Sunday 29 December 2013

చంద్ర గర్జన!

చంద్ర గర్జన! సోనియా.. అవినీతి అనకొండ!

Published at: 30-12-2013 09:30 AM

 New  0  0 

 



వైఎస్, జగన్, వాద్రా పిల్ల అనకొండలు
మళ్లీ సర్పయాగం చేయాలి.. అందుకు యువత నడుం బిగించాలి
ప్రతి ఇంటి నుంచి ఇద్దరు రోడ్డుపైకి రావాలి.. అవినీతి రహిత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
ప్రజాగర్జనలో యువతకు చంద్రబాబు పిలుపు.. తిరుపతి వేదికగా సోనియా, జగన్‌పై చండ్ర నిప్పులు
అవినీతిపై ప్రజల స్పందనే అమ్ అద్మీ విజయం... దేశ రాజకీయాల్లో టీడీపీ చక్రం తిప్పే రోజొస్తుంది
రాష్ట్రాన్ని దోచుకుతిన్న వారిని వదలను.. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేసి ప్రజలకు పంచుతా
విభజిస్తే సీమాంధ్రకు, విభజించకపోతే తెలంగాణకు అన్యాయం.. అందరి అమోదంతోనే ముందుకు
తిరుపతి, డిసెంబర్ 29 : "సోనియా గాంధీ ఒక పెద్ద అవినీతి అనకొండ. వైఎస్ రాజశేఖర రెడ్డి, రాబర్ట్ వాద్రా, జగన్మోహన్‌రెడ్డి రూపంలో ఆమె చాలా అనకొండలను తయారు చేశారు. ఈ అవినీతి అనకొండల ఆట కట్టించాలంటే మళ్లీ సర్పయాగం చేయాలి. దానికి యువత ముందుకు రావాలి. అవినీతి అనకొండల నుంచి దేశాన్ని కాపాడే ఉద్యమంలో భాగస్వాములు కండి. ఇప్పుడు అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పవిత్ర యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటి నుంచీ ఇద్దరు రోడ్డుపైకి రావాలి'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒకరకంగా ఎన్నికల ప్రచారానికి తిరుపతి నుంచి ఆయన శ్రీకారం చుట్టారు. అవినీతి-కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన ప్రజా గర్జనలో తన సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు గర్జించారు. తిరుపతిలో ఆదివారం జరిగిన ప్రజా గర్జన సభలో సోనియా గాంధీ, వైఎస్ జగన్‌లపై విరుచుకుపడ్డారు. "రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతోంది. బుద్ధి ఉన్న వాడెవడూ కాంగ్రెస్‌కు ఓటేయడు. అనకొండలాంటి ఆ పార్టీకి ఓటేస్తే.. అది మిమ్మల్నే మింగేస్తుంది. జాగ్రత్త'' అని హెచ్చరించారు. అవినీతిరహిత భారతదేశం కోసం జరుగుతున్న పవిత్ర యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అభ్యర్థించారు. ఈ పవిత్ర కార్యం కోసం చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతానని శ్రీ వేంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి మరీ వాగ్దానం చేశారు. తాను ఒక్కసారి పట్టుకుంటే వదలనని, నిరంతరం పోరాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. నీతిగా, నిజాయతీగా, నిప్పులా బతికామని, టీడీపీపై చర్య తీసుకోవడం సోనియా లేదా ఆమెను పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదని తేల్చి చెప్పారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. "రేపు జరిగేది కురుక్షేత్ర యుద్ధం. కౌరవులు విర్రవీగారు. అడ్రస్ లేకుండాపోయారు. ధర్మం గెలిచింది. సమాజంలో ఎప్పుడైనా ధర్మం, న్యాయమే గెలుస్తుంది'' అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల తర్వాత 294 సైకిళ్లు అసెంబ్లీకి దూసుకొచ్చేలా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. అవినీతిరహిత సమాజ స్థాపన కోసం పాటుపడతామంటూ సభకు హాజరైన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. పొడుపు కథలతో అలరించారు.
