Monday, 16 December 2013

ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు

ఏపీ పునర్వ్యవస్థీకరణ అను ఈ చట్టము..
 Published at: 17-12-2013 02:06 AM


రాష్ట్ర విభజన బిల్లు సమగ్ర స్వరూపం
పార్ట్-1
ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించుటకు, దానికి అనుబంధమైన విషయములను నిర్ణయించడానికి ఉద్దేశించిన బిల్లు...
భారత ప్రజారాజ్యపు అరవై నాలుగవ సంవత్సరములో పార్లమెంటు ఈ క్రింది శాసనము చేసినది.
భాగం-1
ప్రారంభిక సంగ్రహ నామము
1. ఈ చట్టమును ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము అని పేర్కొనవచ్చును.
నిర్వచనములు
2. ఈ చట్టములో సందర్భమునుబట్టి అర్థము వేరుగా ఉన్ననే తప్ప
) నియమిత తేదీ అనగా, కేంద్ర ప్రభుత్వము అధిసూచన ద్వారా చేసిన నియమిత తేదీ అని అర్థము. (రాష్ట్ర విభజన అమలులోకి వచ్చిన తేదీ)
బి) అధికరణ అనగా రాజ్యాంగంలోని అధికరణ అని అర్థము.
సి) శాసన నియోజకవర్గం, శాసన పరిషత్ నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం అను పదాలు 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కలిగి ఉన్న అర్థములనే కలిగియుండును.
డి) ఎన్నికల కమిషన్ అనగా 324 అధికరణ క్రింద రాష్ట్రపతిచే నియమించబడిన ఎన్నికల కమిసన్ అని అర్థము.
) ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగా నియమిత తేదీకి ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అని అర్థము.
ఎఫ్) నియమిత తేదీకి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకాని రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాంతంలోకాని చట్టం యొక్క శక్తిని కలిగి యున్న శాసనము అధ్యాదేశము నిబంధన నియమము, ఉప నియమము, ఉప నిబంధన అని అర్థము.
జి) నోటిఫైడ్ ఆర్డన్ అనగా అధికారిక గజెట్లో ప్రచురితమైన అధిసూచన.
హెచ్) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి జనాభా నిష్పత్తి అనగా 2011 జనాభా లెక్కల ప్రకారం 58.32:41.68 అని అర్థము.
) పార్లమెంటు లేదా ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సంబంధించి ప్రస్తుత సభ్యులు అనగా నియమిత తేదీకి ఆయా సభలలో ఉన్న సభ్యులు అని అర్థము.
జె) ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు సంబంధించి ఏర్పడు రాష్ట్రం అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రం, ఏది వర్తించినచో అది అని అర్థము.
కె) బదలాయించిన భూభాగము అనగా నియమిత తేదీనాడు ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి బదలాయించిన భూభాగము అని అర్థము.
ఎల్) ట్రెజరీ అని పేర్కొన్నప్పుడు సబ్ ట్రెజరీ కూడా అందులో ఉండును.
ఎమ్) ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జిల్లా, మండలం, తహసీల్, తాలూకా లేదా ఇతర భూ విభాగమునకు సంబంధించి ప్రస్తావన వచ్చినపుడు నియమిత తేదీన ఆ భూభాగంలో ఉన్న ప్రాంతంగా భావించవలెను.
పార్ట్ 2
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన
3) నియమిత తేదీన తెలంగాణ పేరిట ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్లోని కింది భూభాగములు ఉంటాయి.
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలు.
నియమిత తేదీ నుంచి పైన పేర్కొన్న జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉండవు.
4) సెక్షన్ 3లో పేర్కొన్న జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
5. (1) నియమిత తేదీ నుంచి పది సంవత్సరాలకు మించని కాలానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
(2) ఆ కాలపరిమితి తీరిపోయిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పడుతుంది.
వివరణ: ఉమ్మడి రాజధానిలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో నోటిఫై అయిన ప్రాంతాలన్నీ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు నిపుణుల కమిటీ
6) ఏర్పాటు కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అంశంలో ఉన్న వివిధ అంశాలను పరిశీలించి ప్రత్యామ్నాయాలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2013ను ఆమోదించిన 45 రోజుల లోపుల్లో ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై తగిన సిఫారసులు చేస్తుంది.
రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్
7) ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నియమిత తేదీని రాష్ట్రపతి నిర్ణయించినంత కాలం గవర్నర్గా ఉంటారు.
గవర్నర్‌కు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల రక్షణ బాధ్యత
8. (1) ఉమ్మడి రాజధాని ప్రాంతంలో నివసించే ప్రజల భద్రత, స్వేచ్ఛ, ఆస్తులను కాపాడే ప్రత్యేక బాధ్యత గవర్నర్ నిర్వహిస్తారు.
(2) ప్రత్యేకించి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలక ప్రాంతాలు, సంస్థల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపు నిర్వహణలకు గవర్నర్ బాధ్యత వహిస్తారు.
(3) ఈ విధుల నిర్వహణలో, తెలంగాణ రాష్ట్ర మంత్రులను సంప్రదించిన తర్వాత గవర్నర్ తనకు న్యాయమని తోచిన నిర్ణయాన్ని తీసుకొని తగిన చర్యలు తీసుకుంటారు.
వివరణ: ఐతే, ఏ అంశానికి సంబంధించి గవర్నరు వ్యక్తిగతంగా తనకు న్యాయమని అనిపించిన విధంగా చర్యలు తీసుకోవాలి అనే అంశం ఆయన విచక్షణపై ఉంటుంది. వాటిని ప్రశ్నించుటకు వీలు ఉండదు.
(4) గవర్నర్‌కు ఈ విషయాలలో సహకరించటానికి ఇద్దరు సలహాదారులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది
కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పోలీసు దళాల సహకారం
8. (1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమకు అవసరమైన అదనపు పోలీసు బలగాలను సమకూర్చుకోవటంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది.
(2) హైదరాబాద్‌లో ఉన్న గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిత తేదీ నుంచి మూడేళ్ల పాటు నిర్వహిస్తుంది. అప్పటి దాకా ఇది రెండు రాష్ట్రాలకు ట్రైనింగ్ సెంటర్గా ఉంటుంది. ఆ తర్వాత ఇది తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది.
(3) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ కూడా ఇదే విధమైన ఆధునాతమైన శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుంది. ఇది ఎక్కడ నెలకొల్పాలనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయిస్తుంది.
(4) గ్రే హౌండ్స్ ఆపరేషనల్ హబ్స్ను కొత్త రాష్ట్రాలలో ఏర్పాటు చేయటానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్రం చేస్తుంది. ఈ ప్రాంతాలెక్కడ ఉండాలనే విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి
(5) గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లలో పనిచేసే సిబ్బంది అభిప్రాయాలు తీసుకున్న మీదట, వారిని రెండు రాష్ట్రాలకు పంపుతారు. నియమిత తేదీ తర్వాత సిబ్బంది ఆయా రాష్ట్రాల డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆ«ధ్వర్యంలో పనిచేస్తారు.
జూ రాజ్యాంగంలో మొదటి షెడ్యూలు సవరణ
9. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2013 సెక్షన్ 3లో పేర్కొన్న భూభాగాల వివరాలను మొదటి షెడ్యూలులో చేర్చుతూ సవరణ చేస్తారు.
() ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలకు సంబంధించిన పేరాగ్రాఫ్లోని- "ఆంధ్రప్రదేశ్ మరియు మద్రాసు (సరిహద్దుల సవరణ) చట్టం, 1959 అనే పదాల తర్వాత, ఈ కింది వాక్యాలను చేరుస్తారు.. అవి...
"ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2013లోని మూడవ సెక్షన్లో పేర్కొన్న ప్రాంతాలు..''
(బి) 28వ ఎంట్రీ తర్వాత, ఈ కింది వాక్యాలను చేరుస్తారు..
"29. తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2013లో పేర్కొన్న ప్రాంతాలు''
10. నియమిత తేదీ తర్వాత ఈ భాగం నుంచి తొలగించిన అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వ అధికారాలను, ప్రాంతాలను లేదా సరిహద్దులను లేదా జిల్లాలను లేదా రాష్ట్రంలోని ఇతర భౌగోళిక ప్రాంతాలపైన ప్రభావం చూపలేవు.
పార్ట్-3
లెజిస్లేచర్లలో భాగస్వామ్యం

రాజ్యసభ
11. నియమిత తేదీన రాజ్యాంగంలోని నాలుగవ అధ్యాయంలో
() ఎంట్రీ 1లో 18 బదులుగా 11ని చేరుస్తారు
(బి) 2 నుంచి 30 దాకా ఎంట్రీలను 3 నుంచి 31గా మారుస్తారు
(సి) ఎంట్రీ 1 తర్వాత ఈ క్రింది వాక్యాలను చేరుస్తారు
"2. తెలంగాణ.................................7' అని చేర్చవలెను.
12. (1) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది రాజ్యసభ సభ్యులను ఈ చట్టం 1వ షెడ్యూలులో పేర్కొన్నట్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన సీట్లను భర్తీ చేయడానికి ఎన్నికైన సభ్యులుగా భావించవలెను.
(బి) ఈ సభ్యుల పదవికాలంలో మార్పు ఉండదు
లోక్‌సభ
13. నియమిత తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు, తెలంగాణలో 17 సీట్లు ఉంటాయి. దీనికి సంబంధించి- ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని మొదటి షెడ్యూల్ను మారుస్తారు.
14. నియమిత తేదీన పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆదేశాలను- ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని రెండో షెడ్యూల్లో పేర్కొన్నట్లుగా సవరించినట్లు భావించాలి.
15. (1) సెక్షన్ 13 ఆధారంగా నియమిత తేదీన ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యులందరూ తమ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని లోక్సభ సభ్యుల నియోజకవర్గాల సరిహద్దులలో ఏ మాత్రం మార్పు ఉండదు. వారి నియోజకవర్గాల నుంచే లోక్సభకు ఎన్నికయినట్లు భావిస్తారు.
(2) ఈ సభ్యుల పదవీకాలంలో ఎలాంటి మార్పు ఉండదు.
అసెంబ్లీ
16. (1) సబ్ సెక్షన్(2)లోని అధికరణల ఆధారంగా నియమిత తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175, తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉంటాయి.
(2) రాజ్యాంగంలోని 333వ నిబంధన ప్రకారం- ఆయా రాష్ట్రాల గవర్నర్- తమ అసెంబ్లీలకు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి ఒక్కొక్కరిని ప్రతినిధిగా నియమించవచ్చు.
(3) ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని రెండవ షెడ్యూల్లోని "1. రాష్ట్రాలు..'' అనే భాగంలో
(1) మొదటి ఎంట్రీలో 294 సంఖ్యను 175గా మారుస్తారు.
(2) 25 నుంచి 28 ఎంట్రీల నెంబర్లను 26 నుంచి 29గా మారుస్తారు.
(3) 24వ ఎంట్రీ తర్వాత- 25. తెలంగాణ - 119 అనే ఎంట్రీని చేరుస్తారు.
17.(1) 16వ సెక్షన్లోని అధికరణల ఆధారంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో-
తెలంగాణ ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఎన్నికయిన సభ్యులందరూ, తమ నియోజక వర్గాలకు తెలంగాణ ప్రొవిజినల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తారు. నియమిత తేదీ నుంచి వారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యత్వం కోల్పోతారు.
