Tuesday 24 December 2013

సోనియాకు థ్యాంక్స్! - KCR

సోనియాకు థ్యాంక్స్!

Published at: 25-12-2013 05:17 AM
 New  0  0 
 
 

ఆమెకు కృతజ్ఞత చూపించాల్సిందే..
ఉద్యోగులు, పెన్ఫన్లకు జనాభా ప్రాతిపదికన ఒప్పుకోం
గవర్నర్‌ను నెత్తిన రుద్దితే అంగీకరించం
సంపూర్ణ తెలంగాణకోసమే మరో యుద్ధానికి సిద్ధం
సవరణలు చేశాకే బిల్లు పార్లమెంటులో పెట్టాలి కేసీఆర్ స్పష్టీకరణ
తెలంగాణ గ్రూప్-1 అధికారుల డైరీ ఆవిష్కరణ
హైదరాబాద్, డిసెంబర్ 24: "టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లోకి జల్ది విలీనం చేయాలని ఆ పార్టీ ఎంపీ హన్మంతరావు అంటున్నడు. ఎవరేమన్నా తెలంగాణ ఇస్తున్నది సోనియానే. తప్పకుండా అందుకు కొంత కృతజ్ఞత చూపాల్సిందే. ఏ రూపంలో చూపాలన్నది విచారించుకుంటాం. అంత సోయిలేనోళ్లమా?'' అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో... రాష్ట్ర పునర్విభజన బిల్లుకు సవరణలు చేశాకే పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి ఇష్టం ఉంటే ఆంధ్రావాళ్లకు ఇంకా రూ.లక్ష కోట్లు ఇచ్చుకోవచ్చని, బిల్లు ముసాయిదాలో తెలంగాణపై పెట్టిన ఆంక్షలు మాత్రం ఎత్తేయాలని అన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధనకోసం మరో యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ ఉద్యోగులు, ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో జరిగిన తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బిల్లు ముసాయిదాలో తెలంగాణపై పెట్టిన ఆంక్షలు తీసేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ ఆంక్షలకు ఒప్పుకొంటే 'కేసీఆర్ రాజీపడ్డాడు. మరో చెన్నారెడ్డి అయ్యాడు' అని భవిష్యత్తులో చెప్పుకొంటారన్నారు.
దోపిడీ చేసిన ఆంధ్రావారికోసం రాజీకి సిద్ధపడాలా అని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో ప్రస్తుతం ఏనుగు పోయి, తోక మాత్రం మిగిలిందని... ఈ దశలో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. బిల్లు ముసాయిదాలో నాలుగు అంశాలు తెలంగాణకు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. జీవోఎంతో జరిగిన భేటీ సమయంలోనే తమ ఉద్యమానికి ప్రాతిపదికే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పామన్నారు. జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణీని అంగీకరించేది లేదని, ఈ ప్రాతిపదికన పెన్షన్ల చెల్లింపునూ ఒప్పుకోబోమని స్పస్టం చేశారు. పెన్షన్లకే రూ.5వేల కోట్లు పోతాయన్నారు. ముల్కీ నిబంధనలు, 610 జీవోను ప్రాతిపదికగా తీసుకోవాలని జీవోఎం వద్ద చెప్పానని స్పష్టం చేశారు. "ఇంకా ఏ జోన్లో ఉండేవారు అదే జోన్లోనేనంట. ఇంక తెలంగాణ ఎందుకు? ఆంధ్రలోనే ఉంటే పోలే? గవర్నర్‌ను మన నెత్తిన పెడతరంట. తెలంగాణవాళ్లు అంత పనికిమాలినోళ్లా? మనం పరిపాలన చేసుకోలేమా? కేంద్రానికి మనపై నమ్మకంలేదా? మనం భారతీయులం కాదా? ప్రధానిని నేను ప్రశ్నిస్తున్నాను. తెలంగాణపై పక్షపాత వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారు? దీన్ని సహించేది లేదు'' అన్నారు.
విద్యుత్తునూ ప్రమాదంలో పెట్టారన్నారు. రెండేళ్ల వరకు విద్యుత్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్‌డీసీ) కలిపేనంటున్నారని తెలిపారు. "మనది మనకు వెంటనే చేస్తే ఛత్తీస్‌గఢ్ నుంచి 3 వేల మెగావాట్లు కొంటాం. పీపీఏ ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలోనే ఉన్నయ్. లగడపాటి జగడమే ఇది. వాటి నుంచి విద్యుత్ కొనాలంటే యూనిట్‌కు రూ. 11.40 అయితది. మన కరెంటుకు రూ. 2.40కే వస్తది. అంటే వాళ్ల కరెంటు మనం రూ. 11.40కి కొనాలి. మన కరెంటు వాళ్లకు రూ.2.40కే ఇవ్వాలన్నమాట. ఈ పీపీఏలు ఒక్కసారి ఒప్పుకుంటే 20 ఏళ్లు భరించాలి. ఈ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు'' అని కేసీఆర్ తెలిపారు. ఈ అంశాలపై ఓ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. అవసరమైతే అందర్నీ తీసుకుని ఢిల్లీకి వెళదామని, ప్రధానిని, సోనియాను కలుద్దామని ప్రతిపాదించారు.
ఇప్పటికీ సందేహమే...
"డ్రాఫ్టు బిల్లు శాసనసభకు పంపడమే చివరి అడుగు. కానీ దానికి జఠలేదు, దీర్ఘంలేదు, అనువాదం లేదు, చదవడానికి ఐదేళ్లుపడుతుంది... అంటూ సీఎం కిరణ్ మాట్లాడుతుండు. గ్రూప్-1 అధికారి 500 పేజీల ఫైలును ఒక్క రోజులో చదివేస్తుండు. ఆంధ్రాలో ఎవరైనా మేధావులున్నరా అన్నది నాకు ఇప్పటికీ సందేహమే'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సాంకేతికాంశాలు నమ్ముకుని ఆంధ్రా నేతలు తమ ప్రాంత ప్రజలనూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలపై జనవరి 3 తర్వాత ఇందిరాపార్కులో ధర్నా పెట్టాలని జేఏసీ చైర్మన్ కోదండరాంను కోరారు. 10వేల మందితో ఆ సభ దద్దరిల్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడిన వారిలో పొన్నం ఒకరని కేసీఆర్ ప్రశంసించారు. ఆంధ్రావాళ్లు లాబీ చేస్తున్నట్లుగానే ఆయనా.. ఉద్యోగ సంఘాలతో కలిసి ఢిల్లీలో లాబీ చేయాలని కోరారు. "విభజన సమయంలో ఎవరి సమస్యను పరిష్కరిస్తున్నారు? సమస్య ఉంది తెలంగాణ ప్రజలకే. దోపిడీ పాలయిందీ వీరే. వారికి పోలవరం ప్రకటిస్తిరి. మా సంగతేంటి? మేం పైకి రావద్దా? అభివృద్ధి చెందవద్దా?'' అని ప్రశ్నించారు. తెలంగాణలో 85శాతం మంది బడుగు బలహీనవర్గాల ప్రజలేనని, అగ్రకులాలు 15 శాతమేనని అన్నారు. ఈ 85 శాతంమంది సంక్షేమం జరగకుంటే రాష్ట్ర ఏర్పాటు నిరర్థకమని కేసీఆర్ అన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/46515#sthash.zaWNJzh7.dpuf

No comments:

Post a Comment