అవినీతిని అనకొండతో పోల్చుతూ..!
"ఒకప్పుడు ఒకరికి దారిలో బక్కచిక్కిన పాము కనిపించిందట. పాపం అని దానిని ఇంటికి తెచ్చుకొని పెంచుతున్నాడు. అది ఇంట్లో పదార్థాలను తినడం మరిగింది. బాగా బలిసిన తర్వాత గుడ్లు పెట్టింది. అవి మరికొన్ని అనకొండలయ్యాయి. ఇలా దేశం మొత్తం అనకొండలు తయారై అందరినీ తినడం మొదలుపెట్టాయి. అప్పుడు జనమేజయ మహారాజు సర్పయాగం చేసి అనకొండల ఆట కట్టించాడు. అలాగే, పాపం.. భర్త లేడు.. అత్త చనిపోయింది.. పోనీ పాపమని 2004లో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఆ నేరానికి సోనియా.. దేశమంతా అవినీతి అనకొండలను తయారు చేశారు. ఢిల్లీలోని అవినీతి అనకొండలను కేజ్రీవాల్ చంపేశారంటూ 15 ఏళ్లుగా సీఎంగా ఉన్న షీలా దీక్షిత్‌ను చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ఇది అవినీతిపై అక్కడి ప్రజల ప్రతిస్పందనని, ఆ స్పందన దేశవ్యాప్తంగా రావాలని పిలుపునిచ్చారు. అవినీతి లేని భారతదేశం తయారయ్యే వరకు తాను పోరాడతానని స్పష్టం చేశారు. ఇది తన కోసం.. తన కుటుంబం కోసం కాదని, కష్టాల్లో ఉన్న రైతుల కోసం, ఉపాధి దొరకని నిరుద్యోగుల కోసమని స్పష్టం చేశారు. తాను చేసే మహా యజ్ఞానికి మీ సహకారం అవసరమని, ప్రజల్లో ఆ చైతన్యం తేవడానికే ప్రజా గర్జన నిర్వహిస్తున్నానని ప్రకటించారు. "నేను నిమిత్తమాత్రుడిని. మీరు నడిపిస్తే బుల్లెట్‌లా దూసుకుపోతా. రామబాణంలా ముందుకెళతా. మీరు సహకరిస్తే అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా'' అని చంద్రబాబు స్పష్టం చేశారు. గాంధీలోని పోరాట పటిమ, అన్నా హజారేలోని స్ఫూర్తి తనలో ఉన్నాయన్నారు. "వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో చక్రం తిప్పుతుంది. అప్పుడు రాష్ట్ర ప్రజల కష్టాలు తీరిపోతాయి'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆరోజు గంగా, కావేరిలను ఏకం చేసి దేశాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. రోడ్ల మీద తిరుగుతూ నీతి వాక్యాలు పలుకుతున్న జగన్ తనకు బెయిల్ ఎలా వచ్చిందో, ఐదేళ్లలో రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా సమకూరాయో చెప్పాలని చంద్రబాబు డిమాండు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా బిల్లు తెచ్చినట్లు రాహుల్ ప్రగల్బాలు పలుకుతున్నారని, వాస్తవానికి, అవినీతికి పునాది వేసిందే సోనియా నివాసమని మండిపడ్డారు. కేంద్రంలో టీడీపీ చక్రం తిప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, సోనియా, జగన్ అవినీతి ఆస్తులను జప్తు చేసి ప్రజలకు పంచి పెడతామని స్పష్టం చేశారు.

