Sunday 29 December 2013

బిల్లుపై చర్చ.. భారత్-పాక్ మ్యాచే

బిల్లుపై చర్చ.. భారత్-పాక్ మ్యాచే

Published at: 30-12-2013 06:19 AM
 New  0  0 
 
 

ప్రజలంతా టీవిలకు అతుక్కుపోతారు
చర్చ కోసం పక్కా ప్రణాళిక సిద్ధం
సీమాంధ్రులకు అన్యాయం, అవమానం
తడిగుడ్డతో కాంగ్రెస్ మా గొంతు కోసింది
పార్టీలో ఇక మాకు భవిష్యత్తు లేదు
మీట్ ద ప్రెస్‌లో సీమాంధ్ర ఎంపీలు
తప్పుల తడక బిల్లును ఆమోదించవద్దు
సభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోండి..
రాష్ట్రపతికి విన్నపం
విభ జన బిల్లు ఏకపక్షం.. ప్రణబ్‌తో సీమాంధ్ర బీజేపీ నేతలు
హైదరాబాద్, డిసెంబర్ 29: 'విభజన బిల్లుపై చర్చ జరగాలి.. లాభ నష్టాలపై నిజానిజాలు ప్రజలకు తెలియాలి' అని కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసిన ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలు పేర్కొన్నారు. మెజారిటీ సభ్యులు బిల్లును తిరస్కరిస్తే విభజనపై రాష్ట్రపతి కూడా ముందుకు వెళ్లరని అభిప్రాయపడ్డారు. తమతో మాట మాత్రమైనా చెప్పకుండా కేంద్రం హఠాత్తుగా నిర్ణయం తీసుకుందని, సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం, అన్యాయాన్ని సహించలేకే రాజీనామాలు చేశామని వివరించారు. వాటిని తిరస్కరించడంతో యూపీఏపై అవిశ్వాస తీర్మానం పెట్టి తిరుగుబాటు చేశామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం చివరివరకూ పోరాడతామని ముక్తకంఠంతో చెప్పారు. ఎవరేమన్నారో వారి మాటల్లోనే...
వాస్తవాలు తెలిసేలా చర్చిద్దాం: ఉండవల్లి అరుణ్‌కుమార్
రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగితేనే ఇరు ప్రాంతాల ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. తద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వీలవుతుంది. అవసరమైతే చర్చకు మరింత సమయం కావాలని రాష్ట్రపతిని అడగవచ్చు. జనవరి 3నుంచి అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరగాలి. మేమేదో తెలంగాణ ప్రజలను దోచేస్తున్నామని అంటున్నారు. బిల్లుపై వివరణాత్మకంగా మాట్లాడితే వాస్తవాలేమిటో వారికి తెలుస్తాయి. ప్రతి సభ్యుడూ.. నేను ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అని మొదలు పెట్టి... అరగంటో, గంటో కారణాలు వివరించాలి. అందుకే బిల్లును వ్యతిరేకిస్తున్నాను అంటూ ముగించాలి. అసెంబ్లీలో మాట్లాడాల్సిన మొత్తం సమాచారం నా వద్ద ఉంది. ఏ సభ్యుడు ఏ అంశంపై మాట్లాడాలో చెబుతాం. దానికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాం. చర్చ మామూలుగా ఉండదు. భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లా ఉంటుంది. ప్రజలంతా టీవీలకు అతుక్కుపోతారు. ఈ ఒక్కసారి పార్టీ భేదాలను పక్కన పెడదాం. జనవరి 23 తర్వాత మళ్లీ తిట్టుకుందాం కానీ ఇప్పుడు మాత్రం మన మధ్య పొరపొచ్చాలు వద్దు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారని మాపై విమర్శలు చేస్తున్నారు. మేం ఎప్పుడూ వేరే పార్టీలోకి వెళ్లలేదు. అప్పట్లో ప్రధాని స్థాయిలో ఇందిరాగాంధీ అనుసరించిన విధానాన్ని, నడిచిన పద్ధతినే మేమూ అనుసరిస్తున్నాం. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌లో మాకు భవిష్యత్తు ఉండదనే పార్టీకి రాజీనామాలు చేశాం. రాష్ట్ర విభజన జరిగితే ఏదో లాభం జరుగుతుందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కానీ విభజనతో సీమాంధ్ర కంటే తెలంగాణే ఎక్కువ నష్టపోతుంది. ఇదే విషయాన్ని మనం అసెంబ్లీలో విపులంగా చెప్పగలగాలి.
