Saturday 14 December 2013

మెజారిటీ రాజకీయమే శరణ్యమా? - ఇండియా గేట్

FEB 13
మెజారిటీ రాజకీయమే శరణ్యమా?

 ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన భావజాలానికీ బీజేపీ భావజాలానికీ పెద్ద తేడాలేదన్న అభిప్రాయాన్ని జనంలో కలిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడం. బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ వాదాన్ని కాంగ్రెస్ కూడా అనుసరించాలని కొన్ని సంవత్సరాల క్రితమే గాడ్గిల్ లాంటి సీనియర్ నేతలు వాదించారు... ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మైనారిటీలు ఇతర పార్టీలవైపు మొగ్గు చూప డం, అంతర్జాతీయంగా ముస్లింలు ఆత్మరక్షణలో పడే పరిస్థితులు ఏర్పడడం వల్ల కాంగ్రెస్ మెజారిటీ రాజకీయాలనే అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

2009కీ, 2014కూ తేడా ఏమిటి? 2009లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డ అంశాలు ఇప్పుడు ఉన్నాయా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం అందించగలరా? లోహపురుష్‌గా పేరొందిన అద్వానీ సాధించలేని విజయాన్ని నరేంద్ర మోడీ సాధించగలరా? అన్న చర్చలు రాజకీయ పార్టీల మధ్య, రాజకీయ పరిశీలకుల మధ్య ఎప్పుడో ప్రారంభమయ్యాయి. ఎన్నికలు జరగడానికి ఇంకా దాదాపు 14-15 నెలల సమయం ఉన్నది. కానీ ఈ ఎన్నికలకు సన్నాహాలు ఇప్పటినుంచే ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న అనుమానాలు కూడా రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న సన్నాహాలు చూస్తుంటే నవంబర్‌లోనే ఎన్నికలు జరగవచ్చునన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి ఎన్నికల సన్నాహాలు కాంగ్రెస్ పార్టీయే ముందు ప్రారంభించింది. నవంబర్‌లోనే పార్టీ ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఆంటోనీ నేతృత్వంలో పొత్తులకోసం కమిటీ, అంబికా సోనీ నేతృత్వంలో పార్టీలో సంస్థాగత సంస్కరణల కమిటీ ఏర్పాటయ్యాయి. ఉపాధ్యక్షుడుగా రాహుల్ గాం«ధీని నియమించిఆయన సారథ్యంలో ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పర్చింది. సోనియా నివాసంలోనే కాక, గురుద్వారా రికాబ్‌గంజ్ రోడ్‌లోని వార్ రూమ్‌లోనూ, రాహుల్ గాంధీ తుగ్లక్ రోడ్ నివాసంలోనూ తరుచూ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో ప్రజాహిత రాజకీయాల కన్నా ఎన్నికల రాజకీయాలకు ప్రాధాన్యం ఎక్కువ. అందువల్ల ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నికల ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందనే భావించాలి. అధికారంలోకొచ్చిన మొదటి మూడేళ్లూ పార్టీఖజానాను, తమ స్వంత జేబులను నింపుకోవడంపై దృష్టి కేంద్రీకరించే కాంగ్రెస్ పార్టీ, ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అప్రమత్తమై తదనుగుణంగా వ్యూహరచన చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు వివిధ అంశాలపై చర్చలు జరుపడం, ఓటు బ్యాంక్‌ను పదిలం చేసుకునేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు.

2009 నాటి పరిస్థితికీ, 2014 నాటి పరిస్థితికీ ఎంతో తేడా ఉన్నదన్న విషయం కాంగ్రెస్‌కు తెలుసు. 2004లోనూ, 2009లోనూ కాంగ్రెస్ సంఖ్యాబలంలో ఆంధ్రప్రదేశ్ అధికంగా పాత్ర పోషించింది. 2009లో కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కూడా కాంగ్రెస్ సంఖ్యాబలంలో కీలక పాత్ర పోషించాయి. 2004లో కేరళలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా లేకపోగా 2009లో ఒకేసారి 13 సీట్లు లభించాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ సీట్ల సంఖ్య 4 నుంచి 20కి, ఉత్తరప్రదేశ్‌లో 9 నుంచి 21 సీట్లకూ పెరిగాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం పెరగడం, కొత్త ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడం వల్ల కేంద్రంలో ఫలితాలు ప్రభావితమయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్, ప్రజారాజ్యం, లోక్‌సత్తా, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, డిఎండికె వంటి పార్టీలు కాంగ్రెస్, ఇతరపార్టీల బలాబలాలను ప్రభావితం చేశాయి. వీటన్నిటితో పాటు రుణమాఫీ, నరేగా వంటి పథకాలు కూడా కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి దోహదం చేశాయి.

