ఆయన సానుకూలతనుబట్టి తెలుగుదేశానికి ఓటు వేసే అవకాశముందని ఆ పార్టీ నేతలకు తెలిపాను. తెలంగాణ ప్రభుత్వం దీనిని రాజకీయ కోణంలో చూస్తూ, ఇందులో చంద్రబాబు పాత్ర ఉందనేలా ఆయనను ఇరికించేలా వాంగ్మూలం ఇవ్వాలని నాపై కొందరు ఒత్తిడి తెస్తున్నారు. తాము చెప్పినట్లు వినకుంటే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించైనా చెప్పిస్తామని హెచ్చరిస్తున్నారు’’ అని మత్తయ్య ఆరోపించారు. తాము చెప్పినట్లు వింటామనే ఉద్దేశంతోనే అరెస్టు చేయకుండా, స్వేచ్ఛగా వదిలిపెట్టామని చెప్పారని వివరించారు. రేవంత్‌ స్వయంగా తనను చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లినట్లు, ప్రత్యేకంగా చంద్రబాబే ఈ విషయం మాట్లాడాలని చెప్పారని వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఏసీబీ అధికారులు, మీడియా ప్రతినిధుల పేరిట తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. ‘‘నువ్వు పోలీసులకు లొంగిపోవద్దు. ముందు మమ్మల్ని ప్రత్యేకంగా కలువు. నీకు రూ. 10 నుంచి 15 లక్షలు ఇవ్వడంతోపాటు కేసు నుంచి నిన్ను తప్పిస్తాం. పూర్తి భద్రత కల్పిస్తాం. మంత్రులతో డైరక్ట్‌గా మాట్లాడే ఏర్పాటు కల్పిస్తాం. మేము చెప్పినట్లుగా చెబితే చాలు’’... అని ప్రలోభ పెడుతున్నారని చెప్పారు. ‘‘నాపై ఉన్న కేసు గురించి మాట్లాడేందుకు ఏసీబీ డీఎస్పీ అశోక్‌ కుమార్‌కు ఫోన్‌ చేశాను. బుధవారం డీఎస్పీ వద్దకు వెళ్దామనుకున్నా. కానీ, మంగళవారం రాత్రే కొంత మంది ఫోన్‌ చేశారు. ‘నువ్వు రాకుంటే కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసి మాకు కావాల్సింది రాయించుకుంటాం. ఇది ప్రభుత్వానికి, కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు ప్రిస్టేజ్‌ ఇష్యూ. చంద్రబాబును ఇరికించాలనంటే డీల్‌ కుదిర్చిన మొదటి వ్యక్తిగా నీ వాంగ్మూలమే కీలకం’ అంటూ ఐదారు నిముషాలకోసారి ఫోన్లు చేసి బెదిరించారు’’ అని మత్తయ్య వివరించారు.

No comments:

Post a Comment