చివరివరకూ పోరాటం: రాయపాటి సాంబశివరావు
రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం అన్యాయం. ఎంపీలకు చెప్పకుండా, మమ్మల్ని సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా మారింది. మళ్లీ అక్కడ కాంగ్రెస్ రాదు. నేను అమెరికాలో ఉన్నప్పటికీ అక్కడి నుంచే రాజీనామా పంపించా. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చివరి దాకా పోరాడుతాం. నూటికి నూరుపాళ్లు కృషి చేస్తాం. నిజానికి అధికార పార్టీకి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులే సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 60 శాతం ప్రజలకు రాష్ట్ర విభజన ఇష్టం లేదు. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి మా వంతు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి కూడా ప్రయత్నిస్తారు.
బానిసలం కాదు కాబట్టే తిరుగుబాటు: హర్షకుమార్
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం మమ్మల్ని, సీమాంధ్ర ప్రజలను ఘోరంగా అవమానించింది. మమ్మల్ని బానిసల్లా చూస్తోంది. అందుకే అధిష్ఠానంపై తిరుగుబాటు చేశాం. మాతో కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండా కేంద్రం ఏకపక్షంగా విభజనను చేపట్టింది. అందుకే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాల్సి వచ్చింది. మా పదవులకు రాజీనామా చేస్తే వాటిని ఆమోదించకుండా స్పీకరుపై కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చింది. అధిష్ఠానం విభజన నిర్ణయం తీసుకోవడానికి ముందే రాజీనామాలు చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. నిజానికి విభజన జరుగుతుందని మేం నమ్మలేదు. పత్రికల్లో వస్తున్న కథనాలపై అధిష్ఠానాన్ని అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పింది. సీఎంతో మాట్లాడినప్పుడు కూడా తనకు అలాంటి సమాచారం లేదన్నారు. హఠాత్తుగా ఒక రోజు... రాష్ట్రాన్ని విభజించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలతో దిగ్విజయ్ సింగ్ చెప్పారు. మేం ద్రిగ్భాంతికి గురయ్యాం. అక్కడే ఆయనపై తిరుగుబాటు చేశాం. అధిష్ఠానం మమ్మల్ని మోసం చేసింది. 2004లోనే రాష్ట్ర విభజనకు నేను మద్దతు పలికాను. హైదరాబాద్, నదీ జలాలపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తర్వాత విభజన చేయాలని కోరాను. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగింది. మా పోరాటాన్ని, ఆందోళనను కొందరు డ్రామాలుగా అభివర్ణిస్తున్నా, చివరికి అర్థం చేసుకుంటారు.
కేంద్రానిది రాక్షస క్రీడ: సబ్బం హరి
ప్రజల ఆకాంక్ష మేరకు కాకుండా రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని కేంద్రం విభజిస్తోంది. ఇందులో ఏమాత్రం సందేహ లేదు. దీన్ని అడ్డుకునే ప్రయత్నాలను కేంద్రంసహించలేకపోతుంది. ఇక్కడున్న సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టింది. కేంద్రం ఇంత రాక్షస క్రీడ ఆడనవసరం లేదు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విభజించడం ద్వారా దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని ప్రజలకు ఒక సందేశం పంపాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో 30-50 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని చూస్తోంది. దీనికి ఏపీని పావుగా ఎంచుకుంది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ రెండు మూడేళ్ల క్రితమే ప్రారంభించి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. ఆ చర్చల ప్రక్రియలో సీమాంధ్ర ప్రజలు విడిపోవడానికి సిద్ధ పడి ఉండేవారేమో? లేకపోతే తెలంగాణ ప్రజలు కలిసి ఉండటానికి ఇష్టపడి ఉండేవారేమో? కానీ, ఇందుకు భిన్నంగా ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడం రాజకీయ లబ్ధికోసం కాకపోతే మరేమిటి? అయితే నిజమైన సమైక్యవాదులెవరో, విభజనవాదులెవరో అర్థం కాకుండా ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. లై డిటెక్టర్‌తో అసలైన వారిని గుర్తించే పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
చర్చతోనే తేలుతుంది: లగడపాటి రాజగోపాల్
బిల్లుపై చర్చ జరగాలి. అప్పుడే సమైక్య రాష్ట్రంలో ఎవరు లాభపడ్డారో, ఎవరు నష్టపోయారో తేలుతుంది. అ తర్వాత ఓటింగ్ జరగాలి. మెజారిటీ అభిప్రాయం ప్రకారమే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడిదారుల ఉద్యమంగా సమైక్య ఉద్యమాన్ని అభివర్ణిస్తున్నారు. కానీ, ఇది తెలుగుతల్లి గర్భం నుంచి పుట్టిన ఉద్యమం. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందో లేదో తెలియకపోయినా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు తమ కొంప ముంచారన్న ఆక్రోశం ప్రజల్లో పెల్లుబుకుతోంది. సీమాంధ్రలోనే కాదు, కరీంనగర్, వరంగల్‌లో కూడా కలిసి ఉండాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది. కానీ, విభజనవాదులు దౌర్జన్యంతో అలాంటివారి గొంతు నొక్కేస్తున్నారు.
తడిగుడ్డతో మా గొంతు కోసింది
పార్టీ తీరుపైమీట్ ద ప్రెస్‌లో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల ఆవేదన
(హైదరాబాద్, ఆంధ్రజ్యోతి) ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన దరిమిలా ప్రస్తుతం రాష్ట్రంలో ఎటుచూసినా ఆ బిల్లుపైనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో 'ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం(ఏపీజేఎఫ్)' ఆధ్వర్యంలో ఆదివారం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో 'మీట్ ది ప్రెస్' కార్యక్రమాన్ని నిర్వహించారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలపై ఎంపీల స్పందనలు...
విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు మీ రోడ్ మ్యాప్ ఏంటీ?
ఉండవల్లి: అసెంబ్లీలో చర్చ ముగిసే జనవరి 23 వరకు రోడ్డు లేదు, మ్యాపూ లేదు. అసెంబ్లీలో చర్చను చేపట్టి ఎందుకు విభజన వద్దో సహేతుక కారణాలను ఎమ్మెల్యేలు చూపాలి. మెజారిటీ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తే, ఈ బిల్లుపై రాష్ట్రపతి సుప్రీం కోర్టును సంప్రదిస్తారు.
మీవి డ్రామాలని అంటున్నారు ?
ఉండవల్లి: డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌పార్టీ తడిగుడ్డతో మా గొంతులు కోసింది. విభజన ఆపకపోతే పార్టీలో మాకు భవిష్యత్తు లేదు. మేమంతా ఐక్యంగా ఉండడానికి... అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలిసి చస్తే కదా... !
రాజీనామాలతో విభజనను ఎందుకు ఆపలేకపోయారు ?