(2) 16వ సెక్షన్లోని అధికరణల ఆధారంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో- ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ నియోజక వర్గాల నుంచి ఎన్నికయిన సభ్యులందరూ, తమ నియోజకవర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రొవిజినల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తారు.
(3) రాష్ట్రం ఏర్పడిన తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ ఏర్పడినట్లు భావించాలి.
18. (1) రాజ్యాంగంలోని అధికరణల ఆధారంగా 119 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులతో నియమిత తేదీన ప్రొవిజినల్ తెలంగాణ అసెంబ్లీని ఏర్పాటు చేస్తారు. సమావేశాలను నిర్వహిస్తారు.
(2) 333వ ఆర్టికల్ ఆధారంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి- తెలంగాణ ప్రొవిజినల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తారు.
(3) రాజ్యాంగం ద్వారా ఒక రాష్ట్ర అసెంబ్లీకి సంక్రమించిన అధికారాలన్నింటినీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి కూడా సంక్రమిస్తాయి.
(4) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రొవిజనల్ అసెంబ్లీల స్థానంలో ఒరిజనల్ అసెంబ్లీలు ఏర్పడతాయి.
19. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఐదేళ్ల కాల పరిమితి... ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఏర్పడిన నాటి నుంచి పరిగణనలోకి తీసుకుంటారు.
సభాపతి, ఉపసభాపతి
20. (1) నియమిత తేదీకి ముందు స్పీకర్గా ఉన్న వ్యక్తి కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్గా కొనసాగుతాడు.
(2) నియమిత తేదీన ఏర్పడే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఇద్దరు సభ్యులను స్పీకర్గాను, డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకోవచ్చు. ఈ లోపులో స్పీకర్ నిర్వర్తించాల్సిన బాధ్యతలను గవర్నర్ నియమించిన వ్యక్తి నిర్వర్తిస్తారు.
21. ఆర్టికల్ 208(1)లోని రూల్స్ ఆధారంగా- నియమిత తేదీ ముందు దాకా ఉన్న శాసన సభ సంప్రదాయాలు, బిజినెస్ రూల్స్- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలలో కూడా కొనసాగుతాయి. ఆ తర్వాత వీటికి ఆయా సభల స్పీకర్లు ఏవైనా మార్పులు కావాలంటే చేయవచ్చు.
శాసన మండళ్లు
22. (1) రాజ్యాంగంలోని 169వ అధికరణ ఆధారంగా- నియమిత తేదీ తర్వాత- 50 మంది సభ్యులు మించకుండా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, 40 మంది సభ్యులకు మించకుండా తెలంగాణ శాసన మండలి ఏర్పడతాయి.
(బి) ఈ శాసన మండళ్లు ఏర్పడే దాకా- ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోని సభ్యులను- ప్రొవిజినల్ శాసనమండలిలలో సభ్యులుగా పరిగణిస్తారు. రాజ్యాంగంలోని నాలుగో షెడ్యూల్ ప్రకారం వీరి సంఖ్యను నిర్ణయిస్తారు.
23 (1). నియమిత తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 50 సీట్లు, తెలంగాణా శాసన మండలిలో 40 సీట్లు ఉంటాయి.
(2) దీనికి తగినట్లుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని
(1) మూడో షెడ్యూల్లో..
() ప్రస్తుతం ఉన్న ఎంట్రీ 1 బదులుగా, ఈ కింది ఎంట్రీని చేరుస్తారు.
1. 2 3 4 5 6 7
"1. ఆంధ్రప్రదేశ్ 50 17 5 5 17 6''
(బి) ఏడో ఎంట్రీ తర్వాత ఈ కింది ఎంట్రీని చేరుస్తారు..
1. 2 3 4 5 6 7
..7ఏ తెలంగాణ 40 14 3 3 14 6''
(11) నాలుగో షెడ్యూల్లో 'తమిళనాడు' అనే శీర్షిక కింద ఉన్న ఎంట్రీలు తర్వాత ఈ కింద శీర్షికను ఎంట్రీలను చేరుస్తారు..
'తెలంగాణ..
1. మున్సిపల్ కార్పొరేషన్లు
2. మున్సిపాలిటీలు
3. నగర్ పంచాయితీలు
4. కంటోన్‌మెంట్ బోర్డులు
5. జిల్లా పరిషత్తులు
6. మండల్ ప్రజా పరిషత్తులు
24) మూడో షెడ్యూల్లో పేర్కొన్న విధంగా, ఆంధ్రప్రదేశ్ డీలిమిటేషన్ ఆర్డర్- 2006ను సవరించినట్లు భావించవచ్చు.
25) నియమిత తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, తెలంగాణ శాసనమండలిలు- ఒకొక్కరిని ఛైర్మన్గా ఎన్నుకుంటాయి.
నియోజకవర్గాల పునర్ విభజన
26. (1) సెక్షన్ 16లోని అధికరణలను సవరించడానికి ఎన్నికల కమిషన్ ఈ కింది చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది.
() రాజ్యాంగంలోని అధికరణల ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలలో ఎస్సీ, ఎస్టీలకు సీట్లను కేటాయించాలి.
(బి) క్లాజ్ ()లో పేర్కొన్న విధంగా అసెంబ్లీ నియోజక వర్గాలలోని ఎస్సీ, ఎస్టీల సీట్లను కొనసాగేలా చూడాలి.
(సి) ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాల సరిహద్దులను మార్చే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి.
(2) బి, సి క్లాజుల్లో ఉన్న అంశాలను నిర్ణయించే సమయంలో ఎన్నికల కమిషన్ ఈ కింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
() ఈ నియోజకవర్గాలన్నీ ఏకసభ్య నియోజకవర్గాలే కావాలి.
(బి) అన్ని నియోజకవర్గాలు భౌగోళికంగా తగిన విధంగా ఉండాలి. వాటి భౌగోళిక స్వరూపాన్ని, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లను పరిగణనలోకి తీసుకొని డీలిమిటేషన్ చేయాలి.
(సి) సాధారణ జనాభాతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే ఎస్సీ, ఎస్టీ సీట్లను కేటాయించాలి.
(3) ఎన్నికల కమిషన్ సబ్ సెక్షన్ (1) కింద ఐదుగురు సభ్యులను రాష్ట్ర అసెంబ్లీలో అసోసియేట్ సభ్యులుగా నియమించవచ్చు. అయితే, ఈ ఐదుగురికి ఓటు హక్కు ఉండదు.
(4) అసోసియేట్ సభ్యులు చనిపోయినా, రాజీనామా చేసినా తద్వారా ఏర్పడే ఖాళీని సబ్ సెక్షన్ (3)లోని అధికరణ ఆధారంగా భర్తీ చేయాలి.
(5) ఎన్నికల కమిషన్ ఏం చేయాలంటే...
() డీలిమిటేషన్కు సంబంధించిన ప్రతిపాదనలను వాటి డిసెంట్ నోట్లతో సహా అధికారిక గెజిట్లో ప్రకటించాలి.
(బి) దీనికి సంబంధించిన సూచనలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి.
(సి) వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించి దానిని అధికారిక గెజిట్లో ప్రకటించాలి.
ఒకసారి ఆ వి«ధంగా ప్రకటించిన తర్వాత దానికి చట్టబద్ధంగా హక్కులు అన్నీ లభిస్తాయి. దీనిని ఏ కోర్టులోనూ ప్రశ్నించటానికి వీలు ఉండదు
(6) అధికారిక గెజిట్లో ప్రకటించిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఆర్డర్ను సంబంధిత అసెంబ్లీల ముందు ఉంచాలి.
27. (1) ఎన్నికల కమిషన్ సమయానుకూలంగా నోటిఫికేషన్ ద్వారా అధికార గెజిట్లో...
() సెక్షన్ 26 ఆధారంగా లభించిన అధికారాల ఆధారంగా ప్రింటింగ్ తప్పులు కాని ఇతర తప్పులనుకాని సరిదిద్దవచ్చు.
(బి) ఒక ప్రాంత సరిహద్దులను మారిస్తే వాటిని ఎప్పటికప్పుడు గెజిట్లో ప్రకటించే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి.
(2) ఈ సెక్షన్ కింద జారీ చేసిన ప్రతి నోటిఫికేషన్ను వెంటనే సంబంధిత అసెంబ్లీల ముందు ఉంచాలి.
షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు
28. నియమిత తేదీన, ఈ చట్టంలోని ఐదో షెడ్యూల్డ్లో పేర్కొన్న విధంగా రాజ్యాంగం (షెడ్యుల్డ్ కులాలు) ఆర్డర్, 1950 సవరించినట్లుగా భావించాలి.
29. నియమిత తేదీన, రాజ్యాంగలోని ఆరో షెడ్యూల్డ్లోని రాజ్యాంగం (షెడ్యుల్డ్ తెగలు), 1950 సవరించినట్లుగా భావించాలి.
పార్ట్ -4
హైకోర్టు 30 (1). నియమిత తేదీన...
() ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యాంగంలోని 214 ఆర్టికల్ ద్వారా హైకోర్టు ఏర్పడే వరకూ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైకోర్టుగా కొనసాగుతుంది.
(బి) ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టులో ఉన్న జడ్జీలందరూ అపాయింటెడ్ తేదీ తర్వాత ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా కొనసాగుతారు.
(2) ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన అలవెన్స్లు, వేతనాలను- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన భరిస్తాయి.
31 (1). సెక్షన్ 30లోని అధికరణల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తారు. దీనిని 'హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్' అని పిలుస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టుగా మారుతుంది. దీనిని 'హైకోర్టు ఆఫ్ హైదరాబాద్' అని పిలుస్తారు.
(2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉండాలనే విషయాన్ని రాష్ట్రపతి తన ఆదేశాల ద్వారా తెలియజేస్తారు.
(3) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న ప్రాంతం కాకుండా హైకోర్టు పరిధిలోకి వచ్చే డివిజన్ కోర్టులు, జడ్జీలు ఎక్కడ ఉండాలనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన ఆదేశాల ద్వారా తెలియజేస్తారు.
32 (1) హైదరాబాద్ హైకోర్టుకు చెందిన ఎవరెవరు జడ్జీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన తర్వాత జడ్జీలుగా ఉండాలనే విషయాన్ని రాష్ట్రపతి తన ఆదేశాల ద్వారా తెలియజేస్తారు.
(2) సబ్‌సెక్షన్ (1) ఆధారంగా ఆంధప్రదేశ్ హైకోర్టుకు జడ్జిలయిన వారు.. వారి అపాయింట్మెంట్ల ప్రాతిపదికన హైదరాబాద్ హైకోర్టుకు జడ్జిలుగా నియమితులవుతారు.
33. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు- హైదరాబాద్ హైకోర్టు పరిధిలోని ప్రాంతాన్నింటిపైన అధికారాలు ఉంటాయి. జ్యూరిస్డిక్షన్ కూడా ఉంటుంది.
34.(1) "అడ్వకేట్స్ యాక్ట్, 1961లోని సెక్షన్ 30లోని సబ్ సెక్షన్1లో క్లాజ్ ()లో ఉన్న 'రాజస్థాన్, ఉత్తరప్రదేశ్' పదాలను 'రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్'లుగా మారుస్తారు.
