Wednesday 24 June 2015

అది చెల్లని సెక్షన్: టి-అధికారుల వాదన

అది చెల్లని సెక్షన్: టి-అధికారుల వాదన
అటార్నీ జనరల్‌ చెప్పాక తిరుగే లేదు: ఏపీ అధికారులు

  • విభజన చట్టంలోనే మెలిక ఉంది..
  • కేంద్ర కేబినెట్‌ ఆమోదంతోనే గవర్నర్‌కు అధికారాలు
  • అటార్నీ జనరల్‌ చెప్పగానే సరిపోదు
  •  తెలంగాణ అధికారుల వాదన
  • ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ అక్కర్లేదు
  • సెక్షన్‌-8 అమలు తథ్యం.. ఏపీ సర్కారు ధీమా 
 
హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘సెక్షన్‌-8 అమలుకు అంగీకరించేది లేదు. జాతీయ స్థాయిలో పోరాడేందుకు కూడా సిద్ధం. న్యాయ పోరాటం కూడా చేస్తాం’ అని తెలంగాణ సర్కారు ప్రకటిస్తున్నప్పటికీ... అంతర్గతంగా మాత్రం సెక్షన్‌ 8 అమలు అసాధ్యమని ధీమాగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నందంతా ఉత్తుత్తి హడావుడేనని చెబుతోంది. అటార్నీ జనరల్‌ తన అభిప్రాయం చెప్పినంత మాత్రాన, గవర్నర్‌కు దానంతట అవే అధికారాలు రావని టీ-సర్కారు పేర్కొంటోంది. ‘‘గవర్నర్‌కు అటార్నీ జనరల్‌ తన అభిప్రాయం చెప్పడం పరిపాలనా ప్ర క్రియలో భాగంగా జరిగిన తతంగమే! సెక్షన్‌-8పై పడిన తొలి అడుగు మాత్రమే. అయితే, కేవలం అటార్నీ జనరల్‌ లేఖ ఆధారంగా గవర్నర్‌కు అధికారాలు వచ్చేయవు’’ అని తెలంగాణకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ‘సెక్షన్‌-8కు సంబంధించి రాష్ట్ర విభజన చట్టంలోనే లోపం ఉంది. అదే మాకు రక్షణ కల్పిస్తుంది’ అని టీ-అధికారులు చెబుతున్నారు. ఏ చట్టంలోనైనా ఆయా అంశాలకు సంబంధించి సంక్షిప్తమైన ప్రస్తావన మాత్రమే ఉంటుంది. వీటికి వివరణ ఇస్తూ, అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించే అధికారాన్ని కల్పిస్తూ ‘పవర్‌ టు మేక్‌ రూల్స్‌’ అనే క్లాజ్‌ను చట్టంలో తప్పనిసరిగా పెట్టాలి. కానీ, విభజన చట్టంలో ఈ విషయం లేదు. ‘‘సెక్షన్‌ 8పైనా కేంద్రం మార్గదర్శక సూత్రాలు జారీ చేయాలి. అదికూడా... కేంద్ర కేబినెట్‌ ఆమోదంతోనే జరగాలి. దీని మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్‌ను, గవర్నర్‌ రీ-నోటీఫై చేయాల్సి ఉంది. అంతేతప్ప, గవర్నర్‌ తనంతట తాను నోటిఫికేషన్‌ ఇవ్వలేరు’’ అని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. పైగా... అటార్నీ జనరల్‌ సూచనలను గవర్నర్‌ పట్టించుకోవాల్సిన అవసరంలేదని చెబుతున్నారు.‘‘పరిపాలనాపరమైన చర్యలకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు గవర్నర్‌ నడుచుకోవాల్సి ఉంటుంది. అంతేతప్ప, అటార్నీ జనరల్‌ చెప్పగానే గవర్నర్‌కు అధికారాలు వచ్చేయవు’’ అని పేర్కొంటున్నారు. పైగా, ఉమ్మడి గవర్నర్‌కు ‘ప్రత్యేకమైన అధికారాలు ఉండవు’ అని కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపిందని చెబుతున్నారు. ‘‘గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు మాత్రమే ఉంటాయి. విశేషమైన (ఎక్స్‌క్లూజివ్‌) బాధ్యతలు ఉండవు... అని హోంశాఖ తెలిపింది. నిజానికి రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా రెండు రాష్ట్రాల అధికారులను నరసింహన్‌ పిలిపించుకోవచ్చు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఉన్న అధికారాలే నరసింహన్‌కూ ఉన్నాయి’’ అని తెలంగాణ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ కూడా సెక్షన్‌-8పై రాష్ట్రానికి సంబంధించిన రూల్స్‌ను సవరించుకోవాలని తెలంగాణ సర్కారును కోరింది. ఇందుకు టీ-సర్కారు ససేమిరా అంది. ‘‘ఒక రాష్ట్ర పరిధిలో మరో రాష్ట్ర పోలీసులకు అధికార పరిధి ఉండదు. రూల్స్‌ ఫ్రేమ్‌ చేయాలని విభజన చట్టంలో లేదు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ రాష్ట్ర కేబినెట్‌ సిఫారసుల మేరకే చర్యలు తీసుకోవాలి’’ అని కేంద్రానికి లేఖ పంపింది. దీంతో, కేంద్రం కూడా ఈ విషయాన్ని అంతటితో వదిలేసింది. వీటన్నింటి నేపథ్యంలో... ప్రస్తుతం సెక్షన్‌ 8పై జరుగుతున్నది తాత్కాలిక రగడేనని, అది అమలులోకి వచ్చే అవకాశమే లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ... ఈ విషయంలో అప్రమత్తంగానే ఉన్నారు.
 