సోనియా కక్కుర్తి రాజకీయం
కేంద్రంలో అధికారం కోసం అటు కేసీఆర్‌తో, ఇటు జగన్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకొని అడ్డగోలు విభజనకు సోనియా గాంధీ పాల్పడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సోనియా తన పార్టీని భూస్థాపితం చేసుకొని అవినీతిపరుల పంచన చేరుతోందని, కేసీఆర్, జగన్‌లతో పొత్తు పెట్టుకొంటోందని, కొన్ని సీట్ల కోసం కక్కుర్తి రాజకీయం చేస్తోందని విరుచుకుపడ్డారు. "పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం ప్రభంజనానికి భయపడి, తన రాజకీయ లబ్ధి కోసం సోనియా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి పూనుకున్నారు. విభజన విషయంలో టీడీపీపై నిందలు వేస్తున్నారని, 2008లో టీడీపీ ఇచ్చిన లేఖలో ఏముందో ఒకసారి పరిశీలించాలని చంద్రబాబు కోరారు. రెండు ప్రాంతాలకు సమాన న్యాయం చేసిన తర్వాతే ముందుకెళ్లాలని ఆ తీర్మానంలో స్పష్టం చేశామన్నారు. "రాష్ట్ర విభజనలో సోనియా మొదటి ముద్దాయి. కేసీఆర్, జగన్, కిరణ్ కుమార్‌రెడ్డి తర్వాతి ముద్దాయిలు. నేను మాత్రం కుటుంబ పెద్దలా వ్యవహరిస్తున్నాను. రెండు ప్రాంతాలకూ న్యాయం జరగాలంటే ఇరువర్గాలనూ కూర్చోబెట్టి మాట్లాడాలి. న్యాయం జరిగితేనే ముందుకెళ్లాలి. అంతవరకూ ముందుకు వెళ్లవద్దు'' చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు సీమాం«ద్రులను ఒప్పించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందనని తేల్చి చెప్పారు. "సమైక్య వాదం ముసుగులో అవినీతి అనకొండ జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. సోనియా వల్ల జగన్ బయటకు వచ్చాడు. ఇద్దరిదీ మ్యాచ్ ఫిక్సింగ్. సోనియా సూత్రధారి, పాత్రధారి, మొదటి ముద్దాయి అయితే ఆమెకు సహకరించింది జగన్, కేసీఆర్. ఒకటి కుట్ర.. మరొకటి దగా. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను కలుపుకోవాలనుకున్నారు. సమైక్య వాదం ముసుగులో సోనియా వాదంతో విభజనకు పనిచేసే మహా నాయకుడు పిల్ల కాంగ్రెస్ నాయకుడు. అవినీతిలో హీరోని సమైక్య హీరోగా అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ నాయకులకు సవాల్ విసురుతున్నా. దిక్కున్నచోట చెప్పుకోండి. మీ వల్లయితే నాపై విచారణలు వేసుకోండి. మాకు ఏ పార్టీతోనూ మ్యాచ్ ఫిక్సింగ్ లేదు. సమైక్యం ముసుగులో రాష్ట్ర విభజనకు సహకరించం'' అని తేల్చి చెప్పారు.
నేడు ఒంగోలులో ప్రజాగర్జన
నేడు ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ ప్రజా గర్జన సభ జరగనుంది. పార్టీ అధినేత చంద్ర బాబు ఈ సభకు హాజరు కానున్నారు.
'అపరిచిత' ప్రసాదు!
శంకర్ 'అపరిచితుడు' అవినీతిపై అంకుశం ప్రయోగిస్తే.. ఈ ఫొటోలోని అపరిచితుడు విభజనపై విరుచుకుపడ్డాడు. రూల్స్ తప్పినవారిని రూళ్లకర్రతో బాది కటువైన దండనను ఆ సినిమాలో విధిస్తే.. ఇతడు సంప్రదాయాలు తప్పి విభజన ప్రక్రియను నడిపిస్తున్నారంటూ సోనియాగాంధీకి అవే శిక్షలు ప్రకటించాడు. ఏఐసీసీ అధ్యక్షురాలికి 'కుంభీపాకం' తప్పదని హెచ్చరించాడు. విచిత్ర వేషధారణలతో 'సమైక్య' వాణి వినిపిస్తున్న తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్..