(2) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉండి, హైదరాబాద్‌లోని హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న అడ్వకేట్లు రాష్ట్రం ఏర్పడిన ఏడాది లోపులో తమ పేరు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు బదిలీ చేయించుకోవచ్చు. ఆ ఆప్షన్ను ఇచ్చిన తేదీ నుంచి ఆయన పేరును బదిలీ చేసినట్లు భావించవచ్చు.
(3) ఆర్టికల్ 30 సబ్సెక్షన్ (1) కింద- ఈ విధంగా బదిలీ కాకుండా హైదరాబాద్ హైకోర్టులో కానీ, సబార్డినేట్ కోర్టుల్లో కానీ ప్రస్తుతం ప్రాక్టీసు చేస్తున్న అడ్వకేట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సబార్డినేట్ కోర్టుల పరిధిలోకి వస్తారు.
(4) సెక్షన్ 30లోని ఒకటవ సబ్ సెక్షన్ కింద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రైట్ ఆఫ్ ఆడియన్స్గా ఉన్న హక్కులన్నీ హైదరాబాద్ హైకోర్టులో రైట్ ఆఫ్ ఆడియన్స్గా కొనసాగుతాయి.
35. హైదరాబాద్ హైకోర్టులో ప్రస్తుతం పాటిస్తున్న సంప్రదాయాలు, విధివిధానాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కొనసాగుతాయి. తమకు సంబంధించిన అంశాలపై తగిన విధివిధానాలను ఏర్పాటు చేసుకొనే హక్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఉంటుంది.
36. ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టు కస్టడీలో ఉన్న సీల్ ఆఫ్ హైకోర్టు, తగిన మార్పులతో ఆంధ్రప్రదేశ్ సీల్ ఆఫ్ హైకోర్టుగా కూడా కొనసాగుతుంది.
37. ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టులో కొనసాగుతున్న రిట్ విధానాలు, ఇతర సంప్రదాయాలు తగిన మార్పులతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కొనసాగుతాయి.
38. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర జడ్జీలు, డివిజన్ కోర్టు జడ్జీలకు ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టులో ఉన్న అధికారాలన్నీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కొనసాగుతాయి.
39. సుప్రీం కోర్టుకు చేసే అప్పీళ్ల విషయంలో ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టుకు ఉన్న అధికారాలన్నీ ఆంధప్రదేశ్ హైకోర్టులో కూడా కొనసాగుతాయి.
40. (1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇకపై హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్కు ఎటువంటి జ్యూరిస్డిక్షన్ ఉండదు.
(2) హైకోర్టు ఆఫ్ హైదరాబాద్లో పెండింగ్లో ఉన్న కేసులన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి పరిశీలించిన మీదట, వాటి ప్రాంతాలు, ఇతర అంశాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయటం జరుగుతుంది.
(3) ఆ తర్వాత హైదరాబాద్లోని హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఒకరి జ్యూరిస్డిక్షన్ పరిధిలోని అంశాలు మరొకరు కలగజేసుకొనే హక్కు ఉండదు.
(4) హైదరాబాద్‌లోని హైకోర్టు జారీ చేసే ఆదేశాలు...
() ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సబ్ సెక్షన్ (2) కింద జారీ చేసే ప్రొసీడింగ్స్
(బి) సబ్సెక్షన్ (3) ఆధారంగా హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్లో మిగిలిపోయిన కేసులలో
హైదరాబాద్ హైకోర్టు ఆదేశాలుగా మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలుగా కూడా పరిగణించాల్సి ఉంటుంది.
41. హైదరాబాద్‌లోని హైకోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్ ఆంధప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత- ఆ కేసులకు సంబంధించి- హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీసు చేసే అడ్వకేట్లు, ఇతరులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హాజరు కావటానికి వీలుంటుంది.
42. సెక్షన్ 40కి వివరణ
() అన్ని అపీళ్లు, సుప్రీం కోర్టుకు వెళ్లటం కోసం చేసే అపీళ్లు, రివ్యూ అప్లికేషన్లు, రివిజన్ పిటిషన్లు, రిట్ పిటిషన్లు ఈ కోర్టుల్లో పరిష్కారమయ్యే వరకూ కోర్టుల్లో పెండింగ్ ఉన్నట్లే భావించాలి.
(బి) కోర్టుల్లో జడ్జీలు చేసిన రిఫరెన్స్లను రిఫరెన్స్లుగాను, తీర్పులను లేదా డిక్రీలను తీర్పులు, డిక్రీలుగా భావించాలి.
43. లెజిస్లేచర్ కానీ, మరే ఇతర అధికారం ఉన్న సంస్థ కానీ చేసే ప్రొవిజన్లు ఆంధప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేయవు.
పార్ట్ -5
వ్యయ అధికారాలు, రెవెన్యూ పంపకాలు
44. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు తెలంగాణ సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి సొమ్మును ఖర్చు పెట్టడానికి అనుమతి ఇవ్వచ్చు. కానీ, ఈ వ్యయం ఆరు నెలలకు మాత్రమే ఉండాలి. దీనిని నియమిత తేదీ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఆమోదించాలి. నియమిత తేదీ తర్వాత తెలంగాణ గవర్నర్ ఆరు నెలలకు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వ్యయానికి అనుమతి ఇవ్వవచ్చు.
45. (1) ఆర్టికల్ 151లోని రెండో సబ్సెక్షన్కు సంబంధించి- ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను- రెండు రాష్ట్రాల గవర్నర్లకు సమర్పించాల్సి ఉంటుంది. వాటిని ఆయా రాష్ట్రాల గవర్నర్లు తమ అసెంబ్లీకి సమర్పిస్తారు.
(2) రాష్ట్రపతి ఈ కింది అంశాలలో ఆదేశాలు జారీ చేయవచ్చు..
(1) సబ్ సెక్షన్ (1)లో పేర్కొన్న విధంగా- అపాయింటెడ్ తేదీకి ముందుగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పెట్టిన ఖర్చులకు అనుమతి జారీ చేయవచ్చు.
(బి) దీనికి సంబంధించి తలెత్తే అంశాలను పరిష్కరించవచ్చు.
46. (1) 13వ ఆర్థిక సంఘం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మొత్తాన్ని రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన, ఇతర సూచికల ఆధారంగా విభజించి ఇవ్వాలి.
(2) కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వనరులను పరిశీలించిన మీదట ఆ రాష్ట్రానికి తగినన్ని నిధులను కేటాయించాలి.
పార్ట్ - 6
ఆస్తులు, అప్పుల పంపకాలు
- 47(1). ప్రస్తుత ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆస్తులను ఏ విధంగా విభజించవచ్చనే విషయాన్ని ఈ భాగంలో వివరించటం జరుగుతుంది.
(2) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన అప్పులను రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే విధానాల ఫలితంగా వచ్చిన లాభాలను కూడా పంచుకోవాల్సి ఉంటుంది.
(3) ఈ ఆస్తులు, అప్పులను న్యాయబద్ధంగా రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది.
(4) ఈ విషయాలలో తలెత్తే వివాదాలను రెండు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. అది వీలు కాకపోతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనూ, కాగ్ సలహాతోనూ పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
48. (1) ఉన్న భూమి, స్టోర్‌లో ఉన్న సరుకులు, మిగిలిన వస్తువుల విషయంలో...
() తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ ఆ రాష్ట్రానికే చెందుతాయి.
(బి) సహజంగానే మిగిలినవన్నీ ఆంధప్రదేశ్కు చెందుతాయి.
ప్రస్తుత ఆంధప్రదేశ్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులన్నింటినీ జనాభా ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ వస్తువుల విషయంలో ఏదైనా వివాదం చెలరేగితే దానిని కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాల ఆధారంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
(2) కొన్ని ప్రత్యేకమైన సంస్థలు, వాటి కోసం ఏర్పాటు చేసిన స్టోర్స్, నిర్మాణంలో ఉన్న భవంతులు మొదలైనవన్నీ ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆ ప్రాంతానికే చెందుతాయి.
(3) సెక్రటేరియట్‌లోనూ, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అధీనంలో ఉన్న స్టోర్స్లోనూ వస్తువులు జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు చెందుతాయి.
(4) ఈ సెక్షన్లో భూమి, అంటే భవంతులుసహా స్థిర సంపద అని, వస్తువులు అంటే కరెన్సీ, నాణేలు, ఇతర బ్యాంక్ నోట్లు కాకుండా అని.
49. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలలో ఉన్న బ్యాలెన్సులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఉన్న క్రెడిట్ బ్యాలెన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకుల్లో ఉన్న బ్యాలెన్స్లన్నింటినీ రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంచాలి. ఈ విధంగా పంచటానికి- క్యాష్ బ్యాలెన్స్ను ఒక ట్రెజరీ నుంచి మరొక ట్రెజరీకి బదిలీ చేయాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు రాష్ట్రాలకు చెందిన పుస్తకాలలో ఉన్న బ్యాలెన్స్లను వీటి బదులుగా వాడుకోవాలి. నియమిత తేదీనాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెలంగాణ రాష్ట్రానికి అకౌంట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ద్వారా నడచుకోవాలి.
50. ఆస్తులు ఎక్కడ ఉన్నాయనే అంశం ఆధారంగానే ట్యాక్స్లను, ఆస్తి పన్నులను, బకాయిలను వసూలు చేసుకోవాలి. బకాయిలను వసూలు చేసుకునే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉంటుంది.
51. (1) స్థానిక సంస్థలకు, సొసైటీలకు, వ్యక్తులకు ఇచ్చిన సొమ్మును వసూలు చేసుకొనే బాధ్యత కూడా ఆ ప్రభుత్వానికే ఉంటుంది.
(2) నియమిత తేదీ ముందు ఇతర రాష్ట్రాలలో సంస్థలకు ఇచ్చిన అప్పులను వసూలు చేసుకొనే హక్కు ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుంది. అయితే, ఆ విధంగా వసూలు చేసిన మొత్తాన్ని జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది.
52. (1) ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లో కానీ, సెక్యూరిటీలు కానీ, వేరే ఇతర ఫండ్స్లోకానీ ప్రస్తుత ఆంధప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులను రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలి. విపత్తుల నివారణ నిధి కింద ఉన్న నిధులను మాత్రం భౌగోళిక ప్రాంతాల ఆధారంగా పంచుకోవాలి.
(2) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం- ప్రత్యేక ఫండ్ విషయంలోకానీ, స్థానికంగా పెట్టిన పెట్టుబడులు కానీ భౌగోళిక ప్రాంతం ఆధారంగా పంచుకోవాలి.
(3) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం- ప్రైవేట్, వాణిజ్య సంస్థల్లో పెట్టుబడులు పెడితే వాటిని జనాభా ఆధారంగా పంచుకోవాలి. ఒక వేళ అవి బహుళ యూనిట్ల రూపంలో ఉన్న వాటిని జనాభా ఆధారంగా పంచుకోవాలి.
(4) కేంద్రం లేదా రాష్ట్ర చట్టాల ఆధారంగా ఏర్పడిన సంస్థల్లో పెట్టిన పెట్టుబడులుగానీ, ఇతర రాష్ట్ర్లాలతో కలిపి పెట్టిన పెట్టుబడులుగానీ ఉంటే వాటిని రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంటుంది.
53. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వాణిజ్య లేదా కమర్షియల్ అండర్ టేకింగ్స్కు సంబంధించిన ఆస్తులు, అప్పులు- ఆ సంస్థలు ఉన్న ప్రాంతాల రాష్ట్రాలకు చెందుతాయి. ఆ సంస్థ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందనే విషయంతో సంబంధం లేకుండా ఈ పంపకం జరుగుతుంది. ఒకవేళ ఇతర రాష్ట్రాలతో కలిపి ప్రారంభించిన అండర్టేకింగ్స్ ఉంటే...
() అవి ఏ ప్రాంతంలో ఉన్నాయనే అంశంపై ఆధారపడి వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవాలి.
(బి) జనాభా నిష్పత్తి ఆధారంగా ఆ సంస్థల కేంద్ర కార్యాలయాలను విభజించాలి.
(2) ఆస్తులు, అప్పులను పంచుకున్న తర్వాత- వాటిని భౌతిక రూపంలో కానీ, ఇరు రాష్ట్రాలకు అంగీకారయోగ్యమైన మార్గంలో కానీ, ఆయా ఆస్తులకు వెల చెల్లించే పద్ధతిలో కానీ- బదిలీ చేయాలి.
54. (1) పబ్లిక్ డెట్ (రుణం) అండ్ పబ్లిక్ అకౌంట్లోని అన్ని అప్పులు- రెండు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ఆధారంగా పంచాలి.
(2) రెండు రాష్ట్రాలకు పంచే అప్పులు, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రం చెల్లించాల్సిన సొమ్ము మొదలైన అంశాలపై కేంద్ర ప్రభుత్వం కాగ్ సలహా మేరకు ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పటి దాకా పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్లోని అప్పులన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొనసాగుతాయి.
(3) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి తీసుకున్న అప్పులు- ఏ ప్రాంతంలో కార్యకలాపాలకై ఖర్చు పెడుతున్నారో- ఆ రాష్ట్రాలకే చెందుతాయి.
(4) కొన్ని సంస్థలకు ప్రత్యేకంగా ఇవ్వటం కోసం ప్రభుత్వం తీసుకున్న అప్పుల విషయంలో...
() స్థానిక సంస్థలకు లేదా కార్పొరేషన్లకు ఇస్తే- ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రానికే అవి చెందుతాయి.
(బి) ఒకవేళ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు తీసుకొని దానిని ఒక సంస్థకు ఇచ్చినప్పుడు- అది అది రెండు రాష్ట్రాలకు చెందినది అయితే- మిగిలిన ఆస్తులను, అప్పులను ఏ విధంగా పంచుకున్నారో- ఈ అప్పును కూడా అదే విధంగా పంచుకోవాల్సి ఉంటుంది.
5. ఏదైనా రుణం కోసం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ష్రింకింగ్ ఫండ్ కానీ, డిప్రీసియేషన్ ఫండ్ కానీ నిర్వహిస్తూ ఉంటే-దానిని కూడా ఆస్తులు, అప్పులు ఏ విధంగా పంచుకున్నారో అదే విధంగా పంచుకోవాల్సి ఉంటుంది.
6. ఈ భాగంలో ప్రభుత్వ సెక్యూరిటీ అంటే- ప్రజల దగ్గర నుంచి రుణం సేకరించటం కోసం- 1944 ప్రజా రుణం చట్టంలోని క్లాస్ 2లోని సబ్క్లాజ్ (2) ఆధారంగా జారీ చేసిన, లేదా రూపొందించిన సెక్యూరిటీ అని అర్థం.
55. ఫ్లోటింగ్ రుణం
స్థానిక సంస్థలకు, కార్పొరేషన్లకు లేదా మరే ఇతర సంస్థలకు స్వల్పకాలిక రుణాలు ఇవ్వటం కోసం ప్రభుత్వం రుణాలను సేకరించి ఉంటే వాటిని కిందివిధంగా తీర్చాలి.
() ఒక ప్రత్యేక ప్రాంతం గురించి తీసుకుంటే దానిని ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రమే భరించాలి.
(బి) మిగిలిన కేసులన్నింటిలోనూ, జనాభా నిష్పత్తి ఆధారంగా తీర్చాలి.
56. ఎక్కువగా సేకరించిన ట్యాక్సులను తిరిగి ఇవ్వటం
(1) భూమి పన్ను లేదా భూమికి సంబంధించిన ఇతర ట్యాక్సులను తిరిగి చెల్లించాల్సి ఉంటే- ఆ భూమి ఏ ప్రాంతంలో ఉందో దాని ఆధారంగా- ఆ రాష్ట్రానికి కేటాయించాలి. మిగిలిన పన్నులన్నింటినీ జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య పంచాలి.
(2) ఎక్కువగా సేకరించిన ట్యాక్సులు- జనాభా నిష్పత్తి ఆధారంగా పంచాలి
57. డిపాజిట్లు
(1) సివిల్ డిపాజిట్లు, స్థానిక డిపాజిట్లపై ఉన్న అప్పులు ఆయా ప్రాంతాలు ఏ రాష్ట్రంలో ఉంటాయో వాటికే చెందుతాయి.
(2) చారిటబుల్ మరియు ఎండోమెంట్స్కు సంబంధించి రుణాలు- ఆ ప్రాంతాలు ఏ రాష్ట్రానికి చెందుతాయో, ఆ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. ఒక వేళ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తమంతా ఈ సంస్థల బ్రాంచీలు ఉంటే జనాభా ప్రాతిపదికన వీటిని పంచాల్సి ఉంటుంది.
58. ప్రావిడెంట్ ఫండ్
ప్రభుత్వ సిబ్బంది ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ను- ఒక వ్యక్తి శాశ్వతంగా ఏ రాష్ట్రానికి చెందుతారో- ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి.
59. పెన్షన్లు
ఈ బిల్లులోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పింఛన్లను విభజించుకోవాల్సి ఉంటుంది.
60. కాంట్రాక్టులు
(1) అపాయింట్ తేదీ ముందు ప్రభుత్వం ఏవైనా కాంట్రాక్టులను కుదుర్చుకుంటే...
() ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి చెందినదైతే- ఆ ప్రాంతానికి చెందిన ప్రభుత్వమే దానిని అమలు చేయాల్సి ఉంటుంది.
(బి) మిగిలిన కాంట్రాక్టులన్నీ రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన రీతిలో కానీ, జనాభా ప్రాతిపదికన కానీ విభజించుకోవాలి.
(2) కాంట్రాక్టు వల్ల వచ్చే నష్టాలలో ఈ కింది అంశాలను కూడా చేర్చాలి..
() ఈ కాంట్రాక్టుకు సంబంధించి ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇచ్చే అవార్డు లేదా తీర్పు వల్ల కలిగే నష్టం.
(బి) ఈ ప్రొసీడింగ్స్కు అయ్యే ఖర్చు లేదా దాని వల్ల కలిగే నష్టం.
(3) రుణాలు, గ్యారంటీలు ఇతర ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి విషయాలను ఈ భాగంలో పేర్కొనటం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్లు, సెక్యూరిటీల వంటి ఒప్పందాలకు సంబంధించిన అంశాలను వాటికి సంబంధించిన అధికరణలలో పేర్కొంటారు.
61. తప్పుడు చర్యలు తీసుకోవటం వల్ల కలిగే రుణాలు
కాంట్రాక్టులను ఉల్లంఘించటం కాకుండా మరే ఇతర తప్పుడు చర్యల వల్ల ఏర్పడే రుణాలను..
() ఒక ప్రాంతానికి చెందినవైతే, ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందో దానికి చెందుతాయి.
(బి) మిగిలిన అంశాలన్నింటినీ జనాభా ప్రాతిపదికన పరిష్కరించుకోవాలి.
62. గ్యారంటీలు
రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీకి కానీ, మరే ఇతర వ్యక్తికి కానీ గ్యారంటీ ఇవ్వటం వల్ల కలిగే అప్పులను..
() ఆ సంస్థ లేదా వ్యక్తి కార్యకలాపాలు ఏ ప్రాంతానికి చెందుతాయో- ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రం భరించాల్సి ఉంటుంది.
(బి) మిగిలిన కేసులన్నింటిలోను జనాభా నిష్పత్తి ఆధారంగా పంపకాలు జరపాల్సి ఉంటుంది. లేదా రెండు రాష్ట్రాలకు ఆమోదకరమైన రీతిలో వీటిని పరిష్కరించుకోవాలి.
63. సస్పెన్స్ ఐటమ్స్ (అనిశ్చిత స్థితిలో ఉన్న అంశాలు)
ఈ భాగంలో ఉన్న ఆస్తులు లేదా అప్పులను ప్రభావితం చేసే విధంగా ఈ సస్పెన్స్ ఐటమ్లు ఉంటే, ఆ అధికరణల ఆధారంగా వాటిని పరిష్కరించాలి.
64. రెసిడ్యురీ ప్రొవిజన్
పైన పేర్కొన్న ప్రొవిజన్లకు చెందకుండా ఉన్న అంశాలన్నీ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయి. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు ఆమోదకరమైన రీతితో వాటిని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. లేదా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి.
65. ఒప్పందం ద్వారా ఆస్తులు, అప్పుల పంపకం
ఈ పార్ట్లో పేర్కొన్న అధికరణలకు చెందకుండా ఉన్న ఆస్తులు లేదా అప్పులకు సంబంధించిన అంశాలన్నింటినీ రెండు రాష్ట్రాలకు ఆమోదకరమైన రీతిలో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
66. కేంద్ర ప్రభుత్వ అధికారాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు- ఏవైనా అప్పులకు సంబంధించిన అంశాలపై మూడేళ్ల లోపు అన్నింటినీ పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ అది వీలుకాని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
67. కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా చెల్లింపు
ఈ భాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాలు చెల్లించాల్సిన మొత్తాలలో కొంత భాగాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ద్వారా కానీ ఆ రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా కానీ చెల్లించవచ్చు.
పార్ట్-7
కార్పొరేషన్లకు, కంపెనీలకు సంబంధించిన అధికరణలు
68 (1). ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న కంపెనీలు, కార్పొరేషన్లు ప్రస్తుతం ఉన్న ప్రాంతాలలోనే కార్యకలాపాలను కొనసాగిస్తాయి.
(2) ఈ కంపెనీల ఆస్తులు, హక్కులు, అప్పులు సెక్షన్ 53లో పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాలకు పంచటం జరుగుతుంది.
69. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు, నీటి సరఫరా
విద్యుత్ ఉత్పత్తి లేదా సరఫరా, నీటి సరఫరాకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలతో సంప్రదించిన తర్వాత అవసరమైన ఆదేశాలను ఇస్తుంది. రాష్ట్రాలు వీటిని అనుసరించాల్సి ఉంటుంది.
70. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్
(1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రస్తుతం ఏయే ప్రాంతాల్లో పనిచేస్తోందో ఆ ప్రాంతాలలోనే కార్యకలాపాలను కొనసాగిస్తుంది. దీనికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేస్తుంది.
