Tuesday 16 June 2015

సెక్షన్‌ 8 చెల్లదు.. అది కంటి తుడుపు సెక్షన్

సెక్షన్‌ 8 చెల్లదు.. అది కంటి తుడుపు సెక్షన్
కేంద్రం మొండిగా ముందుకెళ్తే ఎదుర్కొంటాం: కేసీఆర్

  • గవర్నర్‌కు తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్‌ 
  • ఆ సెక్షన్‌ రాజ్యాంగ వ్యతిరేకం.. కోర్టుల్లో నిలబడదు
  • విభజన సమయంలో అదో కంటితుడుపు చర్య
  •  స్టింగ్‌ దోషులను తప్పించడానికే తెరపైకి సెక్షన్‌
  •  దాని అమలుకు అంగీకరించే ప్రసక్తే లేదు
  •  తెలంగాణ సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుంది
  •  హైదరాబాద్‌పై సంపూర్ణ అధికారం మాదే: సీఎం
  •  రాజ్‌భవన్‌లో నరసింహన్‌తో గంటన్నర భేటీ
 హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 8ని చెల్లని కాసుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివర్ణించారు. రాష్ట్ర విభజన సమయంలో కంటితుడుపు చర్యగా తీసుకొచ్చిన ఈ సెక్షన్‌ రాజ్యాంగ వ్యతిరేకమని, దానికి మార్గదర్శకాలు రూపొందించి అమల్లోకి తేవడం అంటే రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణ అధికారాలు గవర్నర్‌కే ఉండేలా సెక్షన్‌ 8ని కచ్చితంగా అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సెక్షన్‌ 8 అమల్లో గవర్నర్‌కు సహకరించేందుకు నియమితులైన సలహాదారులు ఏపీవీఎన్‌ శర్మ, ఏకే మహంతిలతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు కూడా. మార్గదర్శకాలతో పని లేకుండానే సెక్షన్‌ 8ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుతో భేటీ వివరాలను సలహాదారులు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సెక్షన్‌ 8 అమలు విషయంలో చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే సమంజసంగా ఉంటుందని సలహాదారులిద్దరూ గవర్నర్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, సెక్షన్‌ 8 అమలుపై తాను నిర్ణయం తీసుకోవడానికి బదులుగా.. దానిపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ భావించారు. అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సోమవారం రాజ్‌భవన్‌కు పిలిపించి ఈ అంశంపై చర్చించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్‌ గవర్నర్‌తో దాదాపు గంటన్నరపాటు భేటీ అయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, సెక్షన్‌ 8 అమలుకు ఏపీ సర్కారు పట్టుపడుతుండటం, ఈ విషయంలో కేంద్ర సర్కారు మనోగతం, స్టింగ్‌ ఆపరేషన్‌పై కేంద్రం, ఏపీ ప్రభుత్వాల వైఖరి వంటి అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా, ఒక రాష్ట్ర రాజధానిలో మరో రాష్ట్రానికి చెందిన పోలీసుల ప్రమేయం ఉండడం, ఒక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా, శాంతి భద్రతలను గవర్నర్‌ చేతిలో పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. అప్పట్లో బిల్లు పాస్‌ కావటం కోసం.. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు భరోసా కల్పించటం కోసం కంటితుడుపు చర్యగా ఆ సెక్షన్‌ పెట్టారని, దీనిపై ఇప్పటి వరకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. ఒకవేళ కేంద్రం ఈ సెక్షన్‌ను అమలు చేయాలనుకుంటే, తెలంగాణ సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుందని, కోర్టులో కూడా నిలబడదని గవర్నర్‌కు ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. రాజ్యాంగ విరుద్ధమైన సెక్షన్‌ 8ని అమల్లోకి తేవటానికి అంగీకరించే సమస్యే లేదని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది.
 
కేంద్రం మొండిగా ముందుకెళితే ఎదుర్కొంటాం
గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ సందర్భంగా, స్టింగ్‌ ఆపరేషన్‌ కేసు పురోగతిని సీఎం కేసీఆర్‌ ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల బృందం తనను కలిసినప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన ఎవరి ఫోన్ల ట్యాపింగ్‌నకు పాల్పడలేదని తాను వారికి స్పష్టంగా చెప్పానని కేసీఆర్‌తో గవర్నర్‌ అన్నట్లు తెలిసింది. స్టింగ్‌ ఆపరేషన్‌ కేసు విషయంలో తాము అంతా చట్టప్రకారమే ముందుకు సాగుతున్నామని, దీని నుంచి దోషులను తప్పించడానికే సెక్షన్‌ 8ని తెరపైకి తెస్తున్నారని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయినా, ముడుపుల కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని, దీనిని ఆసరాగా చేసుకొని సెక్షన్‌ 8 అమలు కోసం ఏపీ పట్టుబడితే తాము గట్టిగా ప్రతిఘటిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంలో కేంద్రం ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మనోభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా ముందుకు వెళ్తే, ధైర్యంగా ఎదుర్కొంటామని గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తన భద్రత కోసం తెలంగాణ పోలీసులను కాదని, ఏపీ పోలీసులను నియమించుకోవడంపై కేసీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

No comments:

Post a Comment