ఉండవల్లి: మేం రాజీనామా చేశాం. కొంత మంది చేయలేదు.
విభజన వద్దంటూ వైసీపీ అఫిడవిట్లు ఇచ్చింది... చర్చలో పాల్గొంటే విభజనకు సహకరించినట్లేనని చెబుతోంది.
ఉండవల్లి: అఫిడవిట్లు ఇవ్వడం, కోర్టుల్లో దాఖలు చేయడం కాదు. ముందుగా బిల్లుపై చర్చ జరగాలి, మెజారిటీ సభ్యులు దాన్ని వ్యతిరేకించాలి.
విభజనపై ఎవరి వాదన వారిదే. కానీ ఇరు ప్రాంతాల నేతలు(కేటీఆర్, సీఎం) కరచాలనం చేసుకుంటున్నారు. అసలు సీమాం«ద్రుల సంగతి ఏమిటి ?
లగడపాటి: ఎవరు ఏమిటో ప్రజలకు తెలియడానికే అసెంబ్లీలో చర్చ జరగాలంటున్నాం. విభజన వాదులు అందరిని ద్వేషిస్తారు. సమైక్యవాదులు అందరిని కలుపుకొని పోవాలని చూస్తారు. కేటీఆర్‌తో సీఎం కరచాలనం చేయడాన్ని ఆ విధంగానే చూడాలి. నేను కూడా పార్లమెంటులో కేసీఆర్‌తో కరచాలనం చేశాను.
విభజన తర్వాత కొత్త పార్టీ ఆలోచన ఏమైనా ఉందా ?
రాయపాటి: జనవరి 23 తర్వాత బిల్లు పార్లమెంటుకు వెళితే... కాంగ్రెస్‌లో మా భవిష్యత్తు క్లోజ్ అయినట్లే. విభజన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం.
సరైన సమయంలో సీమాంధ్ర నేతలు స్పందించలేదన్న ఆరోపణలున్నాయి...
రాయపాటి: సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన వెంటనే మా పదవులకు రాజీనామా చేశాం. కానీ స్పీకర్ వాటిని పక్కన పెట్టారు. హైకమాండ్ చెప్పినట్లే స్పీకర్ నడుచుకుంటారు. నందమూరి హరికృష్ణ రాజీనామాను ఆమోదించారంటే ఆయన ప్రతిపక్ష పార్టీ నేత కాబట్టి ఆమోదించారు.
బిల్లుపై చర్చతో తెలంగాణవారికీ న్యాయం జరుగుతుందంటున్నారు ఎలా?
ఉండవల్లి: తెలంగాణవారు మమ్మల్ని వెళ్లిపొమ్మనడం లేదు. బాగో బాగో అంటున్నారు. మా భద్రాచలంను మాకు ఇవ్వండి అని అడిగితే... భద్రాచలం ప్రజలు తెలంగాణతోనే కలిసి ఉంటామంటున్నారని, అందుకే భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందని చెబుతున్నారు. మరి మేం కూడా తెలంగాణతోనే కలిసి ఉంటామని అంటున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నాం. హైదరాబాద్‌ను యూటీ చేస్తే పన్నులు పెరుగుతాయి. రేపు ఇక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు. అందుకే తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేలా యూటీ వద్దని అంటున్నాం.
విభజనపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి, ఇప్పుడు విభజన బిల్లుపై చర్చ జరగాలనడం సరైనదేనా?
లగడపాటి: అన్ని పార్టీలు అంగీకరించాయని చెప్పి బిల్లును పంపారు. కాబట్టి ఇప్పుడు తీర్మానం కాకుండా, బిల్లుపై చర్చ జరగాలని చెబుతున్నాం. చర్చ ద్వారా కరీంనగర్, వరంగల్ ప్రజలను కూడా మార్చుకోగలం. అందరిని మార్చుకోవడానికి చర్చే పరిష్కారం.
సమైక్యవాదమంటే అందరిని దగ్గర చేసుకోవడమని చెబుతున్నారు. తెలంగాణలో వెయ్యి మందికి పైగా ఆత్మబలిదానం చేసుకుంటే వారిని ఎందుకు ఓదార్చలేదు.
లగడపాటి: సిద్ధిపేటలో హరీష్‌రావు మీడియా సాక్షిగా కిరోసిన్ పోసుకుని,అగ్గిపెట్టే కోసం వెతుక్కుంటే, ఆ ఘటన చూసిన కొన్ని గంటల తర్వాత ఎల్‌బీ నగర్‌లో శ్రీకాంత్‌చారి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేర్పాటు వాదులు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఈ కారణంగానే అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
- See more at: http://www.andhrajyothy.com/node/48302#sthash.lDiKy63S.dpuf

No comments:

Post a Comment