(2) కార్పొరేషన్‌కు సంబంధించిన సబ్సెక్షన్ (1) ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలు- ఆ ఆదేశంలో పేర్కొన్న విధంగా ప్రభావం చూపుతాయి.
(3) కేంద్ర ప్రభుత్వానికి ముందస్తుగా తెలియజేయటం ద్వారా కార్పొరేషన్ బోర్డు ఆఫ్ డైరక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ను రద్దు చేయటం, ఆయా రాష్ట్రాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేయటం, ఆస్తులు, హక్కులు, అప్పులను బదిలీ చేయటం మొదలైన అంశాలను మెజారిటీ షేర్ హోల్డర్స్ ఒక స్కీమ్ ద్వారా ఆమోదిస్తే, దానిని కేంద్ర ప్రభుత్వానికి ముందుగా సమర్పించాలి.
(4) ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్కు, మార్పులు చేసి కానీ, చేయకుండా కానీ ఆమోదిస్తే అది అప్పుడు అమలులో ఉన్న చట్టాల ఆధారంగా అమలులోకి వస్తుంది. దీనికి షేర్హోల్డర్స్, క్రెడిటార్స్ కూడా దీనికి బద్ధులై ఉండాల్సి ఉంటుంది.
(5) ఒకవేళ ఆ స్కీమ్ను ఆమోదించకపోతే, కేంద్ర ప్రభుత్వం దానిని ఆంధ్రప్రదేశ్ హైకోరు ప్రధాన న్యాయమూర్తి లేదా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన జడ్జికి సమర్పించటం జరుగుతుంది. దీనిపై జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని కార్పొరేషన్ అమలు చేయాల్సి ఉంటుంది.
(6) ఈ భాగంలోని అధికరణలు- రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ యాక్ట్, 1951 కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానీ, తెలంగాణ రాష్ట్రంగానీ ప్రత్యేకమైన ఫైనాన్షియల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయటానికి అడ్డురావు.
71. కంపెనీలకు కొన్ని అధికరణలు
(1) ఈ చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయవచ్చు.
() ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కంపెనీలకు చెందిన షేర్లను, ఇతర అంశాలను- రెండు రాష్ట్రాలకు పంచవచ్చు.
(బి) బోర్డు ఆఫ్ డైరెక్టర్లను పునర్వ్యవస్థీకరించటం ద్వారా రెండు రాష్టాలకు తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించటం.
72. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్పోర్టు పర్మిట్లను కొనసాగించటం వంటి తాత్కాలిక అంశాలు
మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని 89వ సెక్షన్ ప్రకారం ప్రస్తుత ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జారీచేసిన పర్మిట్లు, అవి ఏ ప్రాంతానికైతే జారీచేశారో, ఆ ప్రాంతంలో కొనసాగుతాయి. ఆ పర్మిట్లు ఆఖరి తేదీ దాకా అవి కొనసాగుతాయి. ఈ పర్మిట్లకు స్టేట్ ట్రాన్స్పోర్టు అథారిటీ ఆఫ్ తెలంగాణ కానీ, మరే ఇతర సంస్థ కాని మళ్లీ వాటిపై కౌంటర్ సైన్ చేయాల్సిన అవసరం లేదు.
ఒక వేళ కేంద్ర ప్రభుత్వం అవసరమనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ పర్మిట్లలో మార్పులను చేయవచ్చు.
(2) ఈ పర్మిట్లు ఉన్న వాహనాలకు ఏవైనా మినహాయింపులు ఉంటే అవి కొనసాగుతాయి. వాటిపై అదనంగా టోల్లుగానీ, ఇతర ఫీజులుగానీ విధించకూడదు. ప్రైవేట్ ఆపరేటర్లకు సంబంధించిన (టోల్గేట్లు) వీటిని కొనసాగిస్తారు.
73. కొన్ని కేసుల్లో రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్
ఈ చట్టప్రకారం ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ఆధారంగా ఏర్పాటు చేసిన కో ఆపరేటివ్ సొసైటీలలో జరిగే మార్పులకు, దాని ద్వారా ప్రభావితమయ్యే ఉద్యోగులకు ఎటువంటి పరిహారం లభించదు.
() ఆ ఉద్యోగికి కొత్తగా లభించే సర్వీసు నిబంధనలు పాత వాటికన్నా తక్కువగా ఉంటే.
(బి) దీని వల్ల ఆ ఉద్యోగి సర్వీసుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంటే.
74. ఇన్‌కంటాక్స్‌కు సంబంధించిన ప్రత్యేక అధికరణలు
ఇన్‌కంటాక్స్ చట్టం-1961లోని అధికరణల ప్రకారం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఇతర సంస్థలకు సంబంధించిన ఆస్తులు, అప్పులు ఇతర సంస్థలకు బదిలీ చేయటానికి అనుమతి లభిస్తుంది.
75. (1) ఈ చట్టంలోని 10వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థలు అందిస్తున్న సేవలు అందరికీ చేరుతుంటే- వాటిని కొనసాగనివ్వాలి. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఏడాది లోపు ఒప్పందం కుదరాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటిని కొనసాగించాలి.
(2) కేంద్ర ప్రభుత్వం ఏడాదిలోపు అధికార గెజిట్లో పదో షెడ్యూల్లో ఉన్న సంస్థలను మార్చవచ్చు. లేదా అదనంగా చేయవచ్చు.
పార్ట్-8
సర్వీసులకు సంబంధించిన నిబంధనలు
76. అఖిల భారత సర్వీసులు
(1) అఖిల భారత సర్వీసుకు సంబంధించిన 'స్టేట్ కేడర్'లో
) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (కేడర్) రూల్స్-1954 వర్తిస్తాయి.
బి) ఇండియన్ పోలీస్ సర్వీస్ (కేడర్) రూల్స్ - 1954 నిబంధనలు వర్తిస్తాయి.
సి) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (కేడర్) రూల్స్ -1954 నిబంధనలు వర్తిస్తాయి.
(2) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేడర్లను... నియమిత తేదీ నుంచి రెండు ప్రత్యేక కేడర్లుగా... అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేడర్లుగా పరిగణిస్తారు.
(3) సబ్ సెక్షన్ 2లో పేర్కొన్న స్టేట్ కేడర్ల ప్రొవిజనల్ స్ట్రెంత్, కంపోజిషన్, కేటాయింపును నియమిత తేదీ లేదా ఆ తర్వాతి నుంచి అమలు అయ్యేలా భారత ప్రభుత్వం తన ఆదేశాల ద్వారా నిర్దేశించవచ్చు.
(4) పైన పేర్కొన్న సర్వీసుల్లోని అధికారులు నియమిత తేదీ నుంచి ఆయా రాష్ట్రాల కేడర్లలో అదే సర్వీస్లో కొనసాగుతారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయవచ్చు.
(5) ఈ విభాగంలో పేర్కొన్న వివరాలేవీ ఆల్ ఇండియా సర్వీసెస్ చట్టం-1951, దాని ప్రకారం విధించిన నిబంధనలపై ఎలాంటి ప్రభావం చూపవు.
77 ఇతర సర్వీసులు
1. తెలంగాణ కార్యకలాపాలకు అవసరమని భావిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తే మినహా... ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి పని చేస్తున్న అధికారులు అదే వ్యవహారాలలో కొనసాగుతారు. అయితే, విభజన తేదీ నుంచి ఏడాది ముగిసిన తర్వాత జారీ చేసే ప్రతి ఆదేశాన్ని కొత్త రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించి జారీ చేయాలి.
2. విభజన తర్వాత వెనువెంటనే కేంద్రం ప్రత్యేక లేదా సాధారణ ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగులు ఎంపిక చేసుకునే ఆప్షన్ను బట్టి ఏ రాష్ట్రంలో సర్వీసును కేటాయించాలో నిర్ణయించాలి. అయితే, కేటాయింపు తర్వాత కూడా సర్వీసులో ఏదైనా కొరత తీర్చడానికి వీలుగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అధికారులను కేంద్రం డిప్యూట్ చేయవచ్చును. స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లకు సంబంధించిన ఉద్యోగులు అదే కేడర్లో కొనసాగాలి. సదరు కేడర్ల ఉద్యోగులు ఏ ప్రాంతంలో ఉంటే వారిని ఆ రాష్ట్రానికే కేటాయించినట్లు భావించాలి. అయితే ఇరు రాష్ట్రాల్లోకి ప్రత్యేక జోన్ లేదా మల్టీ జోన్ వచ్చినట్లయితే, ఆ ప్రాంత ఉద్యోగులను నిబంధనల ప్రకారం ఏదో ఒక రాష్ట్రానికి కేటాయించాల్సి ఉంటుంది.
3. ఈ నిబంధనల ప్రకారం కేటాయింపులు పొందిన ఉద్యోగి గతంలో అక్కడ పనిచేయనట్లయితే కొత్తగా ఏర్పడిన ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన తేదీ నుంచి కొత్త ప్రాంతంలో పనిచేయడానికి సంసిద్ధంగా ఉండాలి. ఈ సెక్షన్ కింద ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
78. సర్వీసులకు సంబంధించిన ఇతర నిబంధనలు
1. కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో పని చేస్తున్న ఉద్యోగుల సర్వీసు నిబంధనల రూపకల్పనకు ఈ సెక్షన్ లేదా 77వ సెక్షన్.. రాజ్యాంగంలోని నిబంధనలకు భంగం కలిగిస్తున్నట్లు భావించరాదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినట్లు భావించిన ఎవరైనా వ్యక్తి విషయంలో వర్తించే సర్వీసు షరతులు కేంద్ర ప్రభుత్వం పూర్వామోదంతో తప్ప, ఆయనకు నష్టకరంగా ఉండరాదు.
2. () ఏదైనా రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగిని ఆ రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి పనిచేస్తున్నట్లుగా భావించాలి.
(బి) ఉద్యోగిని కేంద్రానికి కేటాయిస్తే ఆయన కేంద్ర వ్యవహారాలను నిర్వహిస్తున్నట్లుగా భావించాలి.
3. 77వ విభాగంలోని నిబంధనలేవీ అఖిల భారత సర్వీసు సభ్యులకు వర్తించరాదు.
79. అధికారుల కొనసాగింపు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతంలోని ఏదైనా పదవి లేదా కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి.. కొత్తగా ఏర్పాటయ్యే సంబంధిత రాష్ట్రంలోని అదేమాదిరి పదవి లేదా కార్యాలయంలో కొనసాగాలి. సదరు ఉద్యోగి ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం లేదా సముచిత అధికారవర్గంచే తగురీతిగా నియమితుడైనట్లు భావించాలి. అయితే, సదరు ఉద్యోగి నియామకానికి సంబంధించి అధికార వర్గం తగిన ఉత్తర్వులు చేసేందుకు ఈ సెక్షన్ అడ్డుకాబోదు.
80 సలహా సంఘాలు
1. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2013 ఆమోదం పొందిన 30 రోజుల్లోగా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సలహా సంఘాలను కేంద్రం ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రక్రియలో కర్తవ్యాలను నిర్వర్తించడానికి, ప్రభావిత వ్యక్తులందరికీ సముచితమైన, సమధర్మమైన అవకాశాలను కల్పించడానికి ఈ సంఘాలను ఉద్దేశించడమైనది. వీటికి మార్గనిర్దేశకాలను కేంద్రం జారీ చేస్తుంది.
