Saturday, 14 December 2013

బీజేపీతో వెళుతున్నట్లే! - చంద్రబాబు

మనం బీజేపీతో వెళుతున్నట్లే!

Published at: 15-12-2013 04:34 AM
 New  0  0 
 
 

పార్టీ నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్య
భోపాల్‌లో బీజేపీ నేతల స్వాగతంపై సంతృప్తి
మోదీతో గంటపాటు మంతనాలు
వేదికపైనే కూర్చోబెట్టిన కమలనాథులు
(హైదరాబాద్) వచ్చే ఎన్నికల్లో మనం బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేల వద్ద వ్యాఖ్యానించారు. మూడోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై వచ్చిన తర్వాత.. శనివారం సాయంత్రం తన నివాసంలో ఆయన తెలంగాణ ప్రాంత పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్య చేసినట్లు సమాచారం. "వచ్చే ఎన్నికల్లో మనతో కలిసి రావాలని బీజేపీ బాగా ఆసక్తితో ఉంది. మూడు రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించారు. ఈరోజు భోపాల్ వెళ్తే మొత్తం బీజేపీ నేతలంతా ఆప్యాయంగా స్వాగతించారు. మోదీ కూడా నాతో విడిగా అనేక విషయాలపై మాట్లాడారు. దేశంలో అవినీతిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, కాంగ్రెస్‌ను ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహం వంటివి మా మధ్య చర్చకు వచ్చాయి'' అని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్న ఈ సమయంలో బీజేపీతో కలిసి ప్రయాణించడమే సరైన వైఖరని ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
భోపాల్ పర్యటనపై చంద్రబాబు హ్యాపీ!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు భోపాల్ వెళ్లి వచ్చిన చంద్రబాబు ఈ పర్యటనపై బాగా సంతృప్తిగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. "అక్కడ చంద్రబాబును బీజేపీ నేతలు బాగా ఆదరంగా స్వాగతించారు. తమతోపాటు ఆయనను వారు ప్రమాణ స్వీకార వేదికపై కూర్చోబెట్టారు. వేదికపై మోదీకి ఒకపక్కన ఆడ్వాణీకి, రెండో పక్కన చంద్రబాబుకు సీటు ఏర్పాటు చేశారు. చంద్రబాబు రాగానే అగ్ర నేతలు ఆడ్వాణీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ వంటివారు దగ్గరకు వచ్చి పలకరించారు. అనంతకుమార్, రవిశంకర్ ప్రసాద్ వంటివారు ఆసాంతం చంద్రబాబుతోనే ఉన్నారు. చంద్రబాబు అక్కడకు రావడంపై బీజేపీ నేతల్లో బాగా సంతోషం వ్యక్తమైంది. వారి ఆదరణతో చంద్రబాబు కూడా బాగా సంతోషపడ్డారు'' అని ఈ పర్యటనలో ఆయనతోపాటు పాల్గొన్న టీడీపీ నేత ఒకరు వివరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కాగానే పక్కనే ఉన్న ఓ గదిలోకి మోదీ చంద్రబాబును తీసుకెళ్లారని, సుమారు గంటపాటు వారి భేటీ జరిగిందని తెలిపారు. మిగిలిన బీజేపీ నేతలతో మాత్రం చంద్రబాబు ఒకేచోట అందరితోపాటు కలిసి కూర్చుని కాసేపు కబుర్లు చెప్పారు. మధ్యాహ్న భోజనం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. చంద్రబాబుతోపాటు టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు తదితరులు భోపాల్ వెళ్లిన వారిలో ఉన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/42805#sthash.UNYAedyM.dpuf

No comments:

Post a Comment