Tuesday 2 June 2015

టీఆర్ఎస్.. వైసీపీ కుమ్మక్కు.. బాబుపై నజర్

టీఆర్ఎస్.. వైసీపీ కుమ్మక్కు.. బాబుపై నజర్
ముడుపుల కేసులో చేర్చడంపై టీఆర్ఎస్ కసరత్తు

  • అన్ని మార్గాల్లో టీఆర్‌ఎస్‌ కసరత్తు
  • వ్యూహాత్మకంగానే తెరపైకి జగన్‌
  • రెండు పార్టీల మధ్య అవగాహన
  • ఈడీనీ రంగంలోకి దించే చాన్స్‌
  • గవర్నర్‌తో ఏసీబీ డీజీ భేటీ
  • అప్రమత్తమైన టీడీపీ వర్గాలు
హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కేసు కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సైతం భాగస్వామిగా చేసేందుకు ఉన్న అవకాశాలపై టీఆర్‌ఎస్‌ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలంటూ టీఆర్‌ఎస్‌ మంత్రులు, పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఒక పరస్పర అవగాహనతో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కూడా రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో గులాబీ దళపతి కేసీఆర్‌కు, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ఉమ్మడి రాజకీయ శత్రువు చంద్రబాబు! నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ను కలిసిన సందర్భంలో రేవంత్‌ తన మాటల్లో అన్యాపదేశంగా చంద్రబాబు ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో ఈ కేసులోకి చంద్రబాబును కూడా లాగడంపై టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. తెర ముందు జగన్‌ను నిలిపి తెర వెనుక టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోందని చెబుతున్నారు. రేవంత్‌ కేసులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని, ఆయనపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరపాలని జగన్‌ మంగళవారం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఒక లేఖ ఇచ్చారు. త్వరలో ఇదే డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కూడా కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ టీఆర్‌ఎస్‌ వ్యూహం
పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసినా, ఏ చర్యకు ఉపక్రమించినా అది రెండు రాషా్ట్రల మధ్య వివాదంగా మారే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌లో కొందరు నాయకులు భావిస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ పార్టీల డిమాండ్‌, ఒత్తిడి మేరకు చర్యలు తీసుకుంటే తమకు ఇబ్బంది ఉండదన్నది వారి ఆలోచన. దీనిపై టీఆర్‌ఎస్‌, వైసీపీ మధ్య ఏకీభావం కుదిరిందని, అందులో భాగంగానే జగన్‌ రంగంలోకి దిగి చంద్రబాబుపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ వినిపిస్తున్నారని అంటున్నారు. వీలైతే వైసీపీకి చెందిన నాయకుల ద్వారా ఈ అంశంపై న్యాయ స్థానంలో పిటిషన్‌ దాఖలు చేయించి, చంద్రబాబుపై చర్యకు కోర్టు నుంచి అనుమతి తీసుకోగలిగితే తమ పని మరింత సులువు అవుతుందని కూడా టీఆర్‌ఎస్‌ నేతలు ఆంతరంగిక సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు... రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, ఈ అంశాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. మనీలాండరింగ్‌ కేసు కూడా నమోదైతే చంద్రబాబును మరింత చిక్కుల్లోకి నెట్టవచ్చునని భావిస్తున్నారు.

టీడీపీలో తర్జన భర్జనలు
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను టీడీపీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. ‘జగన్‌ను ముందు పెట్టి టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో విషయానికి లింకు పెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై మరో రాష్ట్రం కేసు నమోదు చేయాలని చూడటం అంత తేలిక కాదు. ఎక్కడో జరిగిన ఒక సంభాషణలో అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని మూడో వ్యక్తిపై కేసు నమోదు చేయాలనుకొంటే రోజూ వంద కేసులు నమోదు అవుతాయి. వాళ్లేం చేస్తారో చేయనీయండి. చూద్దాం!’’ అని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
కలిసి మెలిసే...
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా... చంద్రబాబుకు సంబంధించి వైసీపీ, టీఆర్‌ఎస్‌ మధ్య దోస్తీ కుదిరింది. రాష్ట్ర విభజన అంశంలో టీఆర్‌ఎస్‌, వైసీపీ భిన్న వైఖరులు తీసుకున్నప్పటికీ... వీలైనంత వరకూ పరస్పర విమర్శలు చేసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జగనే గెలవబోతున్నారంటూ ఎన్నికల ఫలితాల ముందు కేసీఆర్‌ జోస్యం చెప్పారు. ఆ తర్వాత... వైసీపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీనిని కూడా వైసీపీ సీరియస్‌గా తీసుకోలేదు. ఫిరాయింపులపై టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌పై ఎంత విరుచుకుపడుతున్నా, వైసీపీ మాత్రం మౌనం వహిస్తూ వచ్చింది. పైగా... తెలంగాణలో రెండు రోజుల కిందట జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే వైసీపీ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకతే ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
గవర్నర్‌ను కలిసిన ఏసీబీ డీజీ
హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ మంగళవారం భేటీ అయ్యారు. రేవంత్‌ రెడ్డి కేసు గురించి గవర్నర్‌కు ఆయన వివరించినట్లు తెలిసింది. రహస్య కెమెరాల దృశ్యాలు, అరెస్ట్‌ సమయంలో స్వాధీనం చేసుకున్న నగదు, ప్రస్తుతం కేసు దర్యాప్తు గురించి ఖాన్‌ వివరించినట్లు సమాచారం.

No comments:

Post a Comment