81. కేంద్ర ప్రభుత్వ అధికారాలు
విభజన ప్రక్రియలో భాగంగా అవసరమైన నిబంధనలకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తగిన ఆదేశాలు ఇస్తుంది.
82. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు నిబంధనలు
రాష్ట్ర విభజన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి గల సంస్థల్లోని ఉద్యోగులు అదే స్థానంలో ఏడాది పాటు కొనసాగుతారు. ఈ సమయంలో సంబంధిత సంస్థ యాజమాన్యం.. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తుంది.
83. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
1. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న పబ్లిక్ సర్వీసు కమిషన్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్గా ఉంటుంది. ప్రస్తుత చైర్మన్, సభ్యులు కూడా అందులోనే కొనసాగుతారు.
2. తెలంగాణ రాష్ట్రానికి 315 అధికరణం కింద మరో పబ్లిక్ సర్వీసు కమిషన్ను ఏర్పాటు చేసేంత వరకు ఆ రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు వీలుగా రాష్ట్రపతి ఆమోదంతో 4వ అధికరణం కింద కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ను ఉపయోగించుకోవచ్చు.
పార్ట్-9
జలవనరుల నిర్వహణ, అభివృద్ధి
84. గోదావరి, కృష్ణా నదీ జలాల వనరులు..
వాటి నిర్వహణ మండళ్లకు అపెక్స్ కౌన్సిల్
కృష్ణా, గోదావరి నదీ జలాల నిర్వహణ మండలి కోసం కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తుంది. అపెక్స్ కౌన్సిల్కు కేంద్ర జలవనరుల మంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. గోదావరి, కృష్ణా నదుల మండళ్ల నిర్వహణ బాధ్యతలను ఈ అపెక్స్ కౌన్సిల్ చేపడుతుంది. అవసరమైన సందర్భాల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రతిపాదనలను రూపొందించడం, ఆమోదించడంతోపాటు నదీ నిర్వహణ మండళ్లు, కేంద్ర జలసంఘానికి అందజేసే ప్రతిపాదనలను అపెక్స్ కౌన్సిల్ మదింపు చేస్తుంది. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపణీపై ఏదైనా వివాదం తలెత్తితే సంప్రదింపుల ద్వారా పరస్పర ఒప్పందాలు కుదుర్చుకుని పరిష్కరించుకోవాలి. 1956లోని 33వ చట్టం ప్రకారం కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ కిందకు రాని వివాదాలపై నిర్దేశించిన మేరకు అంతర్రాష్ట వివాదాల చట్టం కింద ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి.
85. జల నిర్వహణ మండలి ఏర్పాటు.. విధులు
1. రాష్ట్రం ఏర్పాటైన 60 రోజుల్లోగా ప్రస్తుత, భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టుల పరిపాలన, క్రమబద్ధీకరణ, నిర్వహణ, పనితీరు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం విడిగా గోదావరి జల నిర్వహణ మండలి, కృష్ణా నదీ నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలి.
2. గోదావరి నదీ నిర్వహణ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రంలోనూ, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లోనూ ఏర్పాటు చేయాలి..
3. ఈ బోర్డులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేస్తాయి. ఈ బోర్డుల చైర్మన్లను, సభ్యులను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది.
5. ఈ బోర్డులకు కేంద్రం నియమించే చీఫ్ ఇంజనీర్ హోదా గల వ్యక్తి పూర్తిస్థాయి సభ్య కార్యదర్శిగా ఉంటారు.
బోర్డుల విధులు
కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటి సరఫరా నియంత్రణ-1956, అంతర్రాష్ట నదీ జలాల వివాదాల చట్టం కింద ఏర్పడిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా.. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరే ఇతర రాష్ట్రంతో, కేంద్ర పాలిత ప్రాంతంతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా తమ విధానాలు, వి«ధులను, విద్యుత్ సరఫరా నియంత్రణను ఈ బోర్డులు నిర్వహిస్తాయి. నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపట్టే పనులను ఈ బోర్డులు మదింపు చేస్తాయి. గోదావరి, కృష్ణా నదులపై నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను మదింపు చేస్తాయి. 11వ షెడ్యూల్లో పేర్కొన్న సూత్రాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం అప్పగించే ఇతర కర్తవ్యాలను కూడా నిర్వహిస్తాయి.
86. నిర్వహణ బోర్డు సిబ్బంది
తమ విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఈ బోర్డులు సమకూర్చుకుంటాయి. ముందుగా కొత్తగా ఏర్పడే ఇరు రాష్ట్రాల నుంచి సమాన నిష్పత్తిలో సిబ్బందిని డిప్యుటేషన్పై తీసుకుంటాయి. ఈ సిబ్బంది జీతభత్యాలతో సహా అన్ని రకాల వ్యయాలకు అవసరమైన ని«ధులను కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రభుత్వాలు సమకూర్చుతాయి. ఈ బోర్డుల సమర్థ నిర్వహణకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తగిన ఆదేశాలను జారీ చేయవచ్చు.
87. మండలి పరిధి
ఈ బోర్డుల పరిధి గోదావరి, కృష్ణా నదులకు విస్తరించి ఉంటుంది. ప్రాజెక్టులు, బ్యారేజీలు, డ్యామ్‌లు, రిజర్వాయర్ల నియంత్రణ, నిర్మాణాలు, నీటిని విడుదల చేసే వ్యవస్థలు, విద్యుత్ పంపిణీ లైన్లు మొదలైనవి ఈ బోర్డు పరిధిలో ఉంటాయి.
88. మండలి అధికారం..
చట్ట ప్రకారం బోర్డుకు అవసరమైన నియమ నిబందనలను రూపొందించుకోవచ్చు.
89. నీటి వనరుల కేటాయింపు..
ఇప్పటి వరకు ఏ ట్రిబ్యునల్ కూడా కేటాయింపులు చేయని ప్రాజెక్టులకు కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేస్తుంది. నీటిప్రవాహం తగ్గిన సందర్భాల్లో ప్రాజెక్టులవారీగా నీటి విడుదలను పర్యవేక్షిస్తుంది.
90. పోలవరం నీటి పారుదల - జాతీయ ప్రాజెక్టు
పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తారు. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లో సంప్రదించి కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు పనులను నిర్వహిస్తుంది.
91. తుంగభద్ర బోర్డు ఏర్పాటు
తుంగభద్ర బోర్డులో ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదులుగా కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉంటాయి. హైలెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్, రాజోలి బండ మళ్లింఫు పథకాలకు నీటి విడుదలను తుంగభద్ర బోర్డు పర్యవేక్షిస్తుంది.
పార్ట్-10
మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ఆర్థిక చర్యలు
92. కేంద్రం జారీ చేసిన మూల సూత్రాలు, మార్గదర్శకాలను కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు అనుసరించడం
12వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా బొగ్గు, చమురు, సహజవాయువు, విద్యుదుత్పత్తి, ట్రాన్స్‌మిషన్, పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మూల సూత్రాలు, మార్గదర్శకాలు, ఆదేశాలు, ఉత్తర్వులను కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు అవి ఏర్పాటైన తేదీ నుంచి అమలు చేయాలి.
93. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతి, అభివృద్ధి కోసం చర్యలు
కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతి, సుస్థిర అభివృద్ధి కోసం 13వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.
94. పన్ను ప్రోత్సాహకాలు, ఆర్థిక చర్యలు
1. రెండు రాష్ట్రాల్లోనూ పారిశ్రామికీకరణను, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహకాలు సహా తగు విధమైన ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి.
2. రెండు రాష్ట్రాల్లో భౌతిక, సాంఘికపరమైన విస్తరణతో సహా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహాయపడాలి.
3. రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ఇతర మౌలిక సదుపాయాలు సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిలో అవసరమైన సౌకర్యాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అందించాలి.
4. అవసరమని భావిస్తే అటవీ ప్రాంతాన్ని డీ నోటిఫై చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్రం వీలు కల్పించాలి,.
పార్ట్-11
ఉన్నత విద్య
95. విద్యార్థులందరికీ సమాన అవకాశాలు
కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య విషయంలో సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ఉన్నత, సాంకేతిక, వృత్తివిద్యలో ప్రస్తుతమున్న అడ్మిషన్ల కోటాను పదేళ్లకు మించకుండా కొనసాగించాలి. ఆ కాలంలో ప్రస్తుతమున్న ఉమ్మడి అడ్మిషన్ ప్రక్రియ కొనసాగాలి.
పార్ట్-12
న్యాయ సంబంధ, ఇతర నిబంధనలు
96. రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 సవరణ
రాజ్యాంగంలోని ఆర్టికల్ 168లోని క్లాజ్(1)లోని సబ్క్లాజ్ ()లో తమిళనాడు అనే పదానికి బదులు 'తమిళనాడు, తెలంగాణ' అనే పదాలు చేర్చాలి.
- 97. రాజ్యాంగంలోని 371డి ఆర్టికల్కు సవరణ
రాజ్యాంలోని 371డి ఆర్టికల్లో నిర్దేశిత తేదీ నుంచి కింది సవరణలు చేయాలి.
. ఉపాంత శీర్షికలో 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం' అనే పదాలకు బదులు 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రం' అనే పదాలు చేర్చాలి.
బి. క్లాజ్(1) స్థానంలో ఈ కింది ఖండాన్ని చేర్చాలి.
(1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఒక్కో రాష్ట్రం అవసరాలను దృష్టిలో పెట్టుకుని అట్టి రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సమాన అవకాశాలు, సౌకర్యాలు కల్పించాలి. ఆ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు భిన్న నిబంధనలను రూపొందించవచ్చు.
సి. క్లాజ్(3)లోని 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం' పదానికి బదులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం అనే పదాలు చేర్చాలి.
- 98. ప్రాతినిధ్య చట్టంలోని 15ఎ సెక్షన్ సవరణ
1951, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 15ఎ సెక్షన్లో 'తమిళనాడు శాసన పరిషత్తు చట్టం-2010' కింద ఉన్న పదాలు, సంఖ్యల తర్వాత.. 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2013' కింద 'తెలంగాణ రాష్ట్ర శాసనపరిషత్ ఏర్పాటు' అనే పదాలను, సంబంధిత సంఖ్యలను చేర్చాలి.
- 99. సెక్షన్ 15 సవరణ
నిర్దేశిత తేదీ నుంచి 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 15లోని క్లాజ్ (బి)లో 'ఆంధ్రప్రదేశ్' అనే పదానికి బదులు 'ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ' పదాలు చేర్చాలి.
-100. చట్టాల విస్తరణ
11వ భాగంలోని నిబంధనలు, రాష్ట్ర విభజనకు ముందు అమలులో ఉన్న 1973 ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు (వ్యవసాయ కమతాలపై గరిష్ఠ పరిమితి) చట్టం, ఏదైనా ఇతర చట్టం విస్తరించే లేదా వర్తించే ప్రాంతాల్లో మార్పులు చేసినట్లు పరిగణించరాదు. అట్టి చట్టంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాంతాల ప్రస్తావనలను, శాసనమండలి లేదా తగిన అధికారి ద్వారా మార్పులు చేసే వరకూ అట్టి ప్రాదేశిక ప్రాంతాలను విభజనకు ముందున్న ఆంధ్రప్రదేశ్లోనివిగా అన్వయించుకోవాలి.
- 101. చట్టం అనుసరణకు అధికారం
విభజనకు ముందున్న ఏదైనా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రానికి వర్తింప చేసుకోవడానికి వీలుగా సముచిత ప్రభుత్వం, రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి రెండేళ్లలోగా ఒక ఉత్తర్వు ద్వారా సంబంధిత చ ట్టంలోని నిబంధనలను ఆవశ్యకమైన, ఉపయుక్తమైన విధంగా తొలగించడం లేదా సవరణ కానీ చేసుకోవచ్చు. శాసనమండలి కానీ, తగిన అధికార విభాగం కానీ చట్టంలో తగిన మార్పుచేర్పులు చేసేవరకు ఈ మార్పులు అమలులో ఉండాలి.
- 102. చట్టాలను అన్వయించుకోవడానికి అధికారం..
విభజనకు ముందున్న చట్టాన్ని అనుసరించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదా తెలంగాణ రాష్ట్రానికి వర్తింపజేసేందుకు వీలుగా సవరణ అవసరమని, యుక్తమని ఏదైనా న్యాయస్థానం, ట్రిబ్యునల్ లేదా అ«థారిటీ భావిస్తే ఆ చట్టంలోని సారాంశం దెబ్బతినకుండా అన్వయించుకోవాలి.
- 103. చట్టబద్ధ విధులను నిర్వర్తించడానికి అథారిటీల నియామకం
కొత్త రాష్ట్రం ఏర్పాటైన తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి బదలాయించిన ప్రాంతం పరిధిలో చట్ట ప్రకారం వర్తించే విధులను నిర్వర్తించడానికి సంబంధిత అథారిటీని, అధికారిని నియమించవచ్చు.
- 104. న్యాయ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపకాలకు లోబడిన ఏదైనా ఆస్తి హక్కులు లేదా అప్పులకు సంబంధించి విభజనకు ముందు ఏవైనా కేసుల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కక్షిదారుగా ఉంటే, ఆ స్థానంలో ఆయా ఆస్తి హక్కు, వాటా పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రం ప్రతినియుక్తమవ్వాలి లేదా ఆయా కేసుల్లో కక్షిదారుగా చేరాలి.
- 105. పెండింగ్ విచారణల బదిలీ
1. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతంలోని న్యాయస్థానం(హైకోర్టు మినహాయించి), ట్రిబ్యునల్, అథారిటీ లేదా అధికారి ముందు పెండింగ్లో ఉన్న ప్రతి ప్రొసీడింగ్... తెలంగాణ ప్రాంతానికి సంబంధించినదైతే ఆ రాష్ట్రం ఏర్పడిన తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని సమరూప అధికార పరిధి ఉన్న న్యాయస్థానం, ట్రిబ్యునల్, అథారిటీ లేదా అధికారికి బదిలీ అవుతుంది.
2. ఉప సెక్షన్() కింద ఏదైనా ప్రొసీడింగ్ను బదిలీ విషయమై ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, ఆ విషయాన్ని హైదరాబాద్లోని హైకోర్టుకు నివేదించాలి. ఆ విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం.
- 106. న్యాయవాదులకు హక్కు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా దిగువ న్యాయస్థానంలో ప్రాక్టీసు చేసుకునే హక్కు కోసం... విభజనకు ముందు న్యాయవాదిగా నమోదైన వ్యక్తి కొత్త రాష్ట్రం ఏర్పడిన తేదీ నుంచి ఏడాది పాటు ఆ న్యాయస్థానాల్లో , ఆయా న్యాయస్థానాల అధికార పరిధిలోని ఏదైనా ప్రాంతం మొత్తంగా కానీ లేదా దానిలో ఏదైనా కొంత భాగం కానీ తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయిందనే దానితో నిమిత్తం లేకుండా ప్రాక్టీసు చేసుకోవచ్చు.
-107. ఈ చట్టంలోని నిబంధనల ప్రభావం
ఏదైనా ఇతర చట్టంలో ఉన్న నిబంధనలకు అసంగతంగా ఉన్నాయన్న దానితో నిమిత్తం లేకుండా ఈ చట్టంలోని నిబంధనలు అమలులో ఉండాలి.
- 108. సంకటాలను తొలగించే అధికారం
1. ఈ చట్టంలోని నిబంధనలను అమలు చేయడంలో ఏదైనా సంకటం ఏర్పడితే దాన్ని తొలగించడానికి అవసరమైతే రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వవచ్చు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పాటైన మూడేళ్ల తర్వాత అట్టి ఉత్తర్వులను జారీ చేయరాదు.
2. ఈ సెక్షన్ కింద జారీ చేసిన ప్రతి ఉత్తర్వును పార్లమెంటు ముందుంచాలి.
- See more at: http://www.andhrajyothy.com/node/43600#sthash.5NSEX6YN.dpuf



ఒక బిల్లు 13షెడ్యూళ్లు
సింగరేణి తెలంగాణకే...
చమురు,సహజ వాయువు ఆంధ్రప్రధేశ్కు
కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపులకు కట్టుబడాలి
ఆరు నెలల్లో ఇరు రాష్ట్రాలకూ ఈఆర్సీ
ఎక్కడి విద్యుత్కేంద్రాలు అక్కడికే
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంస్ధల ఏర్పాటు
బిల్లులోని షెడ్యూళ్లలో సమగ్ర వివరణ
మొదటి షెడ్యూలు
01. రాజ్యసభ సభ్యులైన టి.సుబ్బిరామిరెడ్డి, నంది ఎల్లయ్య, మహ్మద్ అలీ ఖాన్, టి.రత్నాబాయి, కె.వి.పి.రామచంద్రరావుల పదవీ కాలం 2014 ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. రాజ్యసభ సిటింగ్ సభ్యులకు సంబంధించి వీరిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించే ఏడు సీట్లలో రెండింటికి రాజ్యసభ చైర్మన్ లాటరీ పద్ధతిలో ఇద్దరిని ఎంపిక చేస్తారు. మిగిలిన ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 11 మంది సిటింగ్ సభ్యుల్లో మిగిలిన నలుగురినీ ఎంపిక చేసినట్టు భావించాలి.
02. రాజ్యసభ సభ్యులైన జె.డి.శీలం, జైరాం రమేశ్, ఎన్.జనార్దనరెడ్డి, వి.హనుమంతరావు, గుండు సుధారాణి, వై.ఎస్.చౌదరిల పదవీ కాలం 2016 జూన్ 21తో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన రెండు సీట్లను భర్తీ చేయడానికి వీలుగా రాజ్యసభ చైర్మన్ లాటరీ పద్ధతిలో వీరిలో ఇద్దరిని ఎంపిక చేస్తారు. మిగిలిన ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నాలుగు సీట్లకు మిగిలిన నలుగురిని ఎంపిక చేసినట్టు భావించాలి.
03. రాజ్యసభ సభ్యులైన రాపోలు ఆనందభాస్కర్, కె.చిరంజీవి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రేణుకా చౌదరి, టి.దేవేందర్ గౌడ్, సి.ఎం. రమేశ్ల పదవీ కాలం 2018 ఏప్రిల్ 2తో ముగుస్తుంది. తెలంగాణకు కేటాయించిన నాలుగు సిటింగ్ సీట్లలో రాజ్యసభ చైర్మన్ లాటరీ విధానంలో నలుగురిని ఎంపిక చేసి భర్తీ చేస్తారు. మిగిలిన ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన రెండు సీట్లకు మిగిలిన ఇద్దరిని ఎంపిక చేసినట్లు భావించాలి.
04. టీడీపీకి చెందిన నందమూరి హరికృష్ణ 2013 ఆగస్టు 22న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటు పదవీ కాలం 2014 ఏప్రిల్ 9తో ముగుస్తుంది. ఆ సీటును మిగిలిన ఆంధ్రప్రదేశ్కు కేటాయించడమైంది.
రెండో షెడ్యూలు
(పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వుకు సవరణలు-2008)
పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వు-2008లో..
01. షెడ్యూల్ 3లో...
టేబుల్ -.. అసెంబ్లీ నియోజకవర్గాలు
(1) అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టేబుల్-ఎ లోని వరుస సంఖ్యలు 1 నుంచి 119 వరకు (రెండూ కలిపి) మరియు వాటికి సంబంధించిన ఎంట్రీలను తొలగించాలి;
(2) పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన టేబుల్ -బి లోని వరుస సంఖ్యలు 1 నుంచి 17 వరకు (రెండూ కలిపి) మరియు వాటికి సంబంధించిన ఎంట్రీలను తొలగించాలి.
02. షెడ్యూలు 26 తర్వాత, షెడ్యూల్-26 ()ను చేర్చి.. 'తెలంగాణ' అని పేర్కొనాలి. దాని కింద టేబుల్ -ఎ లో అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలను పేర్కొనాలి.
టేబుల్-ఎలో ఎన్నికల సంఘం పునర్విభజించినట్లు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు, పరిధిని పేర్కొనాలి.
టేబుల్ - బి, పార్లమెంటు నియోజకవర్గాలు
తెలంగాణ రాష్ట్రం పరిధిలోకి వచ్చే పార్లమెంటు నియోజకవర్గాలు.. వాటి పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలు.
1. ఆదిలాబాద్ (ఎస్టీ)- సిర్పూర్, ఆసిఫాబాద్ (ఎస్టీ), ఖానాపూర్ (ఎస్టీ), ఆదిలాబాద్, బోథ్ (ఎస్టీ), నిర్మల్, ముథోల్.
2. పెద్దపల్లి (ఎస్సీ) - చెన్నూరు (ఎస్సీ), బెల్లంపల్లి (ఎస్సీ), మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి
3. కరీంనగర్ - కరీంనగర్, చొప్పదండి (ఎస్సీ), వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు (ఎస్సీ), హుజూరాబాద్, హుస్నాబాద్.
4. నిజామాబాద్ - ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల.
5. జహీరాబాద్ - జుక్కల్ (ఎస్సీ), బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణ్‌ఖేడ్, ఆందోల్ (ఎస్సీ), జహీరాబాద్ (ఎస్సీ).
6. మెదక్ - సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్.
7. మల్కాజిగిరి - మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ).
8. సికింద్రాబాద్ - ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్.
9. హైదరాబాద్ - మలక్పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్‌పుర, బహదూర్‌పుర.
10. చేవెళ్ల - మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల (ఎస్సీ), పరిగి, వికారాబాద్ (ఎస్సీ), తాండూరు.
11. మహబూబ్‌నగర్ - కొడంగల్, నారాయణపేట్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మఖ్తల్, షాద్‌నగర్.
12. నాగర్ కర్నూలు (ఎస్సీ) - వనపర్తి, గద్వాల్, అలంపూర్ (ఎస్సీ), నాగర్ కర్నూలు, అచ్చంపేట (ఎస్సీ), కల్వకుర్తి, కొల్లాపూర్.
13. నల్లగొండ - దేవరకొండ (ఎస్టీ), నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ.
14. భువనగిరి - ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్ (ఎస్సీ), తుంగతుర్తి (ఎస్సీ), ఆలేరు, జనగాం.
