సైకిలెక్కుదాం!
టీడీపీ వైపు నలుగురు మంత్రులు..ఇద్దరు ఎంపీలు..18 మంది ఎమ్మెల్యేలు
హైదరాబాద్, డిసెంబర్ 24: అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్రంలో భారీగా రాజకీయ పునరేకీకరణలు చోటు చేసుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారు కావడంతో ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నట్లు సమాచారం. ఆసక్తి ఉన్న నేతలు ఇప్పటికే టీడీపీ నాయకత్వంతో వివిధ మార్గాల్లో సంప్రదింపులు జరుపుతున్నారు. వీరిలో కొందరి విషయంలో ఆ పార్టీ నాయకత్వం కూడా పచ్చ జెండా ఊపినట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత వీరంతా విడతల వారీగా అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు.
టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం ఆ పార్టీవైపు చూస్తున్న వారిలో నలుగురు రాష్ట్ర మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వీరి సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయని ఆ వర్గాలు అంటున్నాయి. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల నుంచి చేరికలు అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిలో కొందరు ప్రస్తుతం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లు కాకుండా వేరే సీట్లను కోరుకొంటూ వస్తున్నారు. ఒక మంత్రి, ఒక ఎంపీ వీరిలో ఉన్నారు. మరో ముఖ్య నేత తాను రంగం నుంచి తప్పుకొని తన కుటుంబ సభ్యుడిని రంగంలోకి తెస్తున్నారు. ఈ మార్పులు చేర్పులపై టీడీపీ అధిష్ఠానం వద్ద ఇప్పటికే చర్చలు కూడా జరిగాయి. ఆ పార్టీ నాయకత్వం కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిన సమయంలో చోటు చేసుకొన్న వలసలతో కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకత్వ సమస్య ఏర్పడింది. అటువంటి చోట్ల మంచి నాయకులు వస్తానంటే ఆ పార్టీ స్వాగతం పలుకుతోంది.
అలాగే, వివిధ కారణాలతో నెల్లూరు, కర్నూలు వంటి జిల్లాల్లో ఆ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థుల కొరత ఏర్పడింది. ఇటువంటి చోట్ల కూడా తాము అనుకొంటున్న స్థాయి నేతలు వస్తే స్వాగతించడానికి టీడీపీ వర్గాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ వైపు చూస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య అరడజనుకుపైగానే ఉంది. కానీ, ఆ పార్టీ ఇద్దరు ముగ్గురుకు మించి తీసుకొనే పరిస్థితిలో లేదు. కొన్ని నియోజకవర్గాల్లో తమకు గట్టి నాయకత్వం ఉన్నప్పుడు అక్కడ వేరేవారిని తీసుకోవాల్సిన అవసరం లేదని, సామాజిక కారణాల రీత్యానో.. వ్యూహాత్మకంగానో మాత్రమే తీసుకొంటున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
రాయలసీమలో ఒక సామాజిక వర్గం, కోస్తాలో మరో సామాజిక వర్గం నుంచి వచ్చేవారికి ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది. టీడీపీ వైపు చూస్తున్నట్లు వినవస్తున్న మంత్రుల్లో ముగ్గురు రాయలసీమ నుంచి ఒకరు కోస్తా నుంచి, ఇద్దరు ఎంపీల్లో ఒకరు కోస్తా నుంచి మరొకరు రాయలసీమ నుంచి, పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల్లో నలుగురు రాయలసీమ నుంచి పదహారు మంది కోస్తా నుంచి ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తమతో సంప్రదింపుల్లో ఉన్న వారిని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను ఖరారు చేయకుండా పెండింగ్‌లో ఉంచారు. జిల్లాలవారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కొంతమంది పార్టీలోకి రాబోతున్నారని.. వారిని ఆహ్వానించాలని ముందుగానే చెప్పి వారిని సంసిద్ధులను చేస్తున్నారు. అభ్యంతరాలు ఉన్నవారిని పిలిపించి మాట్లాడి సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
No comments:
Post a Comment