కానీ ఇప్పుడు, 2009లో దోహదం చేసిన పరిస్థితులు ఏవీ కనపడడం లేదు. ఢిల్లీ, రాజస్థాన్, యుపి, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో గతంలో కంటే స్థానాలు బాగా తగ్గడమే కానీ పెరిగే అవకాశాలు లేవని ఆయా రాష్ట్రాల్లో పరిణామాలను బట్టి అర్థమవుతోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రె స్‌కు సానుకూల ఫలితాలు వస్తాయన్న ఆశ కనబడడం లేదు. మహా అయితే కర్ణాటకలో కొన్ని సీట్లు ఎక్కువ సా«ధించగలదేమో కానీ మిగతా చోట్ల కాంగ్రెస్ ఎక్కడ బలం పుంజుకోగలదు? అన్న ప్రశ్నకు ఆ పార్టీ నేతలే ధీమాగా సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు కుంభకోణాలు, అవినీతి మూలంగా కోల్పోయిన ప్రతిష్ఠ, గతంలో లాగా చెప్పుకోదగిన పథకాలు లేకపోవడం వల్ల కాంగ్రెస్ బాగా దెబ్బతినేందుకే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ పరిస్థితి కాంగ్రెస్‌కు తెలియనిది కాదు కనుకనే అప్రమత్తమై రకరకాల వ్యూహాలను పన్నుతోంది. ఆహారభద్రత, నగదు బదిలీ, రైతులకు రుణమాఫీ, మధ్యతరగతి వర్గాలు, యువకులు, మహిళలు, దళితులు ఇతర వర్గాలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రకటించాల్సిన పథకాలపై దృష్టి కేంద్రీకరించింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ కొత్త జవసత్వాలను పుంజుకుంటుందనే సంకేతాలు అందేందుకు వీలుగా పార్టీలో బృహత్తరమైన సంస్థాగత మార్పులను ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ నిర్ణయాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సమయం కోసం ఎదురుచూస్తున్నది. ఇవన్నీ కొంత మార్పు కు దోహదం చేయవచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన భావజాలానికీ బీజేపీ భావజాలానికీ పెద్ద తేడాలేదన్న అభిప్రాయాన్ని జన ంలో కలిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడం.

బీజేపీ అనుసరిస్తున్న హిం దూత్వ వాదాన్ని కాంగ్రెస్ కూడా అనుసరించాలని కొన్నేళ్ళ క్రితమే గాడ్గిల్ లాంటి సీనియర్ నేతలు వాదించారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీగా అభిప్రాయం ఏర్పర్చడం మంచిదని, కనీసం ఒక మెజారిటీ పార్టీగా వ్యవహరించడం అవసరమని వారు సూచించారు. నిజానికి పైకి ప్రకటించకపోయినప్పటికీ కాంగ్రెస్ మెజారిటీ వర్గాల పార్టీయేనని, లేకపోతే సిక్కుల ఊచకోత లాంటిఘటనలు జరిగే వి కావని వాదించేవారు ఉన్నారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అనిపించుకోవడానికి, ముస్లింల ఓట్లను తమవైపుకు తిప్పుకోవడానికీ వీలుగా చాలా నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ ఇదే బాణీలో కనుక కొనసాగి ఉంటే కసబ్, అఫ్జల్ గురు లాంటి వారి ఉరితీత జరిగేది కాదు. ఈ ఉరితీతలు రాజకీయ నిర్ణయాలేనని ఈ నేపథ్యంలో భావించక తప్పదు.

