Friday 5 June 2015

చిన్న సినిమాను బతికించే మినీ డిజిటల్‌ థియేటర్లు: చదలవాడ

చిన్న సినిమాను బతికించే మినీ డిజిటల్‌ థియేటర్లు: చదలవాడ

చిన్న సినిమాను బతికించడానికి ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకున్నట్లు తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. ప్రజల వద్దకే పాలనలా ప్రేక్షకుల దగ్గరికే సినిమా ప్రదర్శన అనే నినాదంతో, తక్కువ కెపాసిటీ కలిగిన థియేటర్ల నిర్మాణం కోసం ఇచ్చిన పిలుపు అద్భుతమైన స్పందన వచ్చిందనీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదు వేల మినీ డిజిటల్‌ థియేటర్లను నిర్మించనున్నామని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం నిర్మాతలమండలి హాలులో జరిగిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారనీ, అరగంట వ్యవధిలోనే 999 దరఖాస్తులు తీసుకున్నారనీ శ్రీనివాసరావు చెప్పారు.
 
ఈ థియేటర్ల గురించి ఆయన మాట్లాడుతూ ‘‘వెయ్యి నుంచి నాలుగు వేల చదరపు అడుగుల వరకూ ఉండే స్థలంలో 50 నుంచి 350 వరకూ సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్లు ఉంటే బాగుంటుంది. డిజిటల్‌ మినీ థియేటర్ల వల్ల నిర్మాతకు, థియేటర్‌ ఓనర్‌కు లాభాలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న విధానంలో 30 శాతం థియేటర్‌ నిండినా థియేటర్‌ అద్దె నిర్మాతే కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మినీ డిజిటల్‌ థియేటర్లలో అదే 30 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా నిర్మాతకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేక్షకులకు కూడా తక్కువ వ్యయంతో కుటుంబసమేతంగా సినిమా చూసే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌ టిక్కెట్‌ విధానం ఉంటుంది కనుక ఎన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయన్నది తెలిసిపోతుంది. ఒక్కో థియేటర్‌ దగ్గర ముగ్గురికి ఉపాధి కల్పించినా కూడా దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. అలాగే ఐదు వేల మంది థియేటర్‌ ఓనర్లుగా మారతారు. దీని వల్ల మంచి సినిమాల నిర్మాణం పెరుగుతుంది. పరిశ్రమనే నమ్ముకున్న ఎంతో మంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, కార్మికులకు చేతినిండా పని దొరుకుతుంది. ఇన్ని లాభాలు ఉండటం వల్లే తెలుగు చలనచిత్ర పరిరక్షణసమితి ద్వారా కో ఆపరేటివ్‌ పద్దతిలో నడపడానికి నిర్ణయించాం’ అని తెలిపారు.

No comments:

Post a Comment