Monday 9 December 2013

ఎలా విభజిస్తారో చూస్తాం - కిరణ్ కుమార్ రెడ్డి

ఎలా చేస్తారో చూస్తాం

Published at: 08-12-2013 07:17 AM
 1  0  1 
 
 

విభజన బిల్లును అసెంబ్లీలో ఓడిస్తాం.. ఓడిన బిల్లును పార్లమెంటుకు ఎలా తెస్తారు?
పార్టీ ఇక్కట్లలో ఉన్న ప్రతీసారీ ఆదుకోవడమే తెలుగువాళ్ల పాపమా?
కూర్చన్న కొమ్మనే నరక్కుంటారా?... కేసీఆర్, జగన్, చంద్రబాబు అడిగారని విభజిస్తారా?
కావాలంటే వాళ్లనే ముఖ్యమంత్రిని చేసుకోండి...రాష్ట్రాన్ని మాత్రం సమైక్యంగా ఉంచండి
ఇంత పెద్ద ఉద్యమం జరిగితే కనపడలేదా?.. కళ్లూ, చెవులూ, నోరూ మూసుకున్నారు!
'పులిచింతల' వేదికపై ముఖ్యమంత్రి గర్జన.. ప్రాజెక్టు జాతికి అంకితం
సీఎం కిరణ్ మరోమారు సమైక్య గర్జన చేశారు. ఈసారి తన స్వరాన్ని మరింత పెంచారు. "నేను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర విభజనకు సహకరించేది లేదు. ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తుంది. అక్కడ ఓడిస్తాం. అసెంబ్లీలో ఓడిన బిల్లును పార్లమెంటులో ఎలా తెస్తారో చూస్తాం!'' అంటూ ఘాటుగా స్పందించారు.
విజయవాడ, డిసెంబర్ 7 : "రాష్ట్ర విభజన బిల్లుకు సహకరించం. అసెంబ్లీలో ఓడించి తీరుతాం. ఓడిన బిల్లు ను పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారో చూస్తాం'' అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. శనివారం పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం... విజయవాడ బహిరంగ సభలో ఆయన తన స్వరాన్ని మరింతపెంచి మరో సారి సమైక్య గర్జన చేశారు. 'కృష్ణా డెల్టా వందేళ్ల కల అయిన పులిచింతల ప్రాజెక్టును నేను ప్రారంభించడం పూర్వజన్మ సుకృ తం. అదెంత గొప్పగా భావిస్తున్నానో రాష్ట్ర విభజన అంత దురదృష్టకరమని అనుకుంటున్నాను. నేను సీఎంగా ఉండగా విభజనకు సహకరించేది లేదు. ముసాయిదా బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. అందులో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఉన్నాయి. బిల్లు అసెంబ్లీకి వస్తుంది. అక్కడ ఓడిస్తాం. ఇక్కడ ఓడిన బిల్లును పార్లమెంటులో ఎలా తెస్తారో చూస్తాం!'' అని ఉద్ఘాటించారు.
'మేమేం పాపం చేశాం?' అని అధిష్ఠానాన్ని నిలదీశారు. కాంగ్రె స్‌కు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి ఆదుకోవడమే పాపమా? అని ప్రశ్నించారు. "1977లో ఇందిరమ్మకు కష్టంవస్తే 41 సీట్లిచ్చాం. తిరిగి కాం గ్రెస్‌కు 30సీట్లు ఇచ్చాం. 2009లో మళ్లీ 33సీట్లిచ్చి గెలిపించాం. కాంగ్రెస్ కు ఇంత బలమున్న రాష్ట్రాన్ని బలహీ నపరుస్తారా? కేసీఆర్ చెప్పారని, జగన్ కలుస్తారని, బాబు జాబు ఇచ్చారని విడదీస్తారా? కూర్చున్న కొమ్మనే నరుక్కుంటామా?'' అని అధిష్ఠానాన్ని నిలదీశారు. "రాష్ట్రం వేరు. రాజకీయం వేరు. ఒకసారి ఓడిపోతే మరోసారి గెలుస్తాం. కావాలంటే... కేసీఆర్‌ను లేదా జగన్‌ను సీఎం చేసుకోండి. చంద్రబాబు కలుస్తానంటే ఆయననూ కలుపుకుని సీఎంను చేయండి. అభ్యంతరం లేదు. కానీ... రాష్ట్రాన్ని విభజించవద్దు. రాజకీయ లాభం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేం ఎంతమాత్రం ఒప్పుకోం.. ఒప్పుకోం.. ఒప్పుకోం'' అని తేల్చిచెప్పారు. "పొరపాటును దిద్దుకుంటే తప్పులేదు. ఢిల్లీలో కూర్చున్న మేధావులారా! ఇప్పటికీ మించిపోలేదు. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి. రాష్ట్రం హర్షిస్తుంది'' అన్నారు