మరి ఎందుకు కాంగ్రెస్ తన స్వభావానికి భిన్నంగా మెజారిటీ రాజకీయాలను అనుసరించాలని నిర్ణయించింది? ఇందుకు అనేక కారణాలుండవచ్చు. ప్రధానంగా కనపడుతున్నది నరేంద్ర మోడీ నేతృత్వంలో పెద్ద ఎత్తున హిందూత్వ రాజకీయాలను అనుసరించాలని బీజేపీ నిర్ణయించుకోవడం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లోనూ, భారతీయ జనతా పార్టీలోనూ ఎక్కువ మంది నేతలు నరేంద్ర మోడీని జాతీయ స్థాయి రాజకీయాల్లోకి దింపాల్సిన చారిత్రక ఆవశ్యకతను గుర్తించారు. మరోవైపు నరేంద్ర మోడీ కూడా తన ఆకాంక్షలను దాచుకోకుండా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. గుజరాత్‌లో హ్యాట్రిక్ సాధించిన తర్వాత ఆ అభివృద్ధి నమూనాను దేశమంతటా అనుసరించగలననే విశ్వాసాన్ని కల్పించేందుకు ఆయన రకరకాల వేదికలను ఎన్నుకున్నారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ మెతక వైఖరిని అనుసరిస్తున్నదని, దేశానికి నరేంద్ర మోడీ లాంటి గట్టి నాయకుడు కావాలన్న అభిప్రాయాన్ని వ్యాప్తి చేసేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ సర్వయత్నాలు చేస్తున్నాయి.

ఆధునిక ప్రచార సాధనాలను ఎన్నుకున్నాయి. సాధారణంగా మధ్యతరగతిలో అనేకమంది ఈ దేశంలో అస్తవ్యస్తపరిస్థితులు ఏర్పడినప్పుడల్లా సైనిక పాలన వస్తే బాగుండునని, నిరంకుశంగా ఎవరైనా కొద్దిరోజులు పాలిస్తే అన్నీ చక్కబడుతాయని వాదించేవారు కనపడతారు. ఇలాంటి వారే నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని కోరుకోవడం అసహజం ఏమీ కాదు. వీరే కాక మార్పు కావాలని కోరుకునేవారు, కాంగ్రెస్ పట్ల విసిగిపోయిన వారు కూడా మోడీని ఆహ్వానించేందుకు, ఆయన కు ఒకసారి అవకాశం ఇవ్వడానికి సిద్దపడుతున్నారేమో.. అంతేకాక పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలు నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడానికి బాసటగా నిలుస్తున్నాయి.

బహుశా ఈ విషయం గ్రహించినందువల్లే బీజేపీ తరహా రాజకీయాలను తాను కూడా అనుసరించాలని కాం గ్రెస్ భావించడంలో ఆశ్చర్యం లేదు. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మైనారిటీలు ఇతర పార్టీలవైపు మొగ్గు చూప డం, అంతర్జాతీయంగా ముస్లింలు ఆత్మరక్షణలో పడే పరిస్థితులు ఏర్పడడం వల్ల కూడా కాంగ్రెస్ మెజారిటీ రాజకీయాలనే అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నక్సలిజం, ఆదివాసీల ఊచకోత వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ భావజాలానికి పెద్ద తేడా లేదు. ఇక దేశంలో రెండు ప్రధాన పార్టీలు మెజారిటీ రాజకీయాలు అవలంబిస్తే దేశ సామాజిక వాతావరణంలో కీలక మార్పులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ఈ క్రమంలో మీడియా, మేధావుల ఆలోచనా తీరుతెన్నులు, విద్యావిధానం, మధ్యతరగతి భావజాలం పూర్తిగా ప్రభావితమై, కొన్ని మౌలిక అంశాలను కూడా ప్రశ్నించలేని పరిస్థితులు ఏర్పడక తప్పదు. బీజేపీ, కాంగ్రెస్ తమ తమ వ్యూహాల్లో సఫలీకృతం కాకుండా ఉండాలంటే దేశంలో ఇతర పార్టీల ఆలోచనా సరళిలో మార్పు రావల్సి ఉంది. రెండు ఆలోచనల మధ్య మూడో ఆలోచనకు అవకాశం, స్థలం దొరకని పరిస్థితి ఊహించడమే దుర్భరం. కానీ ఈ దేశంలో వివిధ రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య విడిపోవడం, తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు జాతీయ పార్టీలకు అంటకాగక తప్పని పరిస్థితి ఏర్పడడం, ఈ రెండు పార్టీలను అధిగమించగల బలం, సైద్దాంతిక ఐక్యత లేకపోవడం ప్రజల దురదృష్టం.

krishna rao ద్వారా 13th February క్రితం పోస్ట్ చేయబడింది

No comments:

Post a Comment