విభజన చట్టమే ఫైనల్‌!
‘‘సెక్షన్‌ 8కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇందులో శషభిషలేవీ లేవు. దీనిని అమలు చేసి తీరాల్సిందే’’ అని ఆంధ్రప్రదేశ్‌ సర్కారు గట్టిగా చెబుతోంది. ఈ విషయంలో తెలంగాణ అధికారులు చేస్తున్న వాదనలను తిప్పి కొడుతున్నారు. ‘‘చట్టంలో ఉన్న ప్రతి అంశానికీ ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ జారీ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ఉన్న అధికారాలపై సెక్షన్‌-8లో కావాల్సినంత స్పష్టత ఉంది. దానిని గవర్నర్‌ నేరుగా అమలు చేయవచ్చు’’ అని పేర్కొంటున్నారు. ఏపీ వర్గాల వాదన ప్రకారం... రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలు, సెక్షన్‌-8 అమలుకు ఏపీ డిమాండ్‌ నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్‌ తనంతట తాను నేరుగా దీనిపై అటార్నీ జనరల్‌ అభిప్రాయం కోరారు. సెక్షన్‌-8ను క్షుణ్నంగా పరిశీలించిన అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ గవర్నర్‌కే తన అభిప్రాయం చెప్పారు. ‘‘గవర్నర్‌ రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి. సెక్షన్‌ 8 అమలుకు సంబంధించి సందేహాలు వస్తే న్యాయ నిపుణుల సలహా తీసుకుని తనంతట తాను చర్యలు తీసుకోవచ్చు. చట్టం ప్రకారం ఈ దేశ అత్యున్నత న్యాయ నిపుణుడు అటార్నీ జనరల్‌. గవర్నర్‌కు ప్రత్యేక, విశేష అధికారాలు ఉంటాయని ఆయనే తేల్చి చెప్పారు. ఇక సెక్షన్‌ -8కు లైన్‌ క్లియర్‌ అయినట్లే’’ అని ఏపీ సర్కారు పేర్కొంటుంది. పైగా... గవర్నర్‌ నేరుగా అటార్నీ జనరల్‌ అభిప్రాయం కోరారని, అటార్నీ జనరల్‌ కూడా గవర్నర్‌కు తన అభిప్రాయం చెప్పారని గుర్తు చేస్తున్నారు. ‘‘వారు ఏమంటున్నారు, వీరు ఏమంటున్నారన్నది ముఖ్యం కాదు. చట్టంలో ఏమున్నదన్నదే కీలకం. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలున్నాయని సెక్షన్‌ 8 చెబుతోంది. గవర్నర్‌ తెలంగాణ కేబినెట్‌ను సంప్రదించినప్పటికీ, ఆయన సొంత విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చునని, దీనిని ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టంగా ఉంది. ఈ సెక్షన్‌ చెల్లదంటే, రాష్ట్ర విభజన చట్టం కూడా చెల్లదు’’ అని గట్టిగా వాదిస్తున్నారు. అటార్నీ జనరల్‌ అభిప్రాయం మేరకు గవర్నర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment