Thursday 5 December 2013

విభజన జరిగేదిలా! 5 డిసెంబరు 2013

విభజన జరిగేదిలా!

Published at: 06-12-2013 03:55 AM

 4  0  0 

 



'ఆంధ్రజ్యోతి' చేతిలో కేబినెట్ ఆమోదించిన నోట్ ప్రతి
రెండు రాష్ట్రాలు..
పది జిల్లాలతో తెలంగాణ ఏర్పాటవుతుంది. మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉంటాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ, 40 ఎమ్మెల్సీ, 17 లోక్‌సభ, 7 రాజ్యసభ స్థానాలుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 50 ఎమ్మెల్సీ, 25 లోక్‌సభ, 11 రాజ్యసభ సీట్లు ఉంటాయి.
ఉమ్మడి రాజధాని.. ఒకే గవర్నర్
'గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్' (జీహెచ్ఎంసీ) గరిష్ఠంగా పదేళ్లపాటు ఉమ్మడిగా రాజధాని ఉంటుంది. ఉమ్మడి రాజధానిలో నివసించే వారందరి ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తులకు భద్రత కల్పించే ప్రత్యేక బాధ్యత తెలంగాణ గవర్నర్‌పై ఉంటుంది. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలక సంస్థల రక్షణ బాధ్యత కూడా గవర్నర్‌దే. ఆయా అంశాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని (మంత్రి మండలిని) సంప్రదించి గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. అయితే... మంత్రి మండలి సలహాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఈ బాధ్యతల నిర్వహణకు వీలుగా గవర్నర్‌కు ఇద్దరు సహాయకులను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది.
పోలీసు వ్యవస్థ
ఇరు రాష్ట్రాల్లో పోలీసు బలగాల బలోపేతానికి, శాంతి భద్రతల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. హైదరాబాద్‌లో ఐదేళ్లపాటు అదనంగా ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్‌ను కొనసాగిస్తారు. హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం మూడేళ్లపాటు ఉమ్మడిగా ఉంటుంది. ఇది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఈలోపు కొత్త రాష్ట్రం సొంతంగా, అత్యాధునిక సౌకర్యాలతో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రస్తుతమున్న గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. వారి నుంచి ఆప్షన్లు కోరుతారు. అవసరమైతే కేంద్రం రెండు రాష్ట్రాలకు అదనపు బలగాలను పంపుతుంది.
ఉన్నతవిద్య- ప్రవేశాలు
(ఉమ్మడి రాష్ట్రంలోని) ఉన్నతస్థాయి సాంకేతిక, వైద్య విద్య సంస్థల్లో ప్రస్తుతం అమలవుతున్న కోటాయే గరిష్ఠంగా మరో పదేళ్లపాటు కొనసాగుతుంది. ప్రభుత్వ విద్యాసంస్థలతోపాటు ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్-ఎయిడెడ్ విద్యా సంస్థల్లోనూ ఇదే కోటా పదేళ్లపాటు అమలవుతుంది.
ఆంధ్రకు 'విద్యా వరం'
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఐఐటీ, ఒక ఐఐఎం, ఒక ఎన్ఐటీ, ఒక ఐఐఎస్ఈఆర్, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒక ఐఐఐటీలను 12, 13 పంచ వర్ష ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేయాలి. అలాగే... ఆంధ్రప్రదేశ్‌లో ఏఐఐఎంఎస్ తరహాలో సూపర్ స్పెషాలిటీ-బోధనాస్పతిని ఏర్పాటు చేయాలి. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి.