అన్నీ కష్టాలే...
రాష్ట్రం విడిపోతే ఇరు ప్రాంతాలకు అన్నీ కష్టాలేనని సోదాహరణంగా చెప్పారు. గతంలో ప్రస్తావించిన సాగునీరు, విద్యుత్తు అంశాలను మరోసారి బహిరంగంగా చెప్పారు. "ఉద్వేగాలు, భేదాభిప్రాయాలు, వెనుకబాటుతనం వంటివి దేశంలో అన్ని చోట్లా ఉంటాయి. ఇదే ప్రాతిపదిక అయితే ఎన్ని రాష్ట్రాలుగా విడిపోతామని ఇందిరాగాంధీ 1972లో పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని అందరూ వినాలి. విభజన నిర్ణయం తీసుకున్నవారు చాలా తెలివైన వారు. ఒక్కసారి ఇందిరమ్మ ప్రసంగాన్ని చదివితే ఎవ రూ విభజన కోరుకోరని స్వయంగా వారికి చెప్పాను'' అని వివరించారు. ఇందిరాగాంధీ గట్టి ముడివేస్తే... కాంగ్రెస్ పార్టీయే ఆ ముడిని విప్పాలని చూస్తోందని ఆక్రోశించారు. రాష్ట్రాన్ని విడగొడితే 2 లక్షల మంది ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయని... బదిలీలు, సర్వీసు మ్యాటర్స్, పెన్షన్ల విషయంలో అనేక ఇక్కట్లు వస్తాయని చెప్పారు. 'ఏ నిర్ణయమై నా మెజారిటీ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. రాష్ట్ర విభజనను 75 నుంచి 80 శాతం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రు. విభజనపై రాష్ట్రంలో 70 రోజుల పాటు తీవ్ర ఆందోళన జరిగింది. రోజుకు 3లక్షలమంది ప్రజలు రోడ్డెక్కారు. ఆరున్నర లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేశారు. ఇంత పెద్ద ఉద్యమం .. స్వతంత్ర భారతదేశంలోనే జరగలేదు. నేను 53 ఏళ్ల జీవితంలో ఇలాంటి ఉద్యమాన్ని చూడలేదు. అయినా ఇవేమీ ఢిల్లీకి కనిపించలేదు. వాళ్లు కళ్లు మూసుకున్నారు. చెవులు మూసుకున్నారు. నోళ్లు కూడా మూసుకున్నారు. ఇదేనా న్యాయం?'' అని ప్రశ్నించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అసంతృప్తిగా ఉన్నామంటూ... ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తూ రెండు ప్రాంతాలలో నీటి సమస్యపై ఆయన నేతృత్వంలోనే ఒక బోర్డును ఏర్పాటు చేస్తామనటం చాలా అన్యాయమని విమర్శించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలలో కట్టిన పలు ప్రాజెక్టులు ఇబ్బందులలో పడతాయని తెలిపారు. తెలంగాణకు విద్యుత్‌లో 50శాతం లోటు ఏర్పడుతుందన్నారు.
అన్నపూర్ణకు ఆవేదన
'ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అనే పేరు ఉంది. అనేక రాష్ట్రాలు, దేశాలకు ఇక్కడినుంచి బియ్యం ఎగుమతి అవుతాయి. విభజన ద్వారా ఇప్పుడు సమస్యలు సృష్టిస్తున్నారు'' అని పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి మాత్రమే సంబంధించినది కాదని... దేశానికీ సమస్యేనని చెప్పారు. గత 25, 35 ఏళ్లు ఎంతోకష్టపడి నక్సలిజాన్ని నిర్మూలించామని, మతతత్వాన్ని అణచివేశామని తెలిపారు. విభజన నిర్ణయంవల్ల దేశ శాంతిభద్ర తలకు ముప్పని ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీల సమావేశంలో చెప్పారన్నారు. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకోవాలని కోరారు.
సమైక్యాంధ్ర సంకల్పం...