15. వరంగల్ (ఎస్సీ) - స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట (ఎస్సీ), భూపాలపల్లి.
16. మహబూబాబాద్ (ఎస్టీ) - డోర్నకల్ (ఎస్టీ), మహబూబాబాద్ (ఎస్టీ), నర్సంపేట, ములుగు (ఎస్టీ), పినపాక (ఎస్టీ), ఎల్లెందు (ఎస్టీ), భద్రాచలం (ఎస్టీ).
17. ఖమ్మం - ఖమ్మం, పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), సత్తుపల్లి (ఎస్సీ), కొత్తగూడెం, అశ్వారావుపేట (ఎస్టీ).
షెడ్యూల్ 3
-ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నియోజకవర్గాల పునర్విభజనలో మార్పులకు సంబంధించిన ఉత్తర్వులు, 2006 శాసన మండలి నియోజకవర్గాల పునర్విభజన (ఆంధ్రప్రదేశ్) ఉత్తర్వు, 2006కు చేర్చిన టేబుల్కు బదులు ఈ కింది టేబుల్ను చేర్చాలి.
షెడ్యూలు - 4
- కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పడిన తాత్కాలిక శాసన మండళ్లలోని సభ్యుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీల తాత్కాలిక జాబితా
- స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎంపికైన వారి వివరాలు, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల నుంచి ఎంపికైన వారి వివరాలు, నామినేట్ అయిన సభ్యుల వివరాలు, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపికైన వారి వివరాలను పేర్కొన్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీల జాబితా..
- స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎంపికైన వారి వివరాలు, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల నుంచి ఎంపికైన వారి వివరాలు, నామినేట్ అయిన సభ్యుల వివరాలు, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపికైన వారి వివరాలను పేర్కొన్నారు.
షెడ్యూల్ 5
 'తెలంగాణ'లోని షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల పేర్లను సవివరంగా పేర్కొన్నారు.
షెడ్యూల్ 6
- 'తెలంగాణ'లోని షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులతోపాటు కొత్తగా చేర్చాల్సిన తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డు తెగల పేర్లను సవివరంగా పేర్కొన్నారు.
షెడ్యూల్ 7
- నిధుల జాబితా
తరుగుదల రిజర్వు నిధులు - ప్రభుత్వ వాణిజ్య విభాగాలు మరియు ప్రభుత్వరంగ సంస్థల పరిధిలోకి వచ్చే ముఖ్యమంత్రి సహాయనిధి, ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్, జమీందారీ అబాలిషన్ ఫండ్ వంటి 41 సంస్థల ఫండ్ జాబితాలను పేర్కొన్నారు.
షెడ్యూల్ 8
- పింఛన్లకు సంబంధించి బాధ్యతల పంపిణీ
- కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో మంజూరు చేసిన పింఛన్లను రెండు రాష్ట్రాలూ సంబంధిత ట్రెజరీల నుంచే పింఛన్లను చెల్లించాలి.
- ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు సేవలందించి రిటైరైన అధికారులు, లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ముందు పదవీ విరమణ నేపథ్యంలో సెలవుపై వెళితే.. ఆ రోజుకు ముందు పింఛన్లు పెండింగ్లో ఉంటే వాటిని చెల్లించే బాధ్యత మిగిలిన ఆంధ్రప్రదేశ్దే!
- పింఛన్లు, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను ఇరు రాష్ట్రాలూ జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాలి. ఏదైనా ఒక రాష్ట్రం తనకు కేటాయించిన కోటా కంటే ఎక్కువ చెల్లిస్తున్నట్లు అయితే.. ఆ అదనపు మొత్తాన్ని తక్కువ కడుతున్న రెండో రాష్ట్రం బకాయిలు చెల్లిస్తున్న రాష్ట్రానికి ఇవ్వాలి.
- కొత్త రాష్ట్రం ఏర్పాటైన తేదీ కంటే ముందు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పింఛన్లు మంజూరై, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బయట ఆ పింఛన్లను తీసుకుంటుంటే.. అలాంటి పింఛన్లన్నింటినీ మిగిలిన ఆంధ్రప్రదేశ్ భరించాలి.
- కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ముందు రోజు వరకు, లేదా ఆ రోజు వరకు సేవలందిస్తూ ఏ అధికారి అయినా రిటైరైతే, ఏదేని రాష్ట్రం అతనికి పింఛన్ను మంజూరు చేస్తే, ఆ పింఛన్లోని కొంత భాగం, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలన్నిటినీ జనాభా నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి.
షెడ్యూల్ 9
8 రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల జాబితా, వాటి చిరునామాలు
షెడ్యూల్ 10
- 42 రాష్ట్ర ప్రభుత్వ శిక్షణ సంస్థల్లో ప్రస్తుత వసతుల కొనసాగింపు. ఆ శిక్షణ సంస్థలు/కేంద్రాల పేర్ల జాబితా.
షెడ్యూల్ 11
- నదుల యాజమాన్య బోర్డుల నిర్వహణ నియమాలు
- కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ నిర్ణయించిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. ఆ కేటాయింపుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్ను ప్రకటిస్తుంది.
- సాగునీరు, విద్యుదుత్పత్తి అవసరాల మధ్య వివాదం తలెత్తితే.. సాగునీటి అవసరాలకే ప్రాధాన్యమివ్వాలి.
- సాగునీరు, తాగునీటి అవసరాల మధ్య వివాదం తలెత్తితే, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమివ్వాలి.
-గోదావరి, కృష్ణా, పెన్నా నదులపై సంబంధిత నదీ జలాల ట్రిబ్యునళ్లు చేసిన నికర జలాల కేటాయింపుల్లో ఎలాంటి మార్పు ఉండదు.
- ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బాధ్యత రెండు రాష్ట్రాలకు ఉంటుంది. కృష్ణా, గోదావరి, పెన్నా నదుల పరిధిలో వచ్చే ప్రకృతి వైపరీత్యాలు, కరువు, వరదల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చేయాల్సిన విధులను నదీ జలాల బోర్డులు సూచిస్తాయి. ఆ బోర్డులకు పూర్తి అధికారాలుంటాయి. వాటిని రెండు రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలి.
- ఉన్నత కౌన్సిల్ లేదా బోర్డుల అనుమతి లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గోదావరి, కృష్ణా, పెన్నా నదులపై కొత్త ప్రాజెక్టులను నిర్మించరాదు. ఉన్నత కౌన్సిల్ అనుమతికి ముందు బోర్డులు సాంకేతిక అనుమతి ఇవ్వాలి.
- ఆయా రాష్ట్రాలే కొత్త ప్రాజెక్టులను, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి. బోర్డులిచ్చే ఆదేశాలను ఏ రాష్ట్రమైనా అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం విధించే కఠిన పెనాల్టీని సదరు రాష్ట్రం ఎదుర్కోవాలి.
షెడ్యూల్ 12
- బొగ్గు, చమురు, గ్యాస్, విద్యుత్ వనరుల విభజన నియమాలు
-సింగరేణిలో తెలంగాణ రాష్ట్రానికి 51% వాటా, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంటుంది.
-ఇప్పటికే చేసుకున్న బొగ్గు ఒప్పందాలన్నీ ఎటువంటి మార్పులు లేకుండా యథావిథిగా కొనసాగుతాయి.
- కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే కొత్త కోల్ ఒప్పంద విధానం ప్రకారం కొత్త రాష్ట్రాలకు బొగ్గు కేటాయింపు ఒప్పందాలు చేసుకోవాలి.
- ప్రస్తుత థర్మల్ కేంద్రాలకున్న కేటాయింపుల ప్రకారం సింగరేణి బొగ్గును సరఫరా చేయాలి.
- కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం సహజ వాయువు కేటాయింపులు జరపాలి.
- చమురు, సహజ వాయువు వెలికితీతపై వచ్చే రాయల్టీని మిగిలిన ఆంధ్రప్రదేశ్కు చెల్లించాలి.
- ఏపీ జెన్కోకు చెందిన విద్యుత్కేంద్రాలు ఎక్కడ ఉన్న కేంద్రాలు ఆయా రాష్ట్రాలకే చెందుతాయి.
- డిస్కంలతో చేసుకున్న ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కొనసాగుతాయి.
-ప్రస్తుత ఈఆర్సీ ఆరు నెలలపాటు రెండు రాష్ట్రాలకూ కొనసాగుతుంది. ఆరు నెలల్లో రెండు రాష్ట్రాలూ కొత్త ఈఆర్సీలను ఏర్పాటు చేసుకోవాలి.
- ఎస్ఎల్‌డీసీ రెండు రాష్ట్రాలకు కలిపి రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఏదైనా వివాదం వస్తే బెంగళూరులోని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ పరిష్కరిస్తుంది.
- 132-కెవి, అంతకంటే ఎక్కువ సామర్థ్యమున్న విద్యుత్ సరఫరా లైన్లను అంతర్రాష్ట్ర లైన్లుగా పరిగణించాలి. ఏ ప్రాంతంలో ఉన్న లైన్లు ఆ రాష్ట్రంలో ఏర్పడే ట్రాన్స్కోకు చెందుతాయి.
- కేంద్ర ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థల్లో ఎవరికీ కేటాయించని విద్యుత్లో తెలంగాణకు 59.62 శాతం, మిగిలిన ఆంధ్రప్రదేశ్కు 40.38 శాతం వాటా ఉంటుంది.
- పదేళ్ల వరకు విద్యుత్ లోటున్న రాష్ట్రానికే మిగులు విద్యుత్ కొనుగోలును తిరస్కరించే మొదటి హక్కు ఉంటుంది.
షెడ్యూల్ 13
విద్య, మౌలికవసతుల వినియోగంపై నియమాలు
-12, 13 పంచవర్ష ప్రణాళికల కాలంలో మిగిలిన ఆంధ్రప్రదేశ్లో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒక ఐఐటీ, ఒక ఎన్ఐటీ, ఒక ఐఐఎం, ఒక ఐఐఎస్ఈఆర్, ఒక సెంట్రల్ విశ్వవిద్యాలయం, ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒక ఐఐఐటీ ఏర్పాటు చేయాలి. ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్-కమ్-టీచింగ్ సంస్థను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. గిరిజన, ఉద్యాన విశ్వవిద్యాలయాలను తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
- మిగిలిన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా దుగరాజపట్నం వద్ద 2018కల్లా కొత్త నౌకాశ్రయాన్ని నిర్మించాలి.
- ఖమ్మం జిల్లాలో స్టీలు ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలను సెయిల్ పరిశీలించాలి.
-ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌లు ఒక గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీని, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలి.
-ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటును కేంద్రం పరిశీలించాలి.
- విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణను కేంద్రం పరిశీలించాలి.
-తెలంగాణలో 4000 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ఏర్పాటును ఎన్టీపీసీ పరిశీలించాలి.
- మిగిలిన ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటును రైల్వే శాఖ పరిశీలించాలి.
- తెలంగాణలోని వెనకబడిన జిల్లాల్లో జాతీయ రహదారి ఏర్పాటును పరిశీలించాలి. తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలించాలి.
- మిగిలిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్కు ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ గురించి కేంద్రం ఆలోచించాలి.
- See more at: http://www.andhrajyothy.com/node/43612#sthash.bANGBepR.dpuf



No comments:

Post a Comment