అధికరణ 371(డి)
విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు ఉద్దేశించిన 371(డి) అధికరణ రెండు రాష్ట్రాల్లోనూ అమలవుతుంది. పార్లమెంటు అవసరమని భావిస్తే...ఆర్టికల్ 4 ప్రకారం 371(డి)కి అవసరమైన మార్పులు చేయవచ్చు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్
ప్రస్తుతమున్న సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తిస్తుంది. రాష్ట్రపతి ఆమోదం, చట్టం ప్రకారం తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను యూపీఎస్సీ ఏర్పాటు చేస్తుంది.
కొత్త రాజధాని
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించి... రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన 45 రోజులలోపు కొత్త రాజధానిని గుర్తించి తగిన సిఫారసులు చేస్తుంది. కొత్త రాజధానికి అవసరమైన ఆర్థిక, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకరిస్తుంది. అవసరమైతే... అటవీ భూములను (డీగ్రేడ్) డీనోటిఫై చేస్తుంది. రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ భవనం, శాసనమండలి భవనం, విభాగాధిపతుల కార్యాలయాలు, సిబ్బంది నివాస సముదాయాలు, ప్రభుత్వ అతిథి గృహాల నిర్మాణం సహా కొత్త రాజధానిలో అవసరమైన వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తుంది.
హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు కొత్త హైకోర్టు ఏర్పడేదాకా హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న హైకోర్టే ఉమ్మడిగా ఉంటుంది. ఉమ్మడి హైకోర్టు నిర్వహణకు అయ్యే ఖర్చును రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన భరిస్తాయి.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి
రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఆ ప్రాంతాల్లో భౌతిక, సామాజిక పరమైన మౌలిక వసతులను విస్తరిస్తుంది. రెండు రాష్ట్రాల పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి కోసం పన్ను రాయితీలతోసహా తగిన చర్యలను కేంద్రం తీసుకుంటుంది.
నదీ జలాల పంపిణీ.. రెండంచెల వ్యవస్థ
కృష్ణా నదీ జలాలపై కొనసాగుతోన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పదవీ కాలాన్ని పొడగిస్తారు. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులవారీగా కేటాయింపులపై నిర్ణీత గడవులోగా ట్రిబ్యునల్ తగిన సిఫారసులు చేస్తుంది. నీటి ప్రవాహ కొరత ఉన్న సందర్భాల్లో ప్రాజెక్టులవారీగా అనుసరించాల్సిన నిర్వహణ విధానాన్ని సూచిస్తుంది. కృష్ణా, గోదావరి జలాల వాడకానికి సంబంధించి రెండంచెల అధికార వ్యవస్థ ఉంటుంది. ఇదివరకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల విషయంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, సూత్రాలకు లోబడి ఈ వ్యవస్థ పని చేస్తుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీకి సంబంధించి రెండంచెల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఇందులో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు, కృష్ణా, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డులు ఉంటాయి.
అపెక్స్ కౌన్సిల్
- ఈ కౌన్సిల్‌కు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు.
-కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుల పనితీరును ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది.
- కొత్త ప్రాజెక్టుల కోసం ఆయా నదుల బోర్డులు, కేంద్ర జల వనరుల సంస్థ(సీడబ్ల్యూసీ) రూపొందించే అంచనాలు, చేసే ప్రతిపాదనలకు అనుమతినిచ్చే, ప్రణాళికను రూపొందించే అధికారం కౌన్సిల్‌కు ఉంటుంది.
- నీటి పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తుంది.
- బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పరిధిలోకి రాని వివాదాలు తలెత్తినపక్షంలో కేంద్ర ప్రభుత్వం కాలానుగుణంగా ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు దాన్ని నివేదిస్తుంది.
నిర్వహణ బోర్డులు
- ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లు అమలులోకి వచ్చిన 60 రోజుల్లోగా కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన బోర్డులను కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది. కృష్ణా బోర్డు హెడ్‌క్వార్టర్ ఆంధ్రప్రదేశ్‌లో, గోదావరి బోర్డు ప్రధాన కార్యాలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది.
- కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఈ రెండు బోర్డులు స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటాయి. కాలానుగుణంగా కేంద్రం ఆదేశాలను పాటిస్తాయి.
- ప్రతి బోర్డుకు కేంద్ర సర్వీసుల్లోని కార్యదర్శి/అదనపు కార్యదర్శి స్థాయి అధికారిని కేంద్రం చైర్మన్‌గా నియమిస్తుంది. రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరేసి సభ్యులు ఉంటారు. కేంద్రం తరఫున మరో స్వతంత్ర సభ్యుడు ఉంటారు. ప్రతి బోర్డుకు సీడబ్ల్యూసీ నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి ఫుల్ టైమ్ కార్యదర్శి ఉంటారు.
- డ్యాములు, రిజర్వాయర్లు, హెడ్ వర్క్స్, కెనాల్స్, హైడల్ పవర్ ప్రాజెక్ట్సుకు సంబంధించిన పరిపాలన, నియంత్రణ, నిర్వహణ విధులన్నింటినీ బోర్డులే నిర్వహిస్తాయి. వీటికి ఆయా రాష్ట్రాలే నిధులు కేటాయించాలి
- బోర్డుల సమర్థ నిర్వహణ కోసం కేంద్రం తగిన ఆదేశాలు ఇవ్వొచ్చు. వీటిని రాష్ట్రాలు పాటించాలి
-కృష్ణా, గోదావరి నదుల నీటి కోసం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ఆయా బోర్డులే బాధ్యత వహించాలి
పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ప్రాజెక్టు అనుమతులు, పునరావాస కల్పన, నిర్మాణం బాధ్యతలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది.
సింగరేణి తెలంగాణదే
సింగరేణి బొగ్గుపై యాజమాన్య హక్కులు తెలంగాణకే ఉంటాయి. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంటుంది. సింగరేణితో ఉన్న బొగ్గు లింకేజీలు యథావిధిగా కొనసాగుతాయి. నూతన బొగ్గు పంపిణీ విధానం ప్రకారం కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు బొగ్గును కేటాయిస్తారు. బొగ్గు పంపిణీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న విధివిధానాలు కొనసాగిస్తారు. ఆయిల్, గ్యాస్‌ల పంపిణీలో ప్రస్తుతం ఉన్న విధానాలే కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆయిల్, గ్యాస్ కేటాయింపులు ఉంటాయి. దే శీయ ఆన్‌షోర్‌పై గ్యాస్, ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన రాయల్టీలను ఉత్పత్తి జరిగిన ప్రాంతానికే కేటాయించాలి.
భౌగోళికంగానే విద్యుత్ విభజన
విద్యుత్ ఉత్పాదన కేంద్రాలున్న ప్రాంతాలను బట్టి ఏపీజెన్‌కో యూనిట్స్‌ను విభజించాలి. ఆయా డిస్కంలతో అమలులో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన విధానాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి( ఏపీఈఆర్‌సీ) ఆరు నెలలపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి సంస్థగా కొనసాగుతుంది. ఆ తర్వాత రెండు ప్రాంతాల్లో వేర్వేరు సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్‌డీసీ)లు రెండేళ్లపాటు ఉమ్మడిగానే పనిచేస్తాయి. అప్పటి వరకు ఈ సంస్థ బెంగళూర్ కేంద్రంగా పనిచేస్తోన్న సదరన్ ఆర్ఎల్‌డీసీ నియంత్రణలో ఉంటుంది. ట్రాన్స్‌కోకు చెందిన 132కేవీ, ఇంకా పెద్ద వోల్టేజ్ లైన్లను ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌మిషన్(ఐఎస్‌టీఎస్) లైన్లుగా పరిగణించాలి. వీటి నిర్వహణ ప్రాంతాలను బట్టి ఎవరి పరిధిలో వారే చూసుకోవాలి. రెండు రాష్ట్రాలకు పంపిణీ సంస్థలు ఏర్పడేవరకు ఏపీ ట్రాన్స్‌కో కొనసాగుతుంది. గత ఐదేళ్ల విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్ర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి విద్యుత్‌ను కేటాయిస్తారు. సెంట్రల్ డిస్కం పరిధిలో ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలను సదరన్ డిస్కంలో కలపాలి.
మౌలిక వసతుల కల్పన
సీమాంధ్రలో..
- 2018కల్లా తొలి దశ పూర్తయ్యేలా దుగరాజపట్నం వద్ద మేజర్ పోర్టు నిర్మాణం.
- గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు అంశాన్ని ఐవోసీ/హెచ్‌పీసీఎల్ పరిశీలించాలి
-ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో చెన్నై-వైజాగ్ కారిడార్ ఏర్పాటుకు పరిశీలన
- కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై రైల్వే శాఖ పరిశీలన జరపాలి
-సీమాంధ్ర-తెలంగాణ రాష్ట్రాల రాజధానుల మధ్య వేగవంతమైన రైలు, రోడ్డు రవాణా సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలి.
తెలంగాణలో..
- ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేసే అంశాన్ని సెయిల్ పరిశీలించాలి
- 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఎన్టీపీసీ పరిశీలించాలి
-వెనుకబడిన ప్రాంతాలకు రోడ్డు రవాణా మెరుగుపరిచేందుకు జాతీయ రహదారుల సంస్థ తగిన చర్యలు తీసుకోవాలి
- రైలు మార్గాల అభివృద్ధికి, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై రైల్వే శాఖ పరిశీలన జరపాలి
- హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
జనాభా ప్రాతిపదికన పంపకాలు
పరిశేష ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన పంపకాలు జరుగుతాయి. ప్రభుత్వ ఆస్తులు, అప్పులు, బ్యాంకుల్లోని నగదు నిల్వలు, రుణాల పంపిణీకి ఈ సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోని వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, సంస్థలు, సంఘాలు, కంపెనీలు.. వాటి కేంద్ర కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయనే దాంతో సంబంధంలేకుండా భౌతికంగా, భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటే, విభజన తర్వాతా అక్కడే ఉంటాయి. వాటి కేంద్ర కార్యాలయాల పంపిణీ సైతం ఇరు రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం జరుగుతుంది. ఆస్తులు, అప్పుల పంపిణీ, భౌతికంగా కార్యాలయాల తరలింపు.. ఇరు రాష్ట్రాల పరస్పర అంగీకారం మేరకు జరుపుకోవచ్చు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పింఛన్లు కూడా ఎక్కడ ఎంత మంది ఉన్నారనే సంఖ్య ఆధారంగా రెండు రాష్ట్రాలూ పంచుకోవాల్సి ఉంటుంది. ఒక సంస్థపై తీసుకున్న అప్పును ఆ సంస్థ ఉన్న ప్రాంతానికి చెందిన ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది.
కాంట్రాక్టులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తీసుకున్న అప్పులు మాత్రం జనాభా నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు శాశ్వతంగా ఎక్కడ ఉంటారో.. వారి పీఎఫ్‌కు అక్కడి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. 13వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను కేంద్రం ఇరు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి, ఇతర ప్రమాణాల ప్రకారం అందజేస్తుంది. రెండు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న వనరుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు అందిస్తుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ విషయంలో ఏమైనా వివాదాలు తలెత్తితే కాగ్‌ను సంప్రదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది.
- ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ
 ఉద్యోగుల పంపిణీ ఇలా!
పరిపాలన సజావుగా సాగేందుకు వీలుగా తుది కేటాయింపులు జరిగే వరకూ ప్రస్తుతమున్న ఉద్యోగులందరూ తమ తమ పోస్టుల్లోనే కొనసాగుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను కేటాయించే అధికారం కేంద్రానికి ఉంది. ఈ విషయంలో సాయం చేయడానికి సలహా కమిటీలు వేయొచ్చు. కేటాయింపులు పూర్తయిన తర్వాత కూడా ఎక్కడైనా లోటు ఉన్నట్లయితే ఉద్యోగులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై పంపవచ్చు. లోకల్, జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్‌లకు సంబంధించిన ఉద్యోగులు అపాయింట్ అయిన చోటే ఎక్కడి వారు అక్కడే కొనసాగుతారు. ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన నియమనిబంధనలు ప్రత్యేకంగా విడుదలవుతాయి.
సాధారణంగా సలహా మండలి సిఫారసు మేరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్ తీసుకున్న తర్వాతే వారి బదిలీపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత 30 రోజుల్లోగా సలహా మండలిని కేంద్రం నియమిస్తుంది. అపాయింట్ అయిన రోజు నుంచే అఖిల భారత ఉద్యోగుల కేడర్ల విభజన జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లో పరిపాలన సవ్యంగా సాగేందుకు వీలుగా ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పోరేషన్లు, స్వయంప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులు ఏడాది పాటు ఎక్కడి వారు అక్కడే కొనసాగుతారు. ఈలోగా రెండు రాష్ట్రాలకూ ఉద్యోగుల పంపిణీపై సంబంధిత సంస్థలు కసరత్తు చేస్తాయి
- See more at: http://www.andhrajyothy.com/node/38187#sthash.LnqlYwoS.dpuf

No comments:

Post a Comment