మతం మారిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవు
హైదరాబాద్, డిసెంబర్ 1: మతం మారిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని, దళిత క్రైస్తవులు తమని ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని దళిత సంఘాలు పేర్కొన్నాయి. ఆదివారం ఇక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో మాలమహానాడు తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జ్ పాలడుగు అనిల్‌కుమార్, టి.మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్‌కుమార్ మాట్లాడారు. దళిత క్రైస్తవులు దళితులు కారని వారు స్పష్టం చేశారు. హిందూ దళితులు రిజర్వేషన్లు పూర్తిగా వదులుకొని వారు కోరుకునే మతంలోకి మారితే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. జీవో 746, 747లను రద్దుచేయాలనడం అన్యాయమని.. వాటిని మరింత పటిష్ఠంగా అమలు చేయాలని వారు అన్నారు. తిరుమల తిరుపతి లాంటి ధార్మిక కేంద్రాలలో అన్యమత ప్రచారానికి వ్యతిరేకంగా ఈ జీవోను తీసుకువచ్చారని గుర్తుచేశారు.
తిరుమల తిరుపతి హిందువులదేనని వారు స్పష్టం చేశారు. తిరుపతిలోని ఇస్లామిక్ యూనివర్సిటీని వెంట నే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దళిత క్రైస్తవులను, ముస్లింలను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ రాజ్యంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారని ధ్వజమెత్తారు. కొంతమంది.. దళితులలో ఉండి రిజర్వేషన్ అనుభవిస్తూ దళితులను ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని, దేశ సంస్కృతి, సంప్రదాయాలను, కట్టు, బొట్టును రూపుమాపే దిశగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరుతో ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తూ అసలైన దళితులకు అన్యాయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కొంతమంది ప్రజాప్రతినిధులు సైతం తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలంటూ కేంద్రానికి ప్రతిపాదిస్తున్నారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తనవంతు కృషి చేస్తున్న స్వామి పరిపూర్ణానంద స్వామిపై నిందలు మోపితే సహించేది లేదని వారు హెచ్చరించారు.
No comments:
Post a Comment