సమైక్యాంధ్ర తమ సంకల్పమని కిరణ్ ప్రకటించారు. ఇది నినాదం కాదని... విధానమని తెలిపారు. సభకు వచ్చిన ప్రజలతో 'జై సమైక్యాంధ్ర' నినాదాలు చేయించారు. సమైక్యంగా ఉం టేనే అభివృద్ధి చేసుకోగలుగుతామన్నారు. "ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశాం. పన్నుల ఆదాయాన్ని 45 వేల కోట్ల నుంచి 75 వేల కోట్లకు తెచ్చాం. రూపాయి కూడా పక్కదారి పట్టకుండా చూశాం. ఈ ఏడాది ఇండియాటుడే రాష్ట్రానికి ఉత్తమ పాలన అవార్డు ఇచ్చింది'' అన్నారు. సభకు మంత్రి పార్థసారథి అధ్యక్షత వహించగా, మంత్రులు తోట నరసింహం, పితాని సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లగడపాటి పాల్గొన్నారు.
అభిమన్యుడా.. అర్జునుడా?
రాష్ట్ర విభజనపై ధర్మపోరాటం సాగిస్తు న్న ముఖ్యమంత్రి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడుగా నిలుస్తాడో, అర్జునుడిలాగా గెలుస్తారో చూడాలి. రెండు ప్రాంతాలు కత్తులు దూసే తరుణంలో.. నదిలో నీరు కాకుండా రక్తం ఏరులై పారే పరిస్థితులు ఉన్నా.. తన పదవి పోయినా పర్వాలేద ని రైతాంగ ప్రయోజనాలకే సీఎం పెద్దపీట వేశారు.
- లగడపాటి రాజగోపాల్
పులి చింతలతో కృష్ణమ్మ బిరబిర
గుంటూరు, డిసెంబర్ 7 : వందేళ్ల కళ ఫలించింది. పులిచింతల ప్రాజెక్టు సాకారమైంది. 'డాక్టర్ కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టు'ను శనివారం ముఖ్యమంత్రి కిరణ్ జాతికి అంకితంచేశారు. కృష్ణా డెల్టాకింద గుంటూ రు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 13.07 లక్షల ఆయకట్టును స్థిరీకరించే ఈ ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రాజెక్టుపై కొంతదూరం నడిచి స్విచాన్ చేసి 17వ నంబర్ గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మ బిరబిరా దిగువకు పరుగులు తీయడం చూసి నేతలు, ప్రజలు పులకించిపోయారు. పులిచింతల ప్రాజెక్టు రూపకర్త అయిన డాక్టర్ కేఎల్ రావు కుమార్తె, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతరావు, కుమారుడు అశోక్‌రావు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రాజెక్టుకు తమ తండ్రి పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రులు పార్థసారథి, కన్నా లక్ష్మీనారాయణ, కాసు కృష్ణారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పులిచింతల తన మానస పుత్రిక అని, తన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందేనని రాజ్యసభ మాజీ సభ్యు డు యలమంచిలి శివాజీ తెలిపారు. ఏటా మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కృష్ణా జలాలు విడుదలై... జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు దాటుకుని కృష్ణా డెల్టాకు వచ్చేసరికి జూలై నెలాఖరయ్యేది. దీనివల్ల ఖరీఫ్ సాగు ఆలస్యమై నవంబర్‌లో తుఫాన్లకు పంట దెబ్బతినేది. అదే జూన్ నెలలోనే ఖరీఫ్ ప్రారంభమైతే అక్టోబర్‌కల్లా పంట చేతికొ స్తుంది. పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీల నీటి నిల్వకు వీలున్న నేపథ్యం లో డెల్టాకు జూన్‌లోనే విడుదల వెసులుబాటు కలుగుతుంది. రూ.650 కోట్లతో ప్రాజెక్టును చేపట్టినప్పటికీ జాప్యంవల్ల రూ.1831 కోట్లకు చేరింది. పులిచింతల ప్రారంభోత్సవానికి సీఎం కిరణ్ వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో... ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబులను పోలీసులు గృహ నిర్బం ధం చేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/39241#sthash.I3rqYKSM.dpuf

No comments:

Post a Comment