ఆదివారం 'అపరిచితుడి' వేషం కట్టి ఇలా అలరించారు. అంతేకాదు... 'భలే మంచి చిచ్చు పెడితివే... ఓ సోనియమ్మ! అన్నదమ్ముల వంటి తెలుగు ప్రజలమధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తుంటివే! సీమాంధ్ర ప్రజలపై శఠగోపం పెట్టి చోద్యం చూస్తుంటివే! రెండుసార్లు గెలిపించిన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని యోచిస్తివే!' అంటూ పాట కూడా అందుకున్నారు.
- ఎం.ఆర్.పల్లె, చిత్తూరు
పార్టీపై హరికృష్ణ రుసరుస
హైదరాబాద్: టీడీపీ నేతలపై పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరోమారు రుసరుసలాడారు. 'ప్రజాగర్జన' సభకు ఆహ్వానం లేకపోవడంపై ఆయన ఆగ్రహించారు. మీడియా ప్రతినిధులకు ఆదివారం హరికృష్ణ రెండు సంక్షిప్త సందేశాలు పంపారు. తిరుపతి సభకు తనకు ఆహ్వానం లేదని మొదటి సందేశంలో పేర్కొన్న హరికృష్ణ... సమైక్యాంధ్ర అంటున్నందువల్లే తనకు ఆహ్వానం పంపలేదని రెండో సందేశమిచ్చారు. దీంతో కొంత కలకలం రేగడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయం వివరణ ఇచ్చింది. ప్రజాగర్జన సభలను ఆయా జిల్లా కమిటీలే నిర్వహిస్తున్నాయని, వాటికి రాష్ట్ర కార్యాలయం నుంచి ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని తెలిపింది. ఆసక్తి ఉన్న నేతలు నేరుగా వెళ్లి సభల్లో హాజరవుతున్నారని పేర్కొంది.
చంద్రబాబు హామీల వర్షం
- దేశాన్ని సస్యశ్యామలం చేసేలా గంగా, కావేరీ నదుల అనుసంధానం
-రాష్ట్రంలో రైతు రుణాలన్నీ రద్దు
- వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర, నాణ్యమైన.. ఉచిత విద్యుత్తు సరఫరా
- వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర. సేద్యం లాభసాటిగా మారేలా చర్యలు
- డీకేటీ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పించి.. విక్రయించుకునే వెసులుబాటు
- ఆడపడుచులకు పూర్తి రక్షణ. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు
- ఆధార్ కార్డుతో లింకు లేకుండా ఏడాదికి 10 గ్యాస్ సిలిండర్లు సరఫరా. ఈ సందర్భంగా ఆడబడుచులకు తాను ఇచ్చిన 'దీపాన్ని' కాంగ్రెస్ వాళ్లు ఆర్పేశారని
మండిపడ్డారు.
- ఉపాధి హామీ పని దినాల పెంపు
- నిరుద్యోగ యువతకు వెయ్యి నుంచి రూ. 2 వేల వరకు భృతి.
- వెనకబడిన వర్గాల అభ్యున్నతికి రూ.10 వేల కోట్లతో సబ్‌ప్లాన్ అమలు. 100 మంది బీసీలకు అసెంబ్లీ టికెట్లు.
- ప్రతి పేద కుటుంబానికీ ఇంటి స్థలం, రూ.1.5 లక్షలతో పక్కా గృహ నిర్మాణం.
- టీటీడీ ఉద్యోగస్తులందరికీ ఇంటి జాగా, ఇంటి నిర్మాణం. టీటీడీ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం. ఆరోగ్య బీమాపై పరిశీలన. కల్యాణ కట్టలో పని చేసే ఉద్యోగులను పర్మినెంట్ చేయడం.
- See more at: http://www.andhrajyothy.com/node/48534#sthash.UMChxU06.dpuf - See more at: http://www.andhrajyothy.com/node/48534#sthash.UMChxU06.dpuf - See more at: http://www.andhrajyothy.com/node/48534#sthash.UMChxU06.dpuf

